హలో.. హలో..చందమామ | ISRO Launch Chandrayaan 2 Rocket In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

హలో.. హలో..చందమామ

Published Mon, Jul 15 2019 5:02 AM | Last Updated on Mon, Jul 15 2019 5:03 AM

ISRO Launch Chandrayaan 2 Rocket In Andhra Pradesh - Sakshi

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేతృత్వంలో చంద్రయాన్‌–2 ప్రయోగానికి రంగం సిద్ధమైంది. 20 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం సోమవారం వేకువజామున 2.51 గంటలకు సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1ను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పదేళ్లపాటు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రమించి రూపాందించిన 3,850 కిలోలు బరువు కలిగిన చంద్రయాన్‌–2 ప్రయోగానికి సంబంధించి ఆదివారం ఉ.6.51 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. గ్రహాంతర ప్రయోగాల్లో భారత్‌కు ఇది మూడోది. చంద్రునిపై పరిశోధనలు చేయడానికి చేస్తున్న రెండో ప్రయోగం ఇది. షార్‌ నుంచి 75వ ప్రయోగం కావడం కూడా ఓ విశేషం.

ఇది చరిత్రలో అతిపెద్ద మైలురాయిగా నిలిచిపోనుంది. ఇంత పెద్ద రాకెట్‌ను, ఇంత పెద్ద ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇస్రో చరిత్రలో రికార్డుగా చెబుతున్నారు. అంతకుముందు శనివారం ఎంఆర్‌ఆర్‌ కమిటీ సమావేశం అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ ఎ. రాజరాజన్‌ ఆధ్వర్యంలో జరిగిన ల్యాబ్‌ మీటింగ్‌లో ఆదివారం ఉ.6.51 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 20 గంటల కౌంట్‌డౌన్‌ సమయంలో భాగంగా ఆదివారం ఉ.8 నుంచి మ.2 గంటల వరకు రాకెట్‌కు రెండో దశలో 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తిచేశారు. ద్రవ ఇంధనం నింపిన అనంతరం రాకెట్‌కు పలు పరీక్షలు నిర్వహించారు. ప్రయోగానికి అతికొద్ది సమయమే వుండడంతో రాకెట్‌లో హీలియం గ్యాస్‌ నింపడం ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్‌ వ్యవస్థలను అప్రమత్తం చేస్తున్నారు.

భారత్‌ త్రీ–ఇన్‌–వన్‌ ప్రయోగం ఇలా..
చంద్రయాన్‌–2 ప్రాజెక్టును ఇస్రో శాస్త్రవేత్తలు త్రీ ఇన్‌ వన్‌ ప్రయోగంగా పిలుస్తున్నారు. ఈ మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్‌ (విక్రమ్‌), రోవర్‌లను ఒకటిగా అమర్చి పంపుతున్న ప్రయోగం కాబట్టి దీన్ని త్రీ ఇన్‌ వన్‌ ప్రయోగమని సంభోదిస్తున్నారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 ద్వారా ప్రయోగించే చంద్రయాన్‌–2 కాంపోజిట్‌ మాడ్యూల్స్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లు వుంటాయి. అయితే, వీటిలో అర్బిటర్‌ చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తూ అక్కడి నుంచి సమాచారాన్ని చేరవేస్తుంది. ల్యాండర్‌ చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. దీని నుంచి రోవర్‌ బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేస్తుంది. ఈ మూడు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి.
 
రాష్ట్రపతి సమక్షంలో ప్రయోగం 
భారత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని వేక్షించేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదివారం సా.4.53 గంటలకు ‘షార్‌’ కేంద్రానికి చేరుకున్నారు. షార్‌లో ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె. శివన్, షార్‌ డైరెక్టర్‌ ఎ. రాజరాజన్, జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తదితరులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి నక్షత్ర అతిథిగృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం 7 గంటలకు చంద్రయాన్‌–2 ప్రయోగానికి సంబంధించిన రెండో ప్రయోగ వేదిక వద్దకు చేరుకుని జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం1 రాకెట్‌ను సందర్శించారు. ఆ తరువాత షార్‌లో సుమారు రూ.650 కోట్లతో నిర్మించిన రెండో వెహికల్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌ను లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 7.30 గంటలకు తిరిగి నక్షత్ర అతిథిగృహానికి చేరుకున్నారు. రాత్రి 12 గంటలకు మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుకుని ప్రయోగాన్ని వీక్షించారు.

చంద్రయాన్‌–2కు తమిళనాడు నుంచి మట్టి
సేలం (తమిళనాడు): చంద్రయాన్‌–2 ఉపగ్రహం కోసం అనార్తసైట్‌ మట్టిని అందించామని పెరియార్‌ యూనివర్సిటీ భౌగోళిక విభాగ డైరెక్టర్‌ అన్బలగన్‌ వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్‌–1 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మయిల్‌స్వామి అన్నాదురై చంద్రునిపై ఉన్న మట్టి అనార్తసైట్‌ అని తెలిసి తమ సాయం కోరినట్టు చెప్పారు. అప్పుడు తాము నామక్కల్‌ జిల్లా చిత్తంపూండి కున్నమలై నుంచి ఆరు నెలల క్రితం 50టన్నుల అనార్తసైట్‌ మట్టిని బెంగళూరులో ఉన్న ఇస్రో కేంద్రానికి పంపించామన్నారు. అక్కడ పరిశీలనల్లో ఈ మట్టి, చంద్రునిపై ఉన్న మట్టి ఒకటే అని తేల్చినట్లు చెప్పారు. పెరియార్‌ యూనివర్సిటీ కేవలం రూ.పది లక్షలతో అనార్తసైట్‌ మట్టిని సిద్ధంచేసి ఇస్రోకు అందజేయడం తమకెంతో గర్వంగా ఉందన్నారు. ఈ మట్టి భవిష్యత్తులో అనేక పరిశోధనలకు ఉపయోగంగా ఉంటుందని ఆయన వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement