
చంద్రుడిని ఢీకొట్టిన ‘ల్యాడీ’!
వాషింగ్టన్: చంద్రుడి వాతావరణంపై అధ్యయనం కోసం గతేడాది పంపిన ల్యాడీ(లూనార్ అట్మాస్పియర్ అండ్ డస్ట్ ఎన్విరాన్మెంట్ ఎక్స్‌ప్లోరర్) వ్యోమనౌకను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూల్చివేసింది. ఆరు నెలల మిషన్ కోసం ల్యాడీని పంపగా.. ప్రస్తుతం ఆ కాలపరిమితి పూర్తయింది. ఇంధనం కూడా పూర్తిగా అయిపోవడంతో ల్యాడీని గత శుక్రవారం చంద్రుడి ఉపరితలంపై కూల్చేసినట్లు నాసా వెల్లడించింది. హైపవర్ రైఫిల్ బుల్లెట్ కన్నా మూడు రెట్లు వేగంగా, గంటకు 5,800 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ ల్యాడీ చంద్రుడిని ఢీకొట్టిందని తెలిపింది.
చంద్రుడిని ఢీకొట్టిన వ్యోమనౌక ముక్కలుచెక్కలై ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ల్యాడీ పడిన చోటు, సమయం వంటివాటిని త్వరలో నిర్ధారించనున్నారు. ఆ చోటుకు సంబంధించిన ఫొటోలనూ సేకరించనున్నారు. టూ-వే లేజర్ కమ్యూనికేషన్ వ్యవస్థ అమర్చిన తొలి వ్యోమనౌక అయిన ల్యాడీని నాసా 2013 సెప్టెంబర్‌లో ప్రయోగించింది. ల్యాడీలోని ‘లూనార్ లేజర్ కమ్యూనికేషన్ డెమాన్‌స్ట్రేషన్(ఎల్‌ఎల్‌సీడీ)’ వ్యవస్థ లేజర్ కిరణాల ద్వారా సమాచారాన్ని ప్రసారం చేసింది. ఎల్‌ఎల్‌సీడీ ద్వారా చంద్రుడి నుంచి భూమికి(3.84 లక్షల కి.మీ. దూరం) 622 ఎంబీపీఎస్ వేగంతో సమాచారాన్ని పంపి ల్యాడీ చరిత్ర సృష్టించింది.