సాక్షి, రామగుండం : సాధారణంగా ఇస్రో నుంచి ఉపగ్రహాలను పంపించడం ప్రసార మాధ్యమాల్లో చూస్తుంటాం. ఇటీవల చంద్రయాన్–2ను పంపించి ప్రపంచ దృష్టిని ఆకర్శించింది. అలాంటిది ఇస్రో కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి చంద్రయాన్–2 చంద్రుడి మీద దిగడం ప్రత్యక్షంగా చూసే అవకాశం కొంత మంది విద్యార్థులకు దక్కనుంది. ఇందుకుగాను ఎనిమిది నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు ఇస్రో నిర్వహించచే ఆన్‌లైన్ పరీక్షలో ప్రతిభ చూపితే సరిపోతుంది.
భారత సాంకేతిక ఎదుగుదల గురించి విద్యార్థులకు ఆసక్తి కలిగించేందుకు ‘ఇస్రో మైగవ్’ ఆన్‌లైన్ ప్రతిభాపాటవ పోటీలను నిర్వహిస్తోంది. ఈనెల 10 నుంచి ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థనలు పంపుకోవాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలు పొందుపరిచారు. ఎనిమిది నుంచి పదో తరగతిచదువుతున్న విద్యార్థులెవ్వరైనా ‘ఇస్రో మై గవ్’లో మొదట ఆన్‌లైన్ ఖాతా ప్రారంభించాలి. విద్యార్థి నమోదు ధ్రువీకరణ జరిగిన అనంతరం వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థికి పెద్దవారు సహకరించవచ్చు. కానీ ఏకంగా వారే సమాధానాలు ఇవ్వకుండా నైతికత పాటించాలని నిర్వాహకులు చెబుతున్నారు.
పోటీ ఇలా..
ఆన్‌లైన్‌ను అనుసంధానం చేసుకొని ‘ఇస్రో మై గవ్’ అని ఆంగ్లంలో చిరునామా నమోదు చేయగానే వివరాలు వస్తాయి. రెండో అంశంపై ఎంటర్ నొక్కగానే వివరాలు, నియమ నిబంధనలు తెలిసిపోతాయి. ఈనెల 10వ తేదీ 12.01 గంటల నుంచి 20వ తేదీ, 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో సమాధానాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది. పది నిమిషాల వ్యవధిలో ఇరవై ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. ఒక్కసారి పోటీ ప్రారంభమయ్యాక మధ్యలో ఆపడం ఉండదు. తెరపై ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వాలి. తెలియకపోతే తప్పుకొని తర్వాత వచ్చే ప్రశ్న తెలుసుకునే వెసులుబాటు ఉంది.
ఎంపిక విధానం..
వేగం కచ్చితత్వంతోపాటు స్పందించే మనస్తత్వం ఉన్న విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రతీ రాష్ట్రం నుంచి ఇద్దరేసి ప్రతిభావంతులను గుర్తిస్తారు. విజేతల సంఖ్య ఎక్కువగా ఉంటే అతి తక్కువ వ్యవధిలో అత్యధికంగా సరైన సమాధానాలు రాసిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జయపత్రం అందిస్తారు. చంద్రయాన్–2 చంద్రుడి మీదకు దిగే క్రమాన్ని స్వయంగా వీక్షించడానికి బెంగళూరులోని ఇస్రో కార్యాలయం ఏర్పాట్లు చేసింది. ఈ పోటీలో విజేతలైన విద్యార్థులు మిగతా రాష్ట్రాల విజేతలతోపాటు ప్రధానమంత్రి మోడీతో కలిసి చంద్రయాన్ చంద్రుడి మీదకు దిగే అపురూపమైన సన్నివేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. తగు ఆధారాలు, ధ్రువపత్రాలతో ఇస్రోను సంప్రదిస్తే విజేతలకు ఆహ్వానం పంపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment