మీడియాతో మాట్లాడుతున్న శివన్. చిత్రంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మెగా ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది! ఆంక్షల చట్రాలు ఎన్ని ఉన్నా.. ప్రపంచంలోనే అత్యంత చవకగా ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించగల సత్తా సాధించుకున్న ఇస్రో... ఇప్పుడు సొంతంగా ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా అడుగులువేస్తోంది. ఢిల్లీలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇస్రో చైర్మన్ డా.కె.శివన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘చంద్రయాన్–2 ప్రయోగం పూర్తయ్యాక సూర్యుడిపై ఆదిత్య–ఎల్1 వాహకనౌక 2020 తొలి అర్ధభాగంలో పంపిస్తాం. అనంతరం 2–3 సంవత్సరాల వ్యవధిలో ఫ్రాన్స్‌తో కలిసి శుక్రుడిని అధ్యయనం చేసేందుకు మరో ప్రయోగం చేపడతాం’ అని తెలిపారు. ఆదిత్య ఎల్1 వాహకనౌక సూర్యుడిలో అత్యంత వేడి ప్రదేశమైన కరోనాను విశ్లేషిస్తుందనీ, దీనివల్ల వాతావరణ మార్పులను అర్థం చేసుకోవచ్చని వెల్లడించారు. ఇస్రో అంతరిక్ష పర్యాటకంపై దృష్టి సారించడంలేదని డా.శివన్ స్పష్టం చేశారు.
2030 నాటికి పూర్తి
భారతీయుల్ని సొంతంగా అంతరిక్షంలోకి పంపేందుకు రూ.10,000 కోట్లతో ఇస్రో చేపట్టిన ‘గగన్‌యాన్’ ప్రాజెక్టుకు కొనసాగింపుగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం ఉంటుందని డా.శివన్ తెలిపారు. ‘అమెరికా, జపాన్, కెనడా, రష్యా, ఈయూ దేశాలు కలిసి ఏర్పాటుచేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) బరువు 420 టన్నులు ఉండగా, ఇస్రో ఏర్పాటుచేయనున్న అంతరిక్ష కేంద్రం బరువు 20 టన్నులు మాత్రమే ఉంటుంది. ఈ కేంద్రంలో తొలుత వ్యోమగాములు 15–20 రోజులు గడిపేలా ఏర్పాట్లు చేస్తాం. దాన్ని క్రమంగా విస్తరిస్తాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల దశలోనే ఉంది. ఓసారి ప్రభుత్వ ఆమోదం లభిస్తే 2030 నాటికి మనకు సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటవుతుంది. దీనికోసం ఐఎస్‌ఎస్‌తో కానీ, మరేదేశంతో కానీ పనిచేయబోం’ అని పేర్కొన్నారు. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే పరిస్థితుల్లో మానవశరీరంతో పాటు మొక్కలు, ఇతర జీవులు, బ్యాక్టీరియాలు ఎలా ప్రతిస్పందిస్తాయన్న విషయమై ఈ కేంద్రంలో పరిశోధనలు చేపడతామని చెప్పారు. ఇతర దేశాలతో కలిసి చంద్రుడిపై మానవసహిత యాత్రలు చేపడతామని, గ్రహశకలాలను విశ్లేషిస్తామని కె.శివన్ తెలిపారు.
అంతరిక్ష కేంద్రం అంటే?
భూమికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో కొన్ని రోజులపాటు వ్యోమగాములు ఉండేందుకు ఏర్పాటు చేసిన నిర్మాణాన్ని అంతరిక్ష కేంద్రం అని పిలవొచ్చు. దీనిని భూస్థిర కక్ష్యలో తిరుగుతూ ఉండే ఓ భారీ ఉపగ్రహంగానూ అనొచ్చు. అగ్రరాజ్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఎస్‌ఎస్‌ను 1998 నుంచి దశలవారీగా విస్తరిస్తూ వచ్చారు. దీంతో ప్రస్తుతం ఐఎస్‌ఎస్ బరువు దాదాపు 420 టన్నులకు చేరుకుంది. 2000లో తొలిసారిగా ఇందులో ఓ వ్యోమగామి అడుగుపెట్టారు. 2011లో ఐఎస్‌ఎస్‌కు చివరి మాడ్యూల్‌ను జోడించారు. ఐదేళ్ల తర్వాత ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములు నివాసం ఉండేందుకు వీలుగా ప్రత్యేకమైన గాలిబుడగలాంటి నిర్మాణాన్ని ఏర్పాటుచేశారు. 2030 వరకూ పనిచేసే ఈ ఐఎస్‌ఎస్‌లో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మొక్కలు ఎలా పెరుగుతాయి? పదార్థాల భౌతిక ధర్మాలు మారతాయా? బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులపై ప్రభావం ఎలా ఉంటుంది? వంటి అంశాలపై అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి.
గగన్‌యాన్ తర్వాతే..
జూలై 15న చంద్రయాన్ –2 ప్రయోగం పూర్తయ్యాక గగన్‌యాన్‌పై దృష్టి సారిస్తామని శివన్ తెలిపారు. ‘వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ముందు రెండుసార్లు వారు ప్రయాణించే మాడ్యూల్‌ను పరీక్షిస్తాం. 2022లో తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగాన్ని చేపడతాం. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను రాబోయే 6 నెలల్లో ఎంపిక చేస్తాం. ఆ తరువాత వీరికి ఏడాది పాటు శిక్షణ ఇస్తాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 వేల కోట్ల నిధులను కేటాయించింది’ అని శివన్ చెప్పారు. గగన్‌యాన్ ప్రయోగం పూర్తయ్యాక దానికి కొనసాగింపుగా అంతరిక్ష కేంద్రం నిర్మాణంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment