సాక్షి, శ్రీహరికోట/నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) బాహుబలిగా పేరుగాంచిన జీఎస్‌ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ ద్వారా జీశాట్–29 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. బుధవారం సాయంత్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్వీ–మార్క్3–డీ2 నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రోకు ఇది 67వ అంతరిక్ష ప్రయోగం. సమాచార ఉపగ్రహమైన జీశాట్–29లో కేఏ, కేయూ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లను అమర్చారు. ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూ కశ్మీర్ ప్రజల ఇంటర్నెట్ కనెక్టివిటీ తదితర అవసరాల కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
నమ్మకమైన వాహనం..
జీఎస్‌ఎల్వీ–మార్క్3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చైర్మన్ కె.శివన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇదొక మైలురాయి అని అభివర్ణించారు. మార్క్ 3 ప్రయోగాంతో దేశీయంగా అధిక బరువైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టామని వెల్లడించారు. పీఎస్‌ఎల్వీ తరహాలోనే జీఎస్‌ఎల్వీ మార్క్ 3 రాకెట్ కూడా ఇస్రో ప్రయోగాలకు నమ్మకమైన వాహనంగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే జనవరిలో చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపడతామని వెల్లడించారు. ఇక మానవ సహిత ప్రయోగాలకు శ్రీకారం చుడతామనీ.. గగన్‌యాన్ ద్వారా మానవుడిని అంతరిక్షంలోకి పంపుతామని శివన్ స్పష్టం చేశారు.
ఐదో తరం రాకెట్..
జీఎస్‌ఎల్వీ–మార్క్3 ఇస్రో అభివృద్ధి చేసిన ఐదో తరం రాకెట్. 4 టన్నుల బరువైన ఉపగ్రహాలను కూడా ఇది భూస్థిర బదిలీ కక్ష్య (జీటీవో–జియోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టగలదు. ఈ రాకెట్ 43.43 మీటర్ల పొడవుతో 640 టన్నుల బరువుంటుంది. జీఎస్‌ఎల్వీ–మార్క్3–డీ2 రాకెట్ ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారి ఆలయంలో రాకెట్ నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి శివన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
మరిన్ని విజయాలు సాధించాలి..
రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జీఎస్‌ఎల్వీ–మార్క్3 ప్రయోగం విజయవంతమవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment