జపాన్ ప్రయోగించిన ‘మూన్ స్నైపర్’ (స్లిమ్) ల్యాండర్ మూడు రోజుల క్రితం చంద్రుడిపైనున్న షియోలీ బిలం వాలులో దిగింది. ఆ ప్రదేశంలో ప్రస్తుతం భానోదయం. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి ఆగమిస్తున్నాడు. ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ సౌరఫలకాలు (సోలార్ ప్యానెల్స్) మాత్రం పడమటి దిక్కు వైపు మోహరించి ఉన్నాయి. ఫలితంగా వ్యోమనౌకలో సౌర విద్యుత్ తయారీకి ఇప్పుడు అవకాశం లేదు. అందుకే... భవిష్యత్తులో ల్యాండర్ పునఃప్రారంభ అవసరాల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా తమ ‘మూన్ స్నైపర్’ బ్యాటరీని స్విచ్ ఆఫ్ చేసినట్టు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) సోమవారం ప్రకటించింది.
వ్యోమనౌక ఆన్బోర్డ్ బ్యాటరీలో 12% (కనీస) పవర్ ఉందని, చంద్రుడిపై ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ దిగిన మూడు గంటలకు దాని బ్యాటరీని స్విచాఫ్ చేశామని ‘జాక్సా’ తెలిపింది. అవసరమైనప్పుడు ల్యాండరును రీ-స్టార్ట్ చేయడానికి అందులో ఉన్న 12% పవర్ సరిపోతుందని సంస్థ పేర్కొంది. కొద్ది రోజుల తర్వాత సూర్యుడు పడమటి దిక్కుకు వాలినప్పుడు ల్యాండర్ సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశముంది. అప్పుడు ల్యాండరును పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాం ‘జాక్సా’ వివరించింది.
ప్రస్తుతం ల్యాండర్ నిద్రాణ స్థితిలో ఉంది. సౌరవిద్యుత్ తయారీ దృష్ట్యా చంద్రుడిపై దిగే ల్యాండర్లు, రోవర్లు వంటి వ్యోమనౌకల్ని సాధారణంగా జాబిలిపై సూర్యుడు సరిగ్గా ఉదయించే వేళల్లోనే/ప్రదేశాల్లోనే దిగేలా చూస్తుంటారు. చంద్రుడిపై పగటి సమయం (పగలు) 15 రోజులు ఉంటుంది. అలాగే రాత్రి సమయం కూడా 15 రోజుల పాటు ఉంటుంది. చంద్రుడిపై ‘మూన్ స్నైపర్’ దిగిన ప్రదేశంలో భానుడు ప్రస్తుతం తూర్పు దిక్కు నుంచి పడమటి వైపుగా ప్రయాణం సాగిస్తున్నాడు.
అక్కడ సూర్యుడు నడి నెత్తి నుంచి అంటే... మధ్యాహ్నం తర్వాత కాస్త ఆవలకు దిగి పొద్దు వాలితే గానీ ‘మూన్ స్నైపర్’ సోలార్ ప్యానెళ్లకు సూర్యరశ్మి సోకదు. సూర్యకాంతి తగిలితేనే, దాని నుంచి సౌరవిద్యుత్ తయారుచేసి వినియోగించుకోగలిగితేనే ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ కోలుకున్నట్టు. జపాన్ మూన్ మిషన్ విజయవంతమైనట్టు. తమ ‘స్లిమ్’ ల్యాండర్ నుంచి చాలా డేటా సేకరించామని, త్వరలో దాన్ని వెల్లడిస్తామని ‘జాక్సా’ ప్రకటించింది.
- జమ్ముల శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment