ప్రధాని కాదు, విధానం మారాలి
నిజానికి 2008, సెప్టెంబర్‌లో అమెరికాలో అతి పెద్ద ఆర్థిక సంక్షోభం మొదలయింది. కానీ అదే సమయంలో మనదేశంలో పరిస్థితులు చాలావరకు స్థిరంగా ఉన్నాయి. 2009లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ నాటి మన ఆర్థిక మంత్రి ఈ మేరకు ఉటంకించారు కూడా. ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది. దీనికి మన పాలకుల తీరే కారణం. సంక్షోభంలో పడిపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే కృషిలో మన పాలకులు శక్తి మేరకు భాగస్వామ్యం తీసుకున్నారు.
అభివృద్ధి చెందుతున్న పలు దేశాల షేర్‌మార్కెట్ల మాదిరిగానే, భారత్ షేర్ మార్కెట్ కూడా కొద్దివారాలుగా డోలాయమాన పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నది. దీనితో పాటు వివిధ దేశాల కరెన్సీల విలువలూ క్షీణించాయి. మన రూపాయి విలువ కూడా కాస్త తగ్గింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి. అమెరికా తన ఆర్థిక ఉద్దీపన పథకాన్ని కుదించడం ఒకటి కాగా, చైనా ఆర్థికవృద్ధిలో తగ్గుదల రెండో కారణం.
అమెరికా ఉద్దీపనతో పాట్లు
2012, సెప్టెంబర్ నుంచి అమెరికా ఫెడరల్ బ్యాంక్ నెలవారీ 85 బిలియన్ డాలర్లను దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెడుతున్నది. దేశ ప్రజలలో పడిపోయిన కొనుగోలు శక్తిని మళ్లీ పెంపొందించి ఆర్థిక వ్యవస్థను మాంద్యం నుంచి గట్టెక్కించడమే ఈ ఉద్దీపన పథకం లక్ష్యం. మొత్తానికి 2013 సంవత్సరం మధ్య నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకోసాగింది. ఉపాధి, కొనుగోలు శక్తి, గృహ కొనుగోలు రంగం వంటి వాటి సూచీలు మెరుగ్గా కనిపించసాగాయి. దానితో ఈ నెలవారీ ఉద్దీపన పథకాన్ని కొంత మేరకు తగ్గించాలని ఫెడరల్ బ్యాంక్ ఆలోచించింది. ఆర్థిక వ్యవస్థలో సానుకూల సంకేతాలు స్పష్టమైనాక ఉద్దీపన పేరుతో మరిన్ని డాలర్ల ముద్రణ, చలామణీ మంచిదికాదు. చలామణీ పెరిగి డాలరు విలువ మరింత తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే అమెరికా తన ఉద్దీపన పథకంలో మొత్తాన్ని 85 బిలియన్‌ల నుంచి 65 బిలియన్ డాలర్లకు తగ్గించింది.
అమెరికా తీసుకున్న ఈ చర్యే అభివృద్ధి చెందుతున్న దేశాల షేర్ మార్కెట్లకు సంకటంగా పరిణమించింది. గతంలో మాదిరిగా ఈ మార్కెట్లకు డాలర్ పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడం మొదలయింది. ఫలితంగానే భారత్ సహా, అభివృద్ధి చెందుతున్న దేశాల షేర్ మార్కెట్ల సూచీలు నేల చూపులు చూడడం మొదలయింది. అదేసమయంలో చైనా నుంచి నిరాశాజనకమైన గణాంకాలు వెలువడ్డాయి. అదీకాక ఇప్పుడు సరుకుల దిగుమతిలో చైనాది పెద్ద స్థానం. చైనా వృద్ధి త గ్గితే ఆ దేశం ఎగుమతుల మీద ఆధారపడి ఉన్న దేశాల మాటేమిటి? ఈ పరిణామంతోనే కొన్ని దేశాల మార్కెట్లలో పతనం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ పరిణామం నుంచి అదృష్టవశాత్తు భారత్‌కు మినహాయింపు ఉంది. చైనాకు మన దేశం నుంచి ఎగుమతులు తక్కువే.
కానీ, నెలవారీ ఉద్దీపన పథకాన్ని కుదించాలని అమెరికా తీసుకున్న నిర్ణయం మాత్రం భారత్‌కు పెద్ద సమస్యనే సృష్టించి పెట్టింది. 2013, మే నెలలో ఈ ఉద్దీపన పథకం కుదింపు గురించిన వార్త రాగానే మన షేర్ మార్కెట్ సూచీలలో, రూపాయి విలువలో పతనం కనిపించింది. అంతకు ముందు ఒక దశలో డాలర్ విలువ రూ.69కి సమానమైంది. తరువాత మన రిజర్వు బ్యాంక్ చేపట్టిన కొన్ని చర్యలు, ఉద్దీపన తగ్గించే యోచన లేదంటూ అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఇచ్చిన ప్రకటన రూపాయి కోలుకొనడానికి అవకాశం కల్పించాయి. కానీ గత రెండు మూడు మాసాలుగా అమెరికా ఉద్దీపన పథకంలో కోత మొదలై, రెండు దఫాలుగా ఇరవై బిలియన్ డాలర్ల మేర తగ్గడంతో మళ్లీ సమస్య కొంత వరకు మొదటికి వచ్చినట్టయింది. షేర్ మార్కెట్ సూచీలలో, రూపాయి విలువలో ప్రస్తుతం కనిపిస్తున్న సందిగ్ధత దీని ఫలితమే.
మన నేతల వెన్నెముక లేని తనం ఈ పరిణామాలతోనే వెల్లడవుతోంది. రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ వ్యాఖ్యలే దీనికి తార్కాణం. జనవరి 29న ఆయన అమెరికా ఉద్దీపన పథకం కుదింపు గురించి చెబుతూ, ‘అంతర్జాతీయ ద్రవ్య సహకారం కుప్పకూలిపోయింద’ని అన్నారు. కానీ, 2008 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తలెత్తినపుడు దాని నుంచి బయటపడడానికి సాయపడినవి అభివృద్ధి చెందుతున్న దేశాలే. కాబట్టి, ‘పారిశ్రామిక దేశాలు ప్రస్తుత దశలో చేతులు దులుపుకుని పోరాదు. మా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామని అనరాదు. మా సమస్యలు మేం పరిష్కరించుకోగలమని చెప్పరాదు’. ఏరుదాటాక తెప్ప తగలేసే లక్షణం ఉన్న పాశ్చాత్య దేశాల గురించి మన రిజర్వు బ్యాంక్ గవర్నర్ చేసిన వ్యాఖ్య ఇది. కానీ ఫిబ్రవరి మూడున మళ్లీ రాజన్‌గారే అమెరికా ఫెడరల్ బ్యాంక్ గవర్నర్ జానెట్ ఎలెన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ‘ఆమె సరైనా రీతిలో వ్యవహరిస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది’ అన్నారాయన. ఇదీ ఆయన ప్రయాణం.
అక్కడ సంక్షోభం...
నిజానికి 2008, సెప్టెంబర్‌లో అమెరికాలో అతి పెద్ద ఆర్థిక సంక్షోభం మొదలయింది. కానీ అదే సమయంలో మనదేశంలో పరిస్థితులు చాలావరకు స్థిరంగా ఉన్నాయి. 2009లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ నాటి మన ఆర్థికమంత్రి ఈ మేరకు ఉటంకించారు కూడా. ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది. దీనికి మన పాలకుల తీరే కారణం. సంక్షోభంలో పడిపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే కృషిలో మన పాలకులు శక్తి మేరకు భాగస్వామ్యం తీసుకున్నారు. 2008 నాటి పౌర అణు ఒప్పందం దీనిలో భాగమే. అమెరికాకు చెందిన భారీ అణు రియాక్టర్ సాంకేతిక సంస్థలకు లబ్ధి చేకూర్చడం, అమెరికాలో ఉండేవారికి అధిక వేతనాలతో ఉపాధి కల్పన కూడా ఈ ఒప్పందంలో అంతర్భాగమే.
కంపెనీల అమ్మకాలు పడిపోయి ప్రజల కొనుగోలు శక్తి కూడా పడిపోయిన దశలో ఇదంతా అమెరికాకు ఊరటే. ఇంకా, అమెరికా బహుళ జాతి ఆయుధ తయారీ సంస్థల నుంచి కూడా మనం కొనుగోళ్లు చేశాం. ఇది చాలదన్నట్టు మన దేశీయ కంపెనీలు (2013 నాటికి) 11 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో అమెరికాలో లక్ష ఉద్యోగాలను సృష్టించి పెట్టాయి. మరోపక్కన బరాక్ ఒబామా ప్రభుత్వం మాత్రం భారతీయుల ఔట్‌సోర్సింగ్ అవకాశాలను నిలువరించడానికి చేయని ప్రయత్నం లేదు. నిజానికి అమెరికాకు భారత్ అతి పెద్ద మార్కెట్ అని ఆయన భారత పర్యటనలో బాహాటంగానే చెప్పారు.
కృతజ్ఞత లేని అమెరికా
ఏమైతేనేమి! రకరకాల అంతర్జాతీయ సాయాలతో, కాయకల్ప చికిత్సలతో అమెరికా నేడు కొంత మేరకు కోలుకొన్నట్టే కనపడుతోంది. దానితో దాని నిజ స్వరూపం కూడా బయటపడడం మొదలయింది. కష్టకాలంలో సాయపడిన భారత్ వంటి దేశాలను నట్టేట వదిలి అమెరికా తన స్వార్థం తాను చూసుకుంటోంది. నిజానికి, రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామరాజన్ జనవరి 29న బయటపెట్టిన ఆక్రోశం సారాంశం ఇదే. ఇప్పుడు అమెరికా తన ఉద్దీపన పథకాన్ని అకస్మాత్తుగా కుదించుకోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలలోకి వస్తున్న డాలర్ల ప్రవాహం ఆగిపోతోంది. లేదా తగ్గుతున్నది. ఫలితంగానే ఆయా దేశాల షేర్ మార్కెట్లు నష్టపోతున్నాయి. ఉద్దీపన పథకం కుదింపుతో డాలర్ ముద్రణ తగ్గి విలువ పెరుగుతోంది. దీనితో వివిధ దేశాల మార్కెట్లలో వివిధ రకాల కరెన్సీల రూపంలో ఉన్న పెట్టుబడులు నేడు డాలర్ల కోసం అమెరికా వైపు పరుగులు తీస్తున్నాయి. డాలర్ విలువ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. మన రూపాయి మాదిరిగానే, అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీ విలువ పడిపోవడానికి కూడా ఇదే కారణం. మన షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు వాటిని అమ్మేసి, అమెరికా డాలర్లకు మళ్లుతున్నారు. డాలర్ విలువ పెంచుతున్నారు.
నేడు రూపాయి పరిస్థితి కొంత నిలకడగానే కనపడుతోంది. బహుశా ఇది తాత్కాలికమే కావచ్చు. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల ఫలితాల మీద ఈ విలువ, దాని భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటాయన్నది కూడా ఒక అంచనా. ఎన్నికల అనంతరం దేశంలో స్థిరమైన మార్కెట్ అనుకూల ప్రభుత్వం ఏర్పడితే ఆ మార్కెట్‌కు క్షేమం. లేదంటే విదేశీ సంస్థాగత పెట్టుబడులను ఇక్కడ నుంచి తరలించుకు వెళతారు. దీనికి తోడు ఈలోపున అమెరికా ఉద్దీపన సొమ్ములో మరో దఫా కోత కూడా పడవచ్చును. ఒకటి మాత్రం నిజం. మన పాలకులు స్వావలంబనతో కూడిన విధానాలకు శ్రీకారం చుట్టకుండా, అమెరికా సేవలో తరించాలని అనుకున్నంత కాలం ఇక్కట్లు తప్పవు. ఇప్పుడు కావలసినది ప్రధాని మార్పు ఒక్కటే కాదు. అంతకుమించి ఆశించవలసింది విధానాలలో మార్పు. దీనిని అంతా గమనించాలి.
(వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు)
- డి. పాపారావు