భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా పేరుగాంచిన జీఎస్‌ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ ద్వారా జీశాట్–29 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్వీ–మార్క్3–డీ2 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రోకు ఇది 67వ అంతరిక్ష ప్రయోగం. సమాచార ఉపగ్రహమైన జీశాట్–29లో కేఏ, కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లను అమర్చారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూ కశ్మీర్ ప్రజల ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.