ద్రవ్యలోటు... కాదు చేటు | Economist close to narendra Modi backs higher deficit for India revival | Sakshi
Sakshi News home page

ద్రవ్యలోటు... కాదు చేటు

Published Wed, Jun 11 2014 1:07 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ద్రవ్యలోటు... కాదు చేటు - Sakshi

ద్రవ్యలోటు... కాదు చేటు

అధిక ద్రవ్యలోటుతో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పేమీ కాదనే అభిప్రాయం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక శాస్త్రవేత్తలలో బలపడుతోంది. ఈ మార్పునకు  మోడీ ప్రభుత్వం స్వాగతం పలుకుతుందా? పట్టంగట్టిన ప్రజలు ఆశిస్తున్నట్టుగా రానున్న బడ్జెట్లో ఉపాధి కల్పనకు, ఆదాయాల పెంపుదలకు పెద్ద పీట వేస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.  
 
కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వ ఆర్థిక విధానాలు, వాటి స్వభావం స్పష్టం కావాల్సి ఉంది. 1990లలో నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ద్రవ్యలో టును తగ్గించడమనేదే అన్ని ప్రభుత్వాల ఆర్థిక విధానాలకు కేంద్ర బిందువు. ప్రభుత్వ వార్షిక రాబడి కంటే వ్యయం ఎక్కువగా ఉండటమే ద్రవ్యలోటు. ఉదాహరణకు, పన్నుల వసూళ్లు, తదితర ఆదాయ వనరుల ద్వారా కేంద్రానికి లభించే వార్షిక రాబడి రూ.100, వ్యయం రూ.105 అనుకుంటే... ద్రవ్య లోటు 5 శాతమవుతుంది. ద్రవ్యలోటు తగ్గింపు పేరిట యూపీఏ సర్కారు విధించిన ప్రభుత్వ వ్యయాలలోని కోతలన్నీ ప్రధానంగా సామాన్య ప్రజల సంక్షేమ పథకాలపైనే పడ్డాయి. పైగా వినియోగదారుల సబ్సిడీలు, ఎరువుల సబ్సిడీలలో కూడా కోత లు పడ్డాయి.  ఫలితంగా ఎరువులు, పెట్రో, వంట గ్యాస్ ధరలు పెరిగాయి. యూపీఏ ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకాల ప్రధా న లక్ష్యం ఆహార సబ్సిడీలు సహా వినియోగదారుల సబ్సిడీలన్నిటికీ తూట్లు పొడవడమే. ఈ చర్యలతో ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించగలిగారు. కానీ ఆర్థిక వ్యవస్థ కోలుకున్న దాఖలాలు మాత్రం లేవు.
 
 ఏమిటీ ద్రవ్యలోటు?   
 ఇంతకూ ద్రవ్యలోటు అధికంగా ఉంటే వచ్చి పడే విపత్కర సమస్యలేమిటి? నియంత్రించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటి? అని సందేహం రావ డం సహజం. ద్రవ్యలోటు పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగి, నిత్య జీవితావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయని, కరెన్సీ విలువ పడిపోతుందని పలువురు ఆర్థిక శాస్త్రవేత్తల సమాధానం. అయితే మన దేశంలో వ్యవసాయ, వినియోగ మార్కెట్లలోని గుత్తాధిపత్య ధోరణులు, దొంగ నిల్వల వంటి అక్ర మ వ్యాపార పద్ధతులే ధరలను ప్రత్యేకించి ఆహార, వినియోగ వస్తువుల ధరలను ఎక్కువగా నియంత్రిస్తాయని వారు విస్మరిస్తున్నారు.
 
 ద్రవ్యలోటు గురిం చి ఎక్కువగా ఆందోళన చెందుతున్నది బడా వ్యాపార, పారిశ్రామిక వర్గాలే. 2008 నుంచి అధిక స్థాయిలో ఉన్న (సగటున ఏటా 10 శాతం) ద్రవ్యోల్బణం ఫలితంగా నేడు షేర్  మార్కెట్ సూచి 25,000 స్థాయికి చేరింది. అయినా షే ర్ల నిజ విలువ మాత్రం 2008లో సెన్సెక్స్ 13,000 స్థాయిలో ఉన్నప్పటి స్థా యిలోనే ఉంది. ఇలా పడిపోతున్న షేర్ మార్కెట్ మదుపుల విలువను భర్తీ చేసుకోవాలని వ్యాపార వర్గాల తాపత్రయం. ద్రవ్యలోటును తగ్గించడం పేరిట సంక్షేమ వ్యయాలలో కోతలను విధించి, ప్రభుత్వ రాయితీల లబ్ధిని పొందాలని ఆశిస్తున్నాయి. ఉత్పత్తి వృద్ధి, ఉద్యోగిత మెరుగుపడకపోయినా కృత్రిమంగా షేర్ మార్కెట్లు విజృంభించేలా చేసి లబ్ధిని పొందాలని భావిస్తున్నాయి. ద్రవ్యలోటును తగ్గించడమే పరమ కర్తవ్యంగా బోధిస్తున్నాయి.
 
 మాంద్యానికి విరుగుడు ‘లోటు’
 ద్రవ్యలోటు తక్కువగా ఉంటేనే వృద్ధి, ఉపాధి కల్పన సాధ్యమనడానికి ఆధారాలు లేవు. నిజానికి 1930లలో ఏర్పడ్డ ఆర్థిక మహా మాంద్యానికి పరిష్కారంగా అమెరికా సహా ప్రపంచంలోని సంపన్న దేశాలన్నీ ద్రవ్యలోటు విధానాలనే అనుసరించాయి. లోటు బడ్జెట్ విధానాలతో ప్రభుత్వ వ్యయాలను, ఉ పాధి అవకాశాలను పెంచి కొనుగోలు శక్తిని, డిమాండును పెంచడం ద్వారా వృద్ధి, వికాసం సాధ్యమని జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థిక సిద్ధాంతాల సారం. ఆ సిద్ధాంతాలే నాడు ప్రపంచానికి శిరోధార్యమయ్యాయి.
 
 రెండవ ప్రపంచ యు ద్ధానంతరం దశాబ్దాల తరబడి సాగిన అమెరికా, యూరప్‌ల ఆర్థికాభివృద్ధికి దోహదపడ్డాయి. 1970లలో ఉత్పత్తి రంగ వృద్ధి మందగించి, పెట్టుబడులపై లాభాలు సన్నగిల్లడం ప్రారంభమైంది. పైగా ఉద్యోగాలు లేని వృద్ధి దశగా చెప్పే ఫైనాన్స్ (ద్రవ్య) పెట్టుబడి ఆధిపత్యపు దశ మొదలైంది. ప్రత్యేకించి 1980ల నుంచి ఈ ఉద్యోగాలు లేని వృద్ధి ధోరణే బలపడింది. అదే నేడు ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి, అల్ప ఉద్యోగిత, అల్ప ఆదాయాల ఊబి లోకి నెట్టింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగావకాశాలను, కొనుగోలుశక్తిని పెంచడానికి దోహదపడే రీతిలో ప్రభుత్వ వ్యయాలను పెంచకుండా ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కే అవకాశం లేదు.
 
 ఆహ్వానించదగిన మార్పు
 గత రెండేళ్లుగా మన దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగించి 4.7  శాతం పరిధిలోనే ఉండిపోయింది. దీంతో నిరుద్యోగం పెరిగిపోయింది, కొనుగోలు శక్తి పతనమైంది. సహజంగానే ఇది డిమాండు తగ్గుదలకు దారితీసింది. దీంతో ప్రైవేటు పెట్టుబడిదారులు, ప్రత్యేకించి పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించి, వారి ఆదాయాలను, కొనుగోలు శక్తిని పెంచితే తప్ప డిమాండు పుంజుకోదు, ప్రైవేటు పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు కాబట్టి ప్రభుత్వం రంగంలోకి దిగడం తప్ప గత్యంతరం లేదు. కానీ యూపీఏ విధానాలు ప్రజల కొనుగోలు శక్తిని, డిమాండును మరింతగా దిగజార్చే దిశగా సాగాయి. ఈ స్థితిలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం అన్ని వర్గాల ప్రజల్లోనూ ఆశలను రేకెత్తించింది. వాటిని నెరవేర్చాలంటే గత రెండు దశాబ్దాలుగా అమలయిన ‘షేర్ మార్కెట్ వృద్ధి’ పంథాను వీడక తప్పదు.
 
 అది నిరాశామయమైన ఆర్థిక పరిస్థితుల నడుమ కొందరు శత కోటీశ్వరులను సృష్టించడానికి మాత్రమే తోడ్పడింది. ఈ పరిస్థితుల్లో నూతన ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్థిక సలహాదారుగా అరవింద్ పనగారియ నియమితులవుతారని వినవస్తుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆసియా అభివృద్ది బ్యాంకు మాజీ ప్రధాన సలహాదారు, కొలంబియా విశ్వవిద్యాలయ ఆచార్యులు అయిన పనగారియ... గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా కొత్త ప్రభుత్వం ఒక మేరకు అధిక ద్రవ్యలోటును ఆమోదించయినా ప్రభుత్వ పెట్టుబడుల వ్యయాన్ని పెంచాలని అభిప్రాయపడటం విశే షం. ప్రముఖ అంతర్జాతీయ కన్సెల్టెన్సీ సంస్థ ‘మెకెన్సీ’ సైతం అధిక ద్రవ్య లోటుతో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పేమీ కాదని పేర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం నేర్పిన గుణపాఠాలతో అంతర్జాతీయంగా ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయాలలో మార్పు వస్తోంది. ఆహ్వానించదగిన ఈ మార్పునకు  మోడీ ప్రభుత్వం స్వాగతం పలుకుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
 
 మోడీ బడ్జెట్ దిశ ఎటు?
 ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం అంతర్జాతీయ అనుభవాలను గమనంలోకి తీసుకోవాల్సి ఉంది. గ్రీస్, స్పెయిన్, ఇటలీ వంటి పాశ్చాత్య దేశాలు సైతం ఆర్థిక మాంద్యానికి గురై, అల్ప ఉద్యోగిత, అల్ప ఆదాయాలు, అల్ప కొనుగోలు శక్తి, అల్ప డిమాండు, తిరిగి అల్ప వృద్ధి, భారీ నిరుద్యోగిత అనే విషవలయంలో చిక్కుకుపోయాయి. యూపీఏలాగా ఆ దేశాల ప్రభుత్వాలు ‘పొదుపు చర్యల’ పేరిట అమలు చేసిన ద్రవ్యలోటు తగ్గింపు విధానాలు వాటిని మరింత సంక్షోభంలోకి, ప్రభుత్వ రుణాల ఊబిలోకి దించాయి. విపరీత రుణ భారానికి గ్రీస్ పతనావస్థకు చేరింది. ఆ దేశ యువతలో దాదాపు 50 శాతం నిరుద్యోగులే. స్పెయిన్‌లోనూ ఇంచుమించుగా అదే పరిస్థితి నెలకొంది. సంక్షేమ వ్యయాలకు బడ్జెట్ కేటాయింపులలో భారీ కోతలు, ప్రభుత్వోద్యోగుల తొలగింపు, వేతనాల తగ్గింపు, పార్ట్ టైమర్ల వంటి అసంఘటిత, అల్ప వేతన ఉద్యోగుల నియామకాలు తదితర పొదుపు చర్యలు చేపట్టారు.
 
ఈ ద్రవ్యలోటు తగ్గింపు విధానాలు పరిస్థితి మరింతగా దిగజారడానికే దారితీశాయని ఇప్పటికే రుజువయింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టబోయే తొలి ‘మోడీ బడ్జెట్’కు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం పట్టంగట్టిన ప్రజలు ఆశిస్తున్నట్టుగా బడ్జెట్లో ఉపాధి కల్పనకు, ఆదాయాల పెంపుదలకు పెద్దపీట వేస్తుందా? లేక యూపీఏలాగా కొద్ది మంది కుబేరులకు, షేర్, ద్రవ్య మార్కెట్ స్పెక్యులేటర్ల ప్రయోజనాలే పరమార్థంగా భావిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే. ఈ అంశమే కొత్త ప్రభుత్వం దిశ ఎటో తేల్చి చెప్పే గీటురాయి అవుతుంది. ద్రవ్యలోటును కట్టడి చేయాల్సిందేనంటూ ఆర్థిక మంత్రి జైట్లీ ఇప్పటికే చేసిన వ్యాఖ్యలు అందుకే ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
 - (వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు)
 డి. పాపారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement