
సాక్షి, హైదరాబాద్: పాలనను సరళ తరం చేసి మానవ జీవనాన్ని సులభతరం చేయడమే ఈ–గవర్నెన్స్ ప్రధాన ధ్యేయం కావాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన ‘న్యూ ఇండియా’ ఆవిర్భావానికి ఇది అత్యవసరమని చెప్పారు. మంగళవారం హైదరాబాద్ హైటెక్స్‌లో ఈ–గవర్నెన్స్‌పై జరిగిన జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ‘కనిష్ట ప్రభుత్వంతో గరిష్ట పాలన అందించడానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఈ–గవర్నెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఎన్నో విజయాలు సాధించింది. సీపీజీఆర్‌ఏఎంఎస్ పోర్టల్‌కు మూడేళ్ల కింద 2 లక్షల ఫిర్యాదులొస్తే ఈ ఏడాది 16 లక్షల ఫిర్యాదులు అందాయి. వీటిలో 86 శాతం పరిష్కరించాం. ప్రభుత్వం నుంచి మెరుగైన స్పందనే ఇందుకు కారణం’ అని అన్నారు. ప్రభుత్వంలో కింది స్థాయి ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ పద్ధతి, దస్తా వేజు పత్రాలపై గెజిటెడ్ అధికారుల ప్రమాణీకరణ తొలగింపు, ఇలా కాలం చెల్లిన 1,500కు పైగా నియమాలు రద్దు చేశామని చెప్పారు.
తెలంగాణ ‘మీ–సేవ’కు పతకం..
కార్యక్రమంలో జాతీయ ఈ–గవర్నెన్స్ పురస్కారాలను మంత్రి జితేంద్రసింగ్ ప్రదానం చేశారు. 8 కేటగిరీల్లో 19 అవార్డులు అందజేశారు. ప్రతి కేటగిరీలో స్వర్ణ పతకానికి రూ. 2 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం.. రజత పతకానికి రూ.1 లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందించారు. తెలంగాణ ‘మీ–సేవా’విభాగానికి రజత పతకం దక్కింది. కార్యక్రమంలో పరిపాలన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి కె.వి. ఇయాపెన్, డీఏఆర్పీజీ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా, తెలంగాణ అదనపు ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.