జాబిల్లి అవతలివైపు మట్టి సేకరణ
బీజింగ్: చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(సీఎన్‌ఎస్‌ఏ) సరికొత్త చరిత్ర సృష్టించింది. చందమామపై మనకు కనిపించని అవతలివైపు భాగం నుంచి మట్టి నమూనాలను విజయవంతంగా భూమిపైకి తీసుకొచి్చంది. చైనా ప్రయోగించిన లూనార్ ప్రోబ్ మాడ్యూల్ చాంగ్‌యీ–6 జాబిల్లి నుంచి మట్టిని మోసుకొని స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.07 గంటల సమయంలో ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో క్షేమంగా దిగింది. చంద్రుడి అవతలి వైపు భాగంలోని మట్టిని భూమిపైకి సురక్షితంగా చేర్చిన మొట్టమొదటి దేశంగా చైనా రికార్డుకెక్కింది.
చైనా అంతరిక్ష ప్రయోగాల్లో ఇదొక మైలురాయి అని నిపుణులు చెబుతున్నారు. చాంగ్‌యీ–6 మిషన్ పూర్తిస్థాయిలో విజయవంతమైందని సీఎన్‌ఎస్‌ఏ ప్రకటించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల చైనా అధినేత షీ జిన్‌పింగ్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధకులకు అభినందనలు తెలిపారు. చాంగ్‌యీ–6 వ్యోమనౌక ఈ ఏడాది మార్చి 3న జాబిల్లి దిశగా తన ప్రస్థానం ప్రారంభించింది. ఇందులో అర్బిటార్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే భాగాలు ఉన్నాయి.
53 రోజులపాటు అవిశ్రాంతంగా ప్రయాణం సాగించి, జూన్ 2న చందమామ దక్షిణ ధ్రువంలోని సౌత్‌పోల్–అయిట్‌కెన్(ఎస్‌పీఏ) ప్రాంతంలో సురక్షితంగా దిగింది. రోబోటిక్ హస్తం సాయంతో రెండు రోజులపాటు మట్టి నమూనాలను సేకరించిన అసెండర్ జూన్ 4న తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. జూన్ 6న భూకక్ష్యలోకి ప్రవేశించింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఆర్బిటార్–రిటర్నర్‌కు మట్టి నమూనాలను బదిలీ చేసింది.
భూమిపై అడుగుపెట్టడానికి తగిన సమయం కోసం వేచి చూస్తూ ఆర్బిటార్–రిటర్నర్ 13 రోజలపాటు కక్ష్యలోనే చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు మంగళవారం భూమిపైకి క్షేమంగా చేరుకుంది. అరుదైన మట్టి నమూనాలను తీసుకొచి్చంది. వీటిలో వేల ఏళ్ల నాటి అగి్నపర్వత శిలలు కూడా ఉండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో అమెరికాకు దీటుగా చైనా దూసుకెళ్తోంది. 2030 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపించబోతున్నామని గతంలోనే ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment