మానవ నిర్మిత అంతరిక్ష అద్భుతం.. వాయేజర్ | Voyager, human wonder full human made spacecraft | Sakshi
Sakshi News home page

మానవ నిర్మిత అంతరిక్ష అద్భుతం.. వాయేజర్

Published Thu, Oct 3 2013 3:24 PM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM

మానవ నిర్మిత అంతరిక్ష అద్భుతం.. వాయేజర్

మానవ నిర్మిత అంతరిక్ష అద్భుతం.. వాయేజర్

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) మూడు దశాబ్దాల క్రితం ప్రయోగించిన ‘వాయేజర్-1’ ఎట్టకేలకు సౌర కుటుంబం అంచులను దాటేసింది.. అంతరిక్షంలో 36 ఏళ్లుగా నిరంతరంగా ప్రయాణిస్తున్న ఈ వ్యోమ నౌక తాజాగా దాదాపు1,900 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఏకంగా నక్షత్రాంతర రోదసి (రెండు నక్షత్రాల మధ్య ప్రాంతం)లోకి అడుగుపెట్టింది.. మానవ నిర్మిత అంతరిక్ష వస్తువు ఒకటి ఇలా నక్షత్రాంతర రోదసిలోకి చేరడం ఇదే తొలిసారి.. త ద్వారా వాయేజర్-1 మానవ జాతికి మరో అద్భుత విజయాన్ని అందించింది.. ఈ వ్యోమనౌక రోదసిలోని తీవ్ర రేడియేషన్‌ను కూడా తట్టుకోగలదు.
 
 
 సి. హరికృష్ణ
 సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
 
 రోదసి అన్వేషణలో మానవుడు ఒక సరికొత్త మైలురాయిని అధిగమించాడు. ఒక మానవ నిర్మిత అంతరిక్ష సాధనం తొలిసారిగా సౌర వ్యవస్థను దాటి అంతర నక్షత్ర రోదసి ప్రాంతంలోకి ప్రవేశించింది. 1977లో నాసా (అమెరికా అంతరిక్ష సంస్థ) ప్రయోగించిన వాయేజర్-1.. 2012, ఆగస్టు 25 నాటికి సౌర వ్యవస్థను దాటినట్లు ఈ ఏడాది సెప్టెంబర్ 12న నాసా ప్రకటించింది. వాయేజర్ విజయంతో భవిష్యత్‌లో ఇతర సౌర వ్యవస్థల్లోకి సైతం అంతరిక్ష నౌకలను ప్రయోగించే వెసులుబాటు కల్పిస్తుంది.
 
 ఏడాది కాలంగా:
 వాయేజర్-1 నుంచి అందిన సమాచారం మేరకు అది ఏడాది కాలంగా సౌర కుటుంబం ఆవలి నక్షత్రాంతర రోదసిలో ఉండే ప్లాస్మా తరంగాలు లేదా అయోనైజ్డ్ వాయువుల గుండా ప్రయాణిస్తున్నట్లు అంచనా వేశామని వాయేజర్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్త ఎడ్ స్టోన్ తెలిపారు. వాయేజర్-1 నుంచి వెలువడే సంకేతాలు కాంతి వేగంతో ప్రయాణిస్తూ 17 గంటల్లో భూమిని చేరతాయని, ప్రస్తుత సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించేందుకు కొన్ని నెలల సమయం పట్టొచ్చని ఆయన తెలిపారు. నక్షత్రాంతర ప్రదేశంలోకి ప్రవేశించినప్పటికీ.. సూర్యుడి ప్రభావం పూర్తిగా లేని ప్రాంతానికి వాయేజర్ ఎప్పుడు చేరుతుందనే విషయంలో స్పష్టత లేదు.
 
 గ్రాండ్ టూర్:
 సౌర వ్యవస్థలో బాహ్య గ్రహాల అన్వేషణ ఉద్దేశంతో ‘ప్లానెటరీ గ్రాండ్ టూర్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని 1964లో జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (ఖీజ్ఛి ఒ్ఛ్ట ్కటౌఞఠటజీౌ ఔ్చఛౌట్చ్టౌటడ)కి చెందిన గ్యారీ ఫ్లోరిడా ప్రతిపాదించాడు. ఇందులో భాగంగా రూపొందించిన మిషన్‌లో తొలుత నాలుగు అంతరిక్ష నౌకలను ప్రయోగించాలని నిర్ణయించారు. గురు, శని, ప్లూటో గ్రహాల అధ్యయనం కోసం 1976-77లో రెండు నౌకలను, గురు, యురేనస్, నెఫ్ట్యూన్ గ్రహాల అధ్యయనం కోసం 1979లో మరో రెండు అంతరిక్ష నౌకలను ప్రయోగించాలని ప్రతిపాదించారు. ఆర్థిక కారణాలతో 1972లో ఈ గ్రాండ్ టూర్ నిలిచిపోయింది. అయినప్పటికీ.. గ్రాండ్ టూర్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో అధిక శాతం అంశాలను వాయేజర్ కార్యక్రమంలో చేర్చారు.
 
 వాయేజర్ ప్రాథమిక మిషన్:
 జంట నౌకలుగా వాయేజర్ 1, 2లను నాసా 1977లో ప్రయోగించింది. ఈ రెండింటిలో తొలుత వాయేజర్-2ను 1977, ఆగస్టు 20న ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి టైటాన్-సెంటార్ రాకెట్ నుంచి ప్రయోగించారు. అదే ఏడాది సెప్టెంబర్ 5న వాయేజర్-1ను ప్రయోగించారు. 16 రోజుల తేడాతో ఈ రెండు నౌకల ప్రయోగం జరిగింది. వాయేజర్ మిషన్‌ను ప్రాథమికంగా బాహ్య గ్రహాల అధ్యయనం కోసం నాసా చేపట్టింది. గురు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను వాటి 48 చంద్రులను, ఆ గ్రహాల చుట్టూ ఉన్న వలయాలను వాయేజర్-1, 2 జంట నౌకలు అన్వేషించాయి.
 
 ఇందులో 1979, మార్చి 5న వాయేజర్-1 గురు గ్రహానికి అతి దగ్గరగా చేరుకుంది. 1979, జూలై 9న వాయేజర్-2 కూడా గురు గ్రహాన్ని సమీపించింది. అదేవిధంగా శని గ్రహానికి వాయేజర్-1 1980, నవంబర్ 12న, వాయేజర్-2 1981, ఆగస్టు 25న అతి దగ్గరగా ప్రయాణించాయి. యురేనస్‌కు దగ్గరగా 1986, జనవరి 24న, నెప్ట్యూన్‌కు 1989, ఆగస్టు 25న వాయేజర్-2 సమీపించింది. వాయేజర్ కంటే ముందే పయొనీర్ 10, 11ను బాహ్య సౌర వ్యవస్థ అధ్యయనం కోసం నాసా ప్రయోగించింది. అయితే 1998, ఫిబ్రవరి 17న వాయేజర్-1 అంతరిక్ష నౌక, పయొనీర్-10 చేరిన దూరాన్ని అధిగమించింది.
 
 వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్
 (Voyager Inter-stellar Mission-VIM):
 వాయేజర్ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ సౌర వ్యవస్థ ఆవల అంటే హీలియోస్పియర్ దాటి వాయేజర్ అంతరిక్ష నౌకలను తీసుకు వెళ్లాలని నిర్ణయించిన నాసా వీఐఎం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ప్రారంభ సమయానికి వాయేజర్-1 సూర్యుని నుంచి దాదాపు 40 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో, వాయేజర్-2 సూర్యుని నుంచి 31 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో ఉన్నాయి. వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్‌లో మూడు దశలు ఉన్నాయి. అవి.. టెర్మినేషన్ షాక్, హీలియోషీత్ అన్వేషణ, అంతర నక్షత్ర (Interstellar) అన్వేషణ. సౌర అయస్కాంత క్షేత్ర ప్రభావం ఉన్న సౌర వ్యవస్థ మలి ప్రాంతంలో ఏదో ఒక ప్రదేశం వద్ద సూపర్ సౌర గాలులు, అంతర నక్షత్ర గాలులు ఒక దానికి ఒకటి తారసపడతాయి. వాయేజర్ అంతరిక్ష నౌక ఈ ప్రాంతాన్ని చేరడంతో టెర్మినేషన్ షాక్ దశ పూర్తయింది. ఇక్కడ సూపర్ సోనిక్ సౌర గాలులు సబ్ సోనిక్ వేగానికి తగ్గి సౌర అయస్కాంత క్షేత్రంలో భారీ స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయి. టెర్మినేషన్ షాక్ దశను వాయేజర్-1.. 94 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో ఉన్నప్పుడు 2004లో అధిగమించింది. అదేవిధంగా 84 AU (ఆస్ట్రనామికల్ యూనిట్) దూరంలో ఉన్నప్పుడు 2007లో వాయేజర్-2 ఈ దశను దాటింది. ఆ తర్వాత హీలియోషీత్ ప్రాంతానికి వాయేజర్ జంట నౌకలు చేరుకున్నాయి. హీలియోస్పియర్ బాహ్య భాగాన్ని హీలియోషీత్ అంటారు. హీలియోషీత్ కొన్ని పదుల ఆస్ట్రనామికల్ యూనిట్ దూరంలో విస్తరించి ఉంటుంది. ఈ భాగాన్ని ప్రయాణించడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. హీలియోషీత్‌ను దాటిన తర్వాత అంతర నక్షత్ర రోదసి అన్వేషణ ప్రారంభమవుతుంది. వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్ ప్రధాన లక్ష్యం ఈ అంతర నక్షత్ర రోదసిని చేరడం. హీలియోస్పియర్ దాటి అంతర నక్షత్ర రోదసిల మధ్య ప్రాంతం హీలియోపాజ్. సూర్యుడి నుంచి హీలియోపాజ్ 8 నుంచి 14 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం వద్దనే మిలియన్ మైళ్ల వేగం ఉండే సౌర గాలులు 25 లక్షల మైళ్ల వేగానికి తగ్గుతాయి.
 
 మొదటి మానవ నిర్మిత సాధనం:
 2012, ఆగస్టు 25 నాటికి సూర్యుడి నుంచి 18.78 బిలియన్ కిలోమీటర్ల దూరంలో అంతర నక్షత్ర రోదసిలోకి ప్రయాణించిన మొదటి మానవ నిర్మిత సాధనంగా వాయేజర్ గుర్తింపు తెచ్చుకుంది. ఏప్రిల్‌లో వాయేజర్-1 నుంచి అందిన సమాచారం ఆధారంగా గతేడాది ఆగస్టులో అది రెండు నక్షత్రాల మధ్య ఉండే అంతర నక్షత్ర రోదసిలోకి ప్రవేశించిందని నాసా, ఇతర విశ్వవిద్యాలయాల అధ్యయనంలో వెల్లడైంది. వాయేజర్-2 ప్రస్తుతం 15.3 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. 2020 వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం వరకు ప్రయాణించగల శక్తి వాయేజర్ అంతరిక్ష నౌకలకు ఉంది. ఇది సాధ్యమైతే 2020 నాటికి వాయేజర్-1 సూర్యుని నుంచి 19.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలో, వాయేజర్-2 16.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.
 
 గోల్డెన్ రికార్‌‌డ:
 జంట వాయేజర్ నౌకలు 12 అంగుళాల బంగారు పూతతో కూడిన రాగి డిస్క్ పరికరాన్ని కలిగి ఉన్నాయి. ఇది ఒక ఫోనోగ్రాఫ్ రికార్డు. భూమిపై ఉన్న జీవ సంప్రదాయ వైవిధ్య సమాచారాన్ని ఈ డిస్క్‌లో పొందుపరిచారు. కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన కార్ల్ సగన్ ఆధ్వర్యంలోని ఒక కమిటీ ఈ డిస్క్‌లో పొందుపరిచిన సమాచారాన్ని సేకరించింది.
 
 115 చిత్రాలు, పలు సహజ ఆవాసాల శబ్దాలను ఇందులో ఉంచారు. గాలి, ఉరుము, పక్షులు, తిమింగలాలు, ఇతర జంతువుల శబ్దాలను ఇందులో పొందుపరిచారు. భూమిపై వివిధ కాలాలు, ప్రాంతాలు, సంప్రదాయాలకు చెందిన సంగీతాన్ని కూడా నిక్షిప్తం చేశారు. 55 భాషల్లో వ్యక్తుల సందేశాలతోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, అప్పటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ వాల్దీం (Kurt Josef Waldheim) సందేశాలు గోల్డెన్ రికార్‌‌డలో ఉన్నాయి. గ్రహాంతర వాసులకు ఈ రికార్‌‌డ అందితే భూమి, దాని గురించి అవగాహన చేసుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని రూపొందించారు.
 
 
 వాయేజర్-1 ప్రస్థానం
 
 లక్ష్యం: గ్రహాలు, నక్షత్రాంతర రోదసి పరిశోధన
 బరువు: 722 కిలోలు
 పరికరాలు:
 శ్రీహై గెయిన్ యాంటెన్నా (సౌర కుంటుంబం ఆవలి నుంచి రేడియో సంకేతాలు పంపే శక్తిమంతమైన యాంటెన్నా. భూమిపై మూడు డీప్‌స్పేస్ నెట్‌వర్క్ కేంద్రాలకు సిగ్నళ్లు పంపుతుంది. ఈ సిగ్నళ్లు భూమి ని చేరటానికి 17 గంటల సమయం పడుతుంది).
 శ్రీలో-ఫీల్డ్ మ్యాగ్నెటోమీటర్ (రోదసిలోని అయస్కాంత క్షేత్రాలను గుర్తిస్తుంది).
 శ్రీరేడియోఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జెనరేటర్ (దీనిలోని మూడు యూనిట్లు విద్యుత్‌ను అందిస్తాయి. ఇందులోని ఒక్కో యూనిట్లో పీడనానికి గురి చేసిన ప్లుటోనియం-238 ఆక్సైడ్ స్పియర్లు ఉంటాయి).
 శ్రీప్లానెటరీ రేడియో ఆస్ట్రానమీ (సూర్యుడు, గ్రహాలు, అంతరిక్షం నుంచి వచ్చే రేడియో సిగ్నళ్లను
 గుర్తిస్తుంది).
 శ్రీప్లాస్మావేవ్ సబ్‌సిస్టమ్
 (ప్లాస్మా, అయస్కాంత తరంగాలను గుర్తిస్తుంది).
 శ్రీమ్యాగ్నెటోమీటర్ (అయస్కాంత కేత్రాలు, గ్రహాలపై సూర్యుడి ప్రభావాన్ని అంచనా వేస్తుంది).
 శ్రీకాస్మిక్ రే డిటెక్టర్ (కాస్మిక్ కిరణాలు, ప్లాస్మాలోని కణాలను గుర్తిస్తుంది).
 శ్రీప్లాస్మా స్పెక్ట్రోమీటర్ (ప్లాస్మాలో అతి తక్కువ విద్యుదాత్మకతగల కణాలను, వాటి వేగాలను, మార్గాలను గుర్తిస్తుంది).
 శ్రీన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, రేడియో మీటర్ (ఉష్ణోగ్రత, రసాయన మూలకాలు, దృశ్య పరారుణ కాంతిని అంచనా వేస్తుంది).
 శ్రీఫోటో పోలరీ మీటర్ (గురు, శని, యురేనస్ భౌతిక ధర్మాలను గుర్తిస్తుంది).
 శ్రీఇమేజింగ్ సైన్స్ సిస్టమ్ (గ్రహాలు, వస్తువులను రెండు కెమెరాలతో ఫోటోలు తీస్తుంది).
 శ్రీఅల్ట్రావయిలెట్ స్పెక్ట్రోమీటర్ (పరిసరాల్లోని వాతావరణం, రేడియేషన్‌ను అంచనా వేస్తుంది).
 శ్రీలో-ఎనర్జీ చార్జ్‌డ్ పార్టికల్ డిటెక్టర్ (రోదసి నుంచి దూసుకు వచ్చే విద్యుదావేశ కణాల వేగం, దిశ, పరిమాణాన్ని గుర్తిస్తుంది)
 డీప్ స్పేస్ కమాండ్ నెట్‌వర్క్ ద్వారా రేడియో సిగ్నళ్లు పంపుతుంది.
 ఇంధనం-ప్లుటోనియం-238
 ప్రయోగం-1977, సెప్టెంబర్ 5
 ప్రయాణించిన దూరం- దాదాపు 1,900 కోట్ల కిలోమీటర్లు (125 AU) ఆగస్టు 2013 నాటికి
 ప్రస్తుత వేగం: సెకన్‌కు 17 కిలోమీటర్లు ఆగస్టు 2013 నాటికి 1979లో గురు గ్రహం దాటింది
 1980లో శని గ్రహం దాటింది
 2013లో సౌర కుటుంబం వెలుపలకు చేరింది
 గురు, శని గ్రహాలు, వాటి సహజ ఉపగ్రహాలకు సంబంధించి స్పష్టమైన చిత్రాలు పంపిన తొలి నౌక
 వాయేజర్-2 అత్యధిక రోజులు పని చేస్తున్న వ్యోమనౌకగా రికార్డు సృష్టించింది.
 వాయేజర్-1, 2 లను 1977లో 16 రోజుల తేడాతో ప్రయోగించారు. ఇవి అప్పటి నుంచి 36 ఏళ్లుగా
 నిరంతరంగా ప్రయాణిస్తూ సమాచారం పంపుతూనే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement