
బెంగళూరు: వచ్చే డిసెంబర్ ద్వితీయార్థంలో పీఎస్‌ఎల్వీ వాహకనౌక ద్వారా 30 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపిస్తామని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. భారత్‌కు చెందిన కార్టోశాట్–2తో పాటు 25 నానో ఉపగ్రహాలు, మూడు మైక్రో ఉపగ్రహాలు, ఓ వర్సిటీకి చెందిన శాటిలైట్‌ను పీఎస్‌ఎల్వీ–సీ40 ద్వారా ప్రయోగిస్తామని వెల్లడించారు. ‘భారతీయ అంతరిక్ష కార్యక్రమం– పరిశ్రమ సరళి, అవకాశాలు’ అన్న అంశంపై వచ్చే నెల 20 నుంచి 21 వరకు ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ సదస్సు వివరాలను కిరణ్ సోమవారం మీడియాకు తెలియజేశారు.
మార్చిలో చంద్రయాన్–2:
వచ్చే మార్చిలో చంద్రయాన్–2ను ప్రయోగిస్తామని కిరణ్ తెలిపారు. 2008లో ప్రయోగించిన చంద్రయాన్–1 పంపిన ఫొటోల ద్వారానే చంద్రునిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని ప్రపంచానికి తొలిసారిగా తెలిసింది. జీఎస్‌ఎల్వీ మార్క్–ఐఐ ద్వారా ప్రయోగించనున్న చంద్రయాన్–2తో జాబిల్లిపై మంచు, నీటి అణువులతోపాటు ఇతర మూలకాల గురించి పరిశోధించవచ్చని వెల్లడించారు.