వాషింగ్టన్ డీసీ: అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సంచలనంగా.. అదే సమయంలో కీలకంగానూ మారింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ప్రపంచంలోనే అత్యంత భారీ, శక్తివంతమైన టెలిస్కోప్‌గా దీనికి ఒక పేరు ముద్రపడింది. అంతెందుకు అంతరిక్ష శూన్యంలో ఆరు నెలల కాలం పూర్తి చేసుకుని.. అద్భుతమైన చిత్రాలను విడుదల చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే, తాజాగా ఓ నివేదిక అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా National Aeronautics and Space Administration ను ఆందోళనకు గురి చేస్తోంది.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దెబ్బ తిందని.. రాబోయే రోజుల్లో అది టెలిస్కోప్ పని తీరుపై ప్రభావం చూపనుందన్నది ఆ నివేదిక సారాంశం. కమీషనింగ్ ఫేజ్‌లో టెలిస్కోప్ పని తీరును పరిశీలించిన సైంటిస్టుల బృందం ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సదరు కథనం పేర్కొంది.
ప్రస్తుతం, అనిశ్చితి యొక్క అతిపెద్ద మూలం సూక్ష్మ ఉల్కలతో దీర్ఘకాలిక ప్రభావాలు ప్రాధమిక అద్దాన్ని నెమ్మదిగా క్షీణింపజేస్తాయి అని సైంటిస్టులు చెప్తున్నారు. మే 22వ తేదీన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రాథమిక అద్దం, ఆరు మైక్రోమెటీరియోరైట్స్(సూక్ష్మ ఉల్కలు) కారణంగా దెబ్బ తింది. చివరి ఉల్క ఢీకొట్టడంతోనే టెలిస్కోప్ అద్దం దెబ్బతిందని సైంటిస్టులు స్పష్టం చేశారు.
ప్రభావం చిన్నదిగానే చూపిస్తున్నప్పటికీ.. అది రాబోయే రోజుల్లో ఎంత మేర నష్టం చేకూరుస్తుందన్న విషయంపై ఇప్పుడే ఒక అంచనాకి రాలేమని సదరు సైంటిస్టులు పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన అబ్జర్వేటరీ ప్రభావం ఎంతవరకు ఉందో చూపించే చిత్రాన్ని శాస్త్రవేత్తలు విడుదల చేశారు.
అదే సమయంలో డ్యామేజ్ గురించి స్పందించిన జేమ్స్ వెబ్ రూపకర్తలు.. టెలిస్కోప్ అద్దాలు, సన్‌షీల్డ్(టెన్నిస్ కోర్టు సైజులో ఉంటుంది)లు ఉల్కల దెబ్బతో నెమ్మదిగా పని చేయడం ఆపేస్తాయని తేల్చడంపై నాసా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో ఈ సమస్యను వీలైనంత త్వరగతిన పరిష్కరించాలనే ఆలోచనలో ఉంది నాసా.
ఇదిలా ఉంటే హబుల్ టెలిస్కోప్ తర్వాత.. ప్రపంచంలోనే అత్యంత భారీ టెలిస్కోప్‌గా పేరు దక్కించుకుంది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. నాసా NASA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ESA), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ(CSA)ల సహకారంతో సుమారు 10 బిలియన్ల డాలర్లు వెచ్చించి తయారు చేయించింది.
ఈ టెలిస్కోప్ మిర్రర్స్ చాలా చాలా భారీ సైజులో ఉంటాయి. డిసెంబర్ 25, 2021లో దీనిని అంతరిక్షంలోకి ప్రయోగించగా.. ఫిబ్రవరి నుంచి భూమికి 1.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో L2 పాయింట్ వద్ద ఇది కక్ష్యలో భ్రమిస్తూ ఫొటోలు తీస్తోంది.
వెబ్ యొక్క అద్దం అంతరిక్షంలో తీవ్ర వేగంతో ఎగురుతున్న దుమ్ము-పరిమాణ కణాలతో బాంబు దాడిని తట్టుకునేలా రూపొందించబడిందని నాసా గతంలో ప్రకటించుకుంది. కానీ, ఇప్పుడు చిన్న చిన్న ఉల్కల దాడిలో దెబ్బ తింటుండడం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment