ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : చంద్రయాన్–2 ప్రయోగం మరోసారి వాయిదా పడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగం వాయిదా పడటం ఇది రెండోసారి. తొలుత ఈ ప్రయోగాన్ని ఏప్రిల్‌లో నిర్వహించాలని భావించారు. ప్రయోగానికి ముందు మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, దీంతో ప్రయోగాన్ని అక్టోబర్ లేదా నవంబర్‌కు వాయిదా వేయాలని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో అది వాయిదా పడింది. తాజాగా అక్టోబర్ మొదటి వారంలో చేపట్టాల్సిన ప్రయోగం డిసెంబర్ చివరికి లేదా వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసినట్టు ఇస్రో వెల్లడించింది. చంద్రుడి కక్ష్య చుట్టూ అధ్యయనం చేయడం కోసమే చంద్రయాన్–1 ప్రయోగాన్ని చేపట్టారు. చంద్రుడి కక్ష్యతోపాటు ఉపరితలంపై రోవర్‌ను దింపి అక్కడ పరిస్థితులపై పరిశోధనలు చేసేందుకు గాను చంద్రయాన్–2 ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఇటీవల ఇస్రో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగాలు సరైన ఫలితాలనివ్వలేక పోయాయి. జీశాట్–6ఏతో సంబంధాలు కోల్పోవడం, జీశాట్–11 ప్రయోగ తేదీని మార్చడం, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్–1హెచ్ నేవిగేషన్ ఉపగ్రహంలో హీట్‌షీల్డ్ పనిచేయక పోవడంతో అది విఫలమవడం లాంటి సంఘటనల నేపథ్యంలో చంద్రయాన్–2పై ఇస్రో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment