సత్యం... శాశ్వతం... మూడక్షరాల లెనిన్‌! | Sakshi Guest Column On Vladimir Lenin | Sakshi
Sakshi News home page

సత్యం... శాశ్వతం... మూడక్షరాల లెనిన్‌!

Published Sun, Jan 21 2024 12:10 AM | Last Updated on Sun, Jan 21 2024 12:10 AM

Sakshi Guest Column On Vladimir Lenin

నేడు లెనిన్‌ శత వర్ధంతి

‘వ్లాదిమిర్‌ ఇల్ల్యిచ్‌ ఉల్యనోవ్‌... లెనిన్‌... పోరాటమే జీవితం అయిన వాడు... తుది శ్వాస విడిచాడు’– ఈ మాటలు 1924 జనవరి 21వ తేదీన, నేటికి సరిగ్గా 100 ఏళ్ల క్రితం నాటి లెనిన్‌ మరణం గురించి ఆయన జీవిత చరిత్ర రచయిత రాబర్ట్‌ సర్వీస్‌ పుస్తకం లోనివి. అలాగే అదే రచయిత మరో సందర్భంలో పేర్కొన్నట్లుగా ‘20వ శతాబ్ద రాజకీయ నేతలలో, అధికార స్థానాన్ని ఈషణ్మాత్రం కూడా తన సొంతం కోసం వాడుకోనివాడు’ వ్లాదిమిర్‌ లెనిన్‌. మరణం నాటికి లెనిన్‌ వయస్సు కేవలం 53 సంవత్సరాలు.

1870 ఏప్రిల్‌ 22వ తేదీన రష్యాలోని సింబిర్క్స్‌ పట్టణంలో ఉన్నత విద్యా వంతులైన దంపతులకు మూడవ బిడ్డగా వ్లాదిమిర్‌ ఇల్ల్యిచ్‌ ఉల్యనోవ్‌ జన్మించాడు. ఉద్యమ ప్రస్థానంలో 1901లో లెనిన్‌ అనే మారు పేరును ఆయన ఎంచుకున్నాడు. నల్లేరు మీద నడక వంటి లెనిన్‌ కుటుంబం జీవితంలో మొదటి దెబ్బ ఆయన పదిహేనవ ఏట తండ్రి మరణంతో తగిలింది. ఆ తర్వాత లెనిన్‌ పదిహేడవ ఏట తనకు రోల్‌ మోడల్‌గా భావించిన తన అన్న... జార్‌ చక్రవర్తిని హత్యచేసేందుకు ప్రయత్నించి విఫలమై ఉరికంబం ఎక్కాడు. ఈ తరుణంలోనే ఆయన మార్క్సిజం అధ్యయనం దిశగా అడుగులు వేశారు. న్యాయశాస్త్రం అభ్యసించి 1892–93 కాలంలో న్యాయవాదిగా ప్రధానంగా రైతాంగం, చేతి వృత్తుల వారి కేసులను ఆయన వాదించాడు.  

1893 ఆగస్టులో ఆయన సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరాన్ని చేరి, అక్కడ మార్క్సిస్ట్‌ అధ్యయన బృందాలలో చురుకైన పాత్ర పోషించనారంభించారు. ఆ సమయంలోనే  కార్మికులకు కార్ల్‌ మార్క్స్‌ రచించిన ‘పెట్టుబడి’ గ్రంథంపై ఆయన అధ్యయన తరగతు లను నిర్వహించారు. ఈ మార్క్సిస్ట్‌ విప్లవ భావాల  ప్రచార క్రమంలోనే ఆయనతో పాటు కొందరు నాయకులు కూడా 1895 డిసెంబర్‌లో అరెస్ట్‌ అయ్యారు. 15 నెలల జైలు జీవితం అనంతరం, లెనిన్‌ను 3 సంవత్సరాల సైబీరియా ప్రవాసానికి నాటి జార్‌ ప్రభుత్వం పంపింది. అక్కడే ఆయనతో జత కలిసిన కృపస్కయాను ఆయన  వివాహం చేసుకున్నారు. కృపస్కయా ఆయనకు జీవితకాల సహచరి, కామ్రేడ్, కార్య దర్శిగా గొప్ప పాత్ర పోషించారు. సైబీరియా ప్రవాసం 1900 జనవరిలో ముగిసింది. 

అయితే, రష్యాలో ఉండగా చట్టబద్ధంగా రాజకీయ కార్య కలాపాలు సాధ్యం కాదని నిర్ణయించుకొని లెనిన్‌ రష్యాను విడిచి జర్మనీలోని మ్యూనిక్‌ నగరాన్ని చేరుకున్నారు. ఈ ప్రవాస ప్రస్థాన క్రమంలో యూరోప్‌లోని అనేక నగరాలలో జీవించారు. తన తాత్విక గురువు ప్లకనోవ్, సహచరుడు మార్టోవ్‌లతో కలిసి ‘ఇస్క్రా’ (నిప్పురవ్వ) అనే పత్రికను స్థాపించారు. ఒక ప్రచార సాధనంగా, పార్టీ నిర్మాణానికి కేంద్ర బిందువుగా పత్రికల పాత్రను గుర్తించిన లెనిన్‌ అటు తర్వాత అనేక పత్రికల స్థాపన, నిర్వహణలో కీలకపాత్ర పోషించారు. అలాగే, ఆ యా పత్రికలలో పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాశారు. అలాగే, తన అన్న అలెగ్జాండర్‌ మరణం అనంతరం ఆయన ఆశయాన్ని స్వీకరించి, తీవ్రవాద దాడుల ద్వారా ఆ ఆశయాన్ని సాధించలేమని గుర్తించి కార్మిక రాజ్య లక్ష్యసాధ నకు ఏకైక మార్గంగా సంఘటిత పడ్డ కార్మిక జనాళి తాలూకు నిర్మాణానికి పూనుకున్నారు. 

ప్రవాసంలో ఉంటూనే పత్రికలూ, రష్యాలోని పార్టీ నిర్మా ణాల ద్వారా  కార్మికవర్గంలోనూ, విస్తృత ప్రజానీకంలోనూ సోషలిస్ట్‌ భావజాల వ్యాప్తికి లెనిన్‌ కృషి చేశారు. ఈ క్రమంలోనే, మార్క్సిజం పట్ల, దాని సజీవ నిర్వచనం పట్ల వామ పక్షవాదులలో ఉన్న అనేక తప్పుడు ధోరణులపై ఆయన నిరంతర పోరాటం చేశారు. మార్క్సిజం అనేది పోరాట కరదీపిక అనీ... అది కరుడుగట్టిన పిడివాదం కాదనీ ఆయన నిరంతరం బోధించారు. పార్టీలో అంతర్గత పోరాట క్రమంలో మెన్షివిక్‌ బృందంతో తెగదెంపులు చేసుకొని 1903లో ‘బోల్షివిక్‌’ పార్టీని ఏర్పరచారు.  

అనంతరం 1905లో, రష్యా – జపాన్‌ యుద్ధంలో ఓటమి పాలైన రష్యాలో విప్లవ పోరాటం చెలరేగింది. దేశవ్యాప్త కార్మికుల సమ్మెలు, ఆర్థిక డిమాండ్‌ల స్థాయిని దాటి రాజకీయ పోరాటాలుగా మారాయి. అయితే, ఈ విప్లవాన్ని జార్‌ చక్రవర్తులు అణచివేయగలిగారు. కానీ, అంతిమంగా తమ ప్రజానీకానికి పాక్షిక ప్రజాతంత్ర హక్కులను ఇవ్వక చక్రవర్తికి తప్పలేదు. దీనిలో భాగంగానే పార్లమెంటరీ వేదికగా ‘డ్యూమా’ ఏర్పడింది. అలాగే, 1903లో మెన్షివిక్, బోల్షివిక్‌ పార్టీలుగా చీలిపోయిన సోషలిస్ట్‌ డెమోక్రాట్లు ఈ విప్లవ వైఫల్యం పట్ల ప్రతిస్పందించిన తీరూ... వారు దాని నుంచి తీసుకున్న పాఠాలు కూడా పూర్తిగా భిన్నమైనవి. ఈ విప్లవ వైఫల్యానంతరం మెన్షివిక్‌లు మరింత ఆర్థికవాదం, సంస్క రణవాద దిశగా మరలారు. కాగా, ఈ విప్లవ పరాజయం కార్మిక వర్గం మరింత మిలిటెంట్‌ పోరాటాలకు మరలవలసిన అవసరాన్ని చెబుతోందని లెనిన్‌ నేతృత్వంలోని బోల్షివిక్‌లు నిర్ధారించుకున్నారు. 

1914లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభానికి ముందరే యూరప్‌లోని వివిధ దేశాల కమ్యూనిస్టులు యుద్ధం గనుక వస్తే, అది సామ్రాజ్యవాద దేశాలు, ప్రపంచంలోని మార్కెట్లను పంచుకొనేందుకు కొట్లాడుకొనేదిగానే ఉంటుంది గనుక ఆ యుద్ధాన్ని వ్యతిరేకించాలనీ... తమ తమ దేశాల సైనికులకు  ఈ యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చేందుకు వారు తమ తమ దేశాల పెట్టుబడిదారుల పైకి తమ తుపాకులను తిప్పేలా పిలుపునివ్వాలనీ నిర్ణయించారు. అయితే, తీరా యుద్ధం మొదలయ్యాక అనేక దేశాల పార్టీలు జాతీయత, దేశభక్తి పేరిట తమ తమ దేశాల ప్రభుత్వాలను సమర్థించుకోసాగాయి.

ఈ నేపథ్యంలో, ఒక్క లెనిన్‌ మాత్రమే సూత్రబద్ధ వైఖరి తీసుకొని ఈ యుద్ధంలో రష్యా ప్రవేశానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఈ యుద్ధంలో రష్యా సైనికులు, కార్మికులు తమ ఆయుధాలను స్వదేశీ పెట్టుబడిదారులపైకి తిప్పాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాదులు తమ తమ స్వప్రయోజనాల కోసం, మార్కెట్లను పంచుకోవడం కోసం కొట్లాడుకొనే ఈ యుద్ధంలో వివిధ దేశాల పేద కార్మికులూ, సైనికులూ పరస్పరం చంపుకోవడం కూడనిదని ఆయన ఉద్భోధించారు.

కాగా, కడకు 1917 నాటికి ఈ యుద్ధ క్రమంలో తీవ్ర ప్రాణ నష్టానికి, కడగండ్లకు గురైన రష్యా సైనికులు, కార్మికులు యుద్ధం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేయసాగారు. అలాగే, కాస్తంత సొంత భూమి కోసం తపన పడుతోన్న రష్యా రైతాంగం కూడా ఈ అసంతృప్తిలో భాగస్వామి అయ్యింది. దీని పర్యవసానమే 1917 ఫిబ్రవరి విప్లవం. అయితే, ఈ విప్లవ క్రమంలో అధికారంలోకి వచ్చిన మెన్షివిక్‌లు తదితరులు మెజారిటీ రష్యా ప్రజానీకం ఆకాంక్ష అయిన యుద్ధం నుంచి వైదొలగాలన్న దానిని గౌరవించలేదు. వారు ఆ యుద్ధంలో కొనసాగారు. 

ఈ దశలోనే, స్విట్జర్లాండ్‌ నుంచి సీల్‌ వేసిన రైలు పెట్టెలో జర్మనీ గుండా రష్యాలో అడుగిడిన వ్లాదిమిర్‌ లెనిన్‌... ‘కార్మి కులకు రొట్టె, రైతుకు భూమి, సైనికుడికి శాంతి’ నినాదంతో మరో విప్లవం దిశగా సాగాల్సిన అవసరాన్ని ‘1917 ఏప్రిల్‌ థీసిస్‌’ ద్వారా రష్యా ప్రజల ముందు ఉంచారు. దీనితో అభద్రతకూ... ఆగ్రహానికి లోనైన మెన్షివిక్‌ ప్రభుత్వం లెనిన్‌ను అరెస్ట్‌ చేసేందుకు నిర్ణయించింది. పర్యవసానంగా మరికొద్ది కాలం పాటు రష్యా సరిహద్దులోని ఫిన్లాండ్‌లో ఒక కార్మికుడి ఇంట అజ్ఞాతంగా గడిపిన లెనిన్, అనంతరం అక్టోబర్‌ నాటికి విప్లవానికి బోల్షివిక్‌ పార్టీని సమాయత్తం చేశారు. ఈ మొత్తం క్రమంలో పార్టీలో అంతర్గతంగా కూడా వ్యతిరేకతను ఎదు ర్కొన్నారు. మొత్తంగా, 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం నుంచీ... 1917 అక్టోబర్‌ వరకూ ఆయన దాదాపు ఒంటరిగానే విప్లవ చోదక శక్తిగా... ప్రపంచ పీడిత జనాళి పథ నిర్దేశకుడిగా ముందు నడిచారు. 

అక్టోబర్‌ విప్లవానంతరం, సోవియట్‌ సోషలిస్ట్‌ రాజ్యాన్ని కూల్చివేసేందుకు దాడి చేసిన పద్నాలుగు పెట్టుబడిదారీ దేశాల సైన్యాలనూ, వైట్‌గార్డుల రూపంలో అంతర్గత శత్రు వులనూ తిప్పి కొట్టడంలోనూ... జర్మనీతో బ్రెస్ట్‌లిటోవుస్క్‌ సంధి చేసుకోవడం వంటి విషయాలలో ట్రాట్‌స్కీ వంటి వారి అతివాద పోకడలను అదుపులో పెట్టడం లోనూ లెనిన్‌ పాత్ర అద్వితీయం. ఈ క్రమంలో ఆయన పైన జరిగిన తుపాకీ కాల్పుల హత్యాయత్నం, తీవ్రమైన పని ఒత్తిడి వంటివి ఆయన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీశాయి. 1917 విప్లవానంతరం 1922 వరకూ రష్యాలో అంతర్యుద్ధం జరిగింది. 

1921లో ఆరోగ్య సమస్యలు బయటపడడం మొదలైన తర్వాత 1924 జనవరి 21 వరకు ఆయన స్థితి దిగజారుతూనే ఉంది. అయినా, చివరి క్షణం వరకూ లెనిన్‌ విప్లవాన్ని   కంటికి రెప్పలా కాపాడుకొనేందుకు పెనుగులాడుతూనే ఉన్నారు. పక్షవాతంతో మంచం పట్టినా పట్టువిడవని దీక్షతో చివరి క్షణం వరకూ విప్లవ పురోగతి కోసం ఆయన తపన పడ్డారు. తాను ముందు ఊహించినట్లుగా రష్యా విప్లవాన్ని అనుసరించి జర్మనీ వంటి అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో విప్లవాలు జరగకపోవడంతో నాడు ప్రపంచ విప్లవ కేంద్రబిందువు, తూర్పు దిశగా కదిలిందని ఆయన సూత్రీకరించారు. పర్యవసానంగా చైనాలో విప్లవం జరిగే అవకాశాన్ని కూడా ఆయన ప్రతిపాదించారు. 

పెట్టుబడిదారులు మార్కి ్సజానికి కాలం చెల్లిపోయిందంటూ చేస్తున్న అసత్య ప్రచారాల ద్వారా మార్క్స్, లెనిన్‌లను పలచన చేయనారంభించారు. అయితే, అంతిమంగా ఈ మధ్యనే ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారీ పత్రిక  ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ నేటి యుగంలో లెనిన్‌ లేవనెత్తిన ప్రశ్నలకు ఇంకా సమకాలీనత ఉందంటూ వ్యాఖ్యానించడం వాస్తవాలకు అద్దం పడుతోంది.

అయితే, అదే పత్రిక లెనిన్‌ లేవనెత్తిన ప్రశ్నలకు ఆయనే ఇచ్చిన జవాబు మాత్రం సరైనది కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ఆ పత్రిక తాలూకు అనివార్య అగత్యం. మూడు దశాబ్దాల క్రితం రచయిత అదృష్ట దీపక్‌ లెనిన్‌ గురించి చెప్పిన ఈ మాటలు నేడు మరింత వాస్తవం: ‘అతీత గత అవస్థలను ఎరుగని అఖండ కాలం పేరు లెనిన్, హృదయ స్పందన వీనుల సోకే ప్రతీ ప్రదేశం పేరు లెనిన్‌...’
డి. పాపారావు 
వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు
మొబైల్‌: 98661 79615

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement