మామకు మన సామాను | Nagasai Industy Distribute equipment to ISRO | Sakshi
Sakshi News home page

మామకు మన సామాను

Published Sat, Sep 7 2019 11:10 AM | Last Updated on Mon, Sep 23 2019 9:52 AM

Nagasai Industy Distribute equipment to ISRO - Sakshi

ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌–2లో నగరం పాలుపంచుకుంది. ఈ ప్రయోగంలో కీలకమైన ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లకు కావాల్సిన వస్తువులను కూకట్‌పల్లిలోని నాగసాయి పరిశ్రమ సమకూర్చింది. జూలై 22న శ్రీహరికోట నుంచిజీఎస్‌ఎల్వీ మార్క్‌–3 రాకెట్‌లో నింగికి ఎగిరి జాబిల్లి కక్ష్యలోకి చేరిన చంద్రయాన్‌–2... 48 రోజుల అనంతరం ల్యాండర్‌ శనివారం తెల్లవారుజామున చందమామపై దిగనుంది. ఈ ప్రయోగ విజయంతో భారత్‌ అగ్రదేశాల సరసన చేరనుంది. ఇంతటి ప్రాధాన్యమున్న ప్రయోగంలో నగరం భాగస్వామ్యం కావడం మనకెంతో గర్వకారణం. చంద్రయాన్‌–1కి సైతం పరికరాలు దజేసిన నాగసాయి ప్రెసిషియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అధినేత బి.నాగభూషణ్‌రెడ్డి... చంద్రయాన్‌–2కి అందజేసిన పరికరాల గురించి‘సాక్షి’కి వివరించారు.

కూకట్‌పల్లి: నాగసాయి ప్రెసిషియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇప్పటి వరకు 38 ఉపగ్రహాల తయారీలో కీలక పాత్ర పోషించింది. 1998 నుంచి ఇస్రోకు విడిభాగాలు అందజేస్తున్న ఈ సంస్థను చంద్రయాన్‌–2కు సంబంధించిన వస్తువుల తయారీ కోసం రక్షణ శాఖ ఎంపిక చేయడం విశేషం. ఈ సంస్థ చంద్రయాన్‌ సంబంధించి మొత్తం నాలుగు పరికరాలు తయారు చేసింది. ముఖ్యంగా బ్యాటరీలు ఫిక్స్‌ చేసే అల్యూమినియం స్టాండ్‌లు, నాసిల్స్, మరో రెండు రకాల వస్తువులు అందజేసింది. గతంలో ఇస్రో నిర్వహించిన పలు ప్రయోగాలకు సైతం నాగసాయి కంపెనీ పరికరాలు అంజేసింది. వాటిపై సంతృప్తి వ్యక్తం చేసిన రక్షణ శాఖ అధికారులు పలు దశల్లో కంపెనీ క్వాలిటీ, స్టాండర్డ్స్‌డ్స్‌పై పరీక్షలు నిర్వహించారు. చంద్రయాన్‌–2కు కూడా ఈ కంపెనీనే సరైందని నిర్ధారించి అవకాశం కల్పించారు.

విమాన విడిభాగాల్లోనూ...
చంద్రయాన్‌–1 ప్రయోగానికి సైతం ఈ కంపెనీ పరికరాలు అందజేసింది. అయితే అప్పట్లో తక్కువ సమయం మూలంగా కొన్ని వస్తువులను మాత్రమే తయారు చేయగా... ఈసారి చంద్రయాన్‌–2లో మాత్రం కీలకంగా మారింది. ఇందులో కీలకమైన ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లకు సంబంధించి 4 వస్తువులు తయారు చేసిచ్చింది. అత్యంత నాణ్యమైన నాసిల్స్‌ తయారు చేసిచ్చింది. గతంలో ఈ పరికరాలను తయారు చేయడానికి ఇజ్రాయెల్‌ నుంచి అల్యూమినియం తీసుకొచ్చేవారు. ప్రస్తుతం బాలానగర్‌ నుంచే తెప్పించడం విశేషం. ఇవీ కాకుండా హెచ్‌ఏఎల్, బీఈఎల్‌తో పాటు అన్‌నేమ్‌డ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ (యూఏఈ) వంటి సంస్థలకు విమాన విడిభాగాలు అందజేస్తోంది. ఈ విధంగా నాగసాయి కంపెనీ దేశ రక్షణ శాఖకు అవసరమైన కీలక పరికరాలు అందిస్తోంది. చంద్రయాన్‌–2లో పాలుపంచుకునే అవకాశం దక్కినందుకు బీఎన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

బీఎన్‌ రెడ్డి ప్రస్థానం...
కూకట్‌పల్లిలో నివాసముండే బి.నాగభూషణ్‌రెడ్డి బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత 1982లో చిన్నతరహా పరిశ్రమలో ఉద్యోగంలో చేరాడు. అనంతరం 1984లో బాలానగర్‌లోని సీఐటీడీలో ఎంటెక్‌ మెకానికల్‌ పూర్తిచేసి... హైదరాబాద్‌ అల్విన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగం చేరాడు. 1994లో కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌ పారిశ్రామిక ప్రాంతంలో నాగసాయి ప్రెసిషియన్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ స్థాపించారు. అప్పటి నుంచి అనేక రకాల ప్రయోగాత్మక వస్తువులను తయారు చేసేవారు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక విమాన కంపెనీలకు విడిభాగాలు అందజేశారు. నాసా, ఇస్రోలకు కూడా తన పరికరాలు అందజేయాలనే సంకల్పంతో 1998లో ఇస్రో అధికారులను సంప్రదించారు. వారు దాదాపు 6నెలలు బీఎన్‌ రెడ్డి పనితీరు, ఆయన కార్యాచరణ, నైపుణ్యంపై పలు దశల్లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం విడిభాగాలు తయారు చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 38 ఉపగ్రహాలకు వస్తువులు అందజేశారు.

ఇదో అద్భుతం
చంద్రునిపై వాతావరణ పరిస్థితులు, అక్కడ స్థితిగతులు, మంచినీరు, నిక్షేపాలను గుర్తించేందుకు చంద్రయాన్‌–2 ఎంతగానో దోహదపడుతుంది. అతి తక్కువ బడ్జెట్‌తో ఇస్త్రో చంద్రుడిపైకి చంద్రయాన్‌–2ను ప్రయోగించడం నిజంగా అద్భుతం. దీని ద్వారా చంద్రునిపై మానవ మనుగడ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. చంద్రునిపై వనరులు, ఖనిజ నిక్షేపాలు... ఇలా ఎన్నో విషయాలను చంద్రయాన్‌–2 ద్వారా వెలుగులోకి రానున్నాయి. అలాంటి దానికి తాము పరికరాలను అందించడం ఎంతో గర్వంగా ఉంది.– బీఎన్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement