
సూళ్లూరుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జూలై 15న ఇస్రో నిర్వహించనున్న చంద్రయాన్–2 ప్రయోగాన్ని తిలకించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని తెలిసింది. ఆయనతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్ కూడా హాజరుకానున్నారు. గతంలో మంగళ్‌యాన్ ప్రయోగ సమయంలోనూ ప్రధాని వచ్చిన విషయం తెలిసిందే. గ్రహాంతర ప్రయోగం.. పైగా దేశానికి ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన స్వయంగా వచ్చి తిలకించనున్నారు.
ఈ ప్రయోగానికి ముందుగానే.. సుమారు 1500 మందితో శాస్త్రసాంకేతిక రంగానికి సంబంధించి ఓ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. రూ.500 కోట్లతో నిర్మించిన రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను కూడా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు ఇస్రో వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. 2022 కంటే ముందుగానే గగన్‌యాన్ ప్రయోగాన్ని నిర్వహించాలని ప్రధానమంత్రి ఆదేశాలతో రెండో వ్యాబ్‌ను ప్రారంభించి అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో కసరత్తు చేస్తోంది.