నేడే ఓరియాన్‌ రాక | NASAs Artemis 1 Orion spacecraft set for return to Earth on Dec 11 2022 | Sakshi
Sakshi News home page

నేడే ఓరియాన్‌ రాక

Published Sun, Dec 11 2022 4:52 AM | Last Updated on Sun, Dec 11 2022 4:52 AM

NASAs Artemis 1 Orion spacecraft set for return to Earth on Dec 11 2022 - Sakshi

వాషింగ్టన్‌: చంద్రునిపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆర్టెమిస్‌ 1 ద్వారా దాదాపు నెల క్రితం ప్రయోగించిన ఓరియాన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ విజయవంతంగా పని పూర్తి చేసుకుని తిరిగి రానుంది. ఏకంగా 13 లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం ఎట్టకేలకు భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి భూమిని చేరనుంది. అయితే ఇది ఆద్యంతం హై రిస్కుతో కూడుకున్న తిరుగు ప్రయాణమని నాసా చెబుతోంది.

ఎందుకంటే భూ వాతావరణంలోకి ప్రవేశించాక ఓరియాన్‌ ఏకంగా గంటకు పాతిక వేల మైళ్ల వేగంతో దూసుకురానుంది. ఈ క్రమంలో ఏర్పడే ఘర్షణ వల్ల ఏకంగా 2,760 డిగ్రీల వేడి కూడా పుట్టుకొస్తుంది. అంటే సూర్యునిపై ఉండే వేడిలో సగం! అంతటి వేగాన్ని, వేడిని తట్టుకుంటూ ఆర్టెమిస్‌ పసిఫిక్‌ మహాసముద్రంలో కాలిఫోర్నియాలోని శాన్‌ డియాగో వద్ద తీరానికి దాదాపు 50 మైళ్ల దూరంలో క్షేమంగా దిగాల్సి ఉంటుంది.

ఇది పెను సవాలేనని నాసా సైంటిస్టులంటున్నారు. అందుకే వారిలో ఇప్పట్నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పైగా ఓరియాన్‌ ల్యాండింగ్‌ కోసం నాసా తొలిసారిగా ‘స్కిప్‌ ఎంట్రీ’ టెక్నిక్‌ను వాడుతుండటం ఉత్కంఠను మరింత పెంచుతోంది. దీనిప్రకారం నీళ్లలోకి విసిరిన రాయి మాదిరిగా ఓరియాన్‌ భూ వాతావరణం తాలూకు పై పొరలోకి ఒక్కసారిగా వచ్చి పడుతుంది. తద్వారా దాని అపార వేగం చాలావరకు తగ్గడమే గాక వేడి కూడా అన్నివైపులకూ చెదిరిపోతుందట.

అంతిమంగా ఓరియాన్‌ వేగాన్ని గంటకు 20 మైళ్లకు తగ్గించాలన్నది లక్ష్యం. ఇందుకోసం 11 భిన్నమైన పారాచూట్లను వాడనున్నారు. అయితే వేగం అదుపులోకి వచ్చేలోపు 2,760 డిగ్రీల వేడిని ఓరియాన్‌ ఏ మేరకు తట్టుకుంటుందన్నది అత్యంత కీలకం. ‘‘దీనికి ప్రస్తుతానికి మా దగ్గర కూడా స్పష్టమైన సమాధానం లేదు. అందుకే, ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాం’’ అని నాసా సైంటిస్టు ఒకరు చెప్పుకొచ్చారు. ఆ అపార వేడిని సమర్థంగా తట్టుకునేందుకు రక్షణ పరికరాల ఉత్పత్తి దిగ్గజం లాక్‌హీడ్‌–మార్టిన్‌ తయారు చేసిన అత్యంత మందమైన హీట్‌ షీల్డ్‌ను ఓరియాన్‌కు అమర్చారు.

ఆ ఏడు నిమిషాలే కీలకం...: ఓరియాన్‌ భూ వాతావరణంలోకి ప్రవేశించాక తొలి ఏడు నిమిషాలను అత్యంత కీలకమైనవిగా నాసా అభివర్ణిస్తోంది. ఆ సందర్భంగా కనీసం 10 నిమిషాల పాటు స్పేస్‌క్రాఫ్ట్‌తో అన్నిరకాల సమాచార సంబంధాలూ తెగిపోతాయని చెబుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement