మార్స్‌కి చేరువలో మామ్ | Launch of PSLV C25 for mission to Mars | Sakshi
Sakshi News home page

మార్స్‌కి చేరువలో మామ్

Published Sun, Sep 21 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

మార్స్‌కి చేరువలో మామ్

మార్స్‌కి చేరువలో మామ్

వివరం: 82 కోట్ల కిలోమీటర్లు.. 323 రోజులు.. చందమామను దాటి అంతరిక్షంలో సుదీర్ఘ ప్రయాణం..  
సవాళ్లను అధిగమిస్తూ.. సాఫీగా సాగుతూ.. మార్స్ ఆర్బిటర్ మిషన్.. మామ్.. మంగళ్‌యాన్!
అంగారకుడిని అందుకునే వేళ.. మరో మూడు రోజులే..!
అరుణుడి గగనంపై మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడబోతోంది.
అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తిపతాక మరోసారి వినువీధిన ప్రకాశించనుంది.
ఈ వైనమే... ఈవారం మన ‘వివరం’.

 
నవంబరు 5, 2013. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట, సతీశ్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం. సమయం మధ్యాహ్నం 2:38 గంటలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ‘గెలుపు గుర్రం’ పీఎస్‌ఎల్‌వీ-సీ25 ఉపగ్రహ వాహక నౌక నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిసింది. తనతోపాటు మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం-మామ్; మంగళ్‌యాన్) ఉపగ్రహాన్ని మోసుకెళ్లి భూకక్ష్యలోకి విజయవంతంగా విడిచిపెట్టింది. ఇస్రోకు ఇది 109వ ప్రయోగం. మామూలుగానైతే దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కానీ.. భారత్‌కు సంబంధించినంత వరకూ ఇది మహాయానం.
 
చందమామను దాటి.. తొలిసారిగా గ్రహాంతరానికి చేపట్టిన మహా ప్రయోగం. గ్రహాంతరాలకు వెళ్లే సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు చేసిన తొట్ట  తొలి ప్రయత్నం. అంతేకాదు.. అమెరికా, రష్యా అంతరిక్ష సంస్థలు సైతం సాధించలేని ‘తొలి ప్రయత్నంలోనే విజయా’న్ని ఇస్రో సాధించబోతోంది. అంగారక యాత్ర దిగ్విజయంగా చేపట్టిన నాలుగో దేశంగా అవతరించబోతోంది. అరుణగ్రహం దిశగా నిరంతరం సెకనుకు 22 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న మామ్.. సరిగ్గా సెప్టెంబరు 24వ తేదీన అర్ధరాత్రి అరుణుడి కక్ష్యలోకి చేరుకోబోతోంది. ఈ నేపథ్యంలో.. 10 నెలలుగా మామ్ ప్రయాణం ఎలా సాగింది? మార్స్ కక్ష్యలోకి ఎలా చేరుకుంటుంది? అరుణుడి చుట్టూ తిరుగుతూ ఏం చేస్తుంది? తదితర ఆసక్తికర సంగతులు తెలుసుకుందాం.
 
ఎర్త్ టు మార్స్.. ప్రయాణం సాగిందిలా
భూకక్ష్యలోకి చేరిన తర్వాత ఉపగ్రహంలోని ఇంజన్‌ను కొద్ది సెకన్లపాటు మండిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలు దశలవారీగా కక్ష్య ఎత్తును ఐదు దశల్లో పెంచారు. చివరగా భూమికి దగ్గరగా 250 కి.మీ.(పెరిజీ), భూమికి దూరంగా 2 లక్షల కి.మీ.(అపోజీ) పరిధిలోనిదీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చేర్చారు. మొత్తంగా భూమి చుట్టూ ఐదుసార్లు చక్కర్లు కొట్టిన మామ్ డిసెంబరు 1వ తేదీ తెల్లవారుజామున మనకు వీడ్కోలు పలుకుతూ అంగారకుడి దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. వెళుతూ వెళుతూ భూమిని తన కలర్ కెమెరాతో ఫొటో తీసి మనకు కానుకగా పంపింది. ఇంజన్‌ను మండించి వేగం పెంచి, దిశను మార్చడంతో ఉపగ్రహం ఒక్క ఉదుటున అంగారక కక్ష్య వైపు దూసుకుపోయింది.
 
దీంతో అంగారకయాత్రలో మొదటిదైన జియోసెంట్రిక్ దశ ముగిసి.. రెండోదైన హీలియోసెంట్రిక్ దశ మొదలైంది. సూర్యుడి చుట్టూ అంగారకుడు తిరిగే కక్ష్య ఆధారంగా ఈ దశ ప్రయాణం సాగింది. మార్గమధ్యంలో ఉపగ్రహాన్ని సరైన దారిలో పెట్టేందుకు రెండు సార్లు మోటార్లను కొన్ని సెకన్లపాటు మండించి మార్గ సవరణలు చేశారు. సుదీర్ఘమైన ఈ దశలో 300 రోజులుగా నిరంతరం ప్రయాణిస్తున్న మామ్.. అంతరిక్షంలో సోలార్, కాస్మిక్ రేడియేషన్‌ను, మారిపోయే ఉష్ణోగ్రతలను తట్టుకుంటూనే 80 కోట్ల కి.మీ. అధిగమించి మూడోదశకు చేరువైంది. కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల భూమి నుంచి ఉపగ్రహానికి సంకేతాలు పంపేందుకు సగటున 20 నిమిషాలు పడుతుంది.
 
తిరిగి అక్కడి నుంచి భూమికి సంకేతాలు అందేందుకు మరో 20 నిమిషాలు పడుతుంది. అంటే.. 40 నిమిషాల పాటు ఉపగ్రహం ఎటుపోతోంది? అన్నది తెలియదు. అందుకే.. పరిస్థితులను బట్టి సొంత నిర్ణయాలు తీసుకునేలా ఉపగ్రహానికి సాంకేతికతను జోడించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇక చివరిది, అత్యంత కీలకమైన మూడోదశ  మార్షియన్ ఫేజ్‌లో ఉపగ్రహం అంగారకుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించాల్సి ఉంది. అందుకోసం ద్రవ ఇంధన మోటారును మండించి ఉపగ్రహం వేగాన్ని కచ్చితత్వంతో నియంత్రించాల్సి ఉంటుంది. వేగం తగ్గకపోతే గనక.. ఉపగ్రహం అంగారకుడిని దాటేసి చాలా ముందుకు దూసుకుపోతుంది. అదే గనక జరిగితే ఇక మామ్ సంగతి మరిచిపోవాల్సిందే! అందుకే నెలల తరబడి పనిచేయకుండా ఉన్న ద్రవ ఇంధన మోటారు కచ్చితత్వంతో పనిచేయడం అన్నదే ఇప్పుడు మామ్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
 
ఆగస్టు నాటికి 62 కోట్ల కిలోమీటర్లు...
మామ్ ఆగస్టు 30 నాటికి 62.2 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. సెకనుకు 22.33 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం కొనసాగిస్తోంది. మిగిలి ఉన్న మరో 19.9 కోట్ల కిలోమీటర్లు కలిపి మొత్తం.. 82.1 కోట్ల కిలోమీటర్ల మహా ప్రయాణం ముగింపుతో మామ్ అంగారక కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. తర్వాత మార్స్‌కు దగ్గరగా 366 కి.మీ.(పెరిజీ), దూరంగా 80 వేల కి.మీ.(అపోజీ) ఉండే కక్ష్యలో స్థిరపడుతుంది. బెంగళూరులోని బైలాలు వద్ద గల ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ సాయంతో, ఇస్ట్రాక్(ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్) ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు మామ్‌ను నియంత్రిస్తున్నారు. ఉపగ్రహ పర్యవేక్షణకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా డీప్ స్పేస్ నెట్‌వర్క్ సాయం కూడా తీసుకుంటున్నారు. ప్రయోగ సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో నలంద, యమున అనే రెండు నౌకలను మోహరించి వాటిపై ఉన్న రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలతో, భూమిపై ఇతర చోట్ల ఉన్న గ్రౌండ్ స్టేషన్ల సాయంతోనూ ఉపగ్రహాన్ని పర్యవేక్షించారు.
 
‘మంగళ్‌యాన్’ ఏమిటి?
మంగళ్‌యాన్ అంటే హిందీలో అంగారక నౌక అని అర్థం. వాస్తవానికి ఈ ఉపగ్రహానికి పేరు పెట్టలేదు. మార్స్ ఆర్బిటర్ మిషన్, మామ్, మంగళ్‌యాన్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం అంగారకయాత్ర చేపట్టే  సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం, డీప్ స్పేస్‌లో ఉపగ్రహాన్ని నియంత్రించడం, సుదీర్ఘ ప్రయాణంలో ఉపగ్రహం స్వతంత్రంగా వ్యవహరించేలా చూడటం వంటి సాంకేతికతలను పరీక్షించుకోవడం కోసమే ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. అంతరిక్షంలో రేడియేషన్‌ను, అకస్మాత్తుగా పడిపోతూ, పెరిగిపోతూ ఉండే ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ చోదక, విద్యుత్, సమాచార, దిక్సూచీ వ్యవస్థలన్నీ నిరంతరం సక్రమంగా పనిచేస్తేనే.. ఉపగ్రహం సురక్షితంగా ప్రయాణించగలదు. అందువల్ల అంగారకయాత్ర విజయవంతంగా చేపట్టడం అంటే క్లిష్టమైన సాంకేతిక సవాళ్లను అధిగమించడమే. భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు, మానవసహిత అంగారక యాత్రకు వేదికను సిద్ధం చేసుకోవడమే. అలాగే మార్స్ ఉపరితలాన్ని, భౌగోళిక  స్వరూపాన్ని అధ్యయనం చేయడం, అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకోవడం ప్రధాన లక్ష్యాలుగా కూడా  ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
 
మామ్ కన్నా ముందు మావెన్
ఇస్రో మామ్‌ను ప్రయోగించిన 13 రోజులకు నవంబరు 18న నాసా కూడా మావెన్ అనే ఉపగ్రహాన్ని అంగారక యాత్రకు పంపింది. అయితే ఆలస్యంగా ప్రయాణం మొదలుపెట్టినా.. మామ్ కన్నా రెండు రోజుల ముందుగానే మావెన్ అంగారకుడిని చేరుకోనుంది. మామ్ 82 కోట్ల కి.మీ. ప్రయాణిస్తుండగా.. మావెన్ 71  కోట్ల కి.మీ. మాత్రమే ప్రయాణించి మార్స్‌ను చేరుతుంది. అయితే.. మావెన్ ప్రయోగం, నిర్వహణకు అమెరికా ఏకంగా 67.10 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుండగా.. మామ్‌కు అయ్యే ఖర్చు 7.50 కోట్ల డాలర్లు మాత్రమే. ఇస్రో అంగారకయాత్రకు అక్టోబరు 31 నాటికి మొత్తం రూ.450 కోట్ల బడ్జెట్‌లో రూ.244.06 కోట్లే ఖర్చుచేసింది. నాసాతో సమానంగా ఖర్చు పెడితే గనక భారత్ మరో 9 మామ్‌లను అంగారకుడిపైకి పంపగలదు. అంటే చాలా తక్కువ ఖర్చుతోనే అంగారకయానం సాధ్యం చేసిన ఘనత మన ఇస్రోదే అన్నమాట!
 
అంగారకయాత్ర... వైఫల్యాలే ఎక్కువ ! మన సౌరకుటుంబంలో భూమి తర్వాత జీవులకు కాస్తోకూస్తో అనుకూలంగా ఉన్న ఒకే ఒక్క గ్రహం అంగారకుడే. ఒకప్పుడు అక్కడ మంచినీటి సరస్సులు, సూక్ష్మజీవుల మనుగడకు అనుకూలమైన వాతావరణం, గాలిలో ఆక్సీజన్ సైతం ఉండేవని అంచనా. అందుకే మార్స్‌పై పరిశోధనలకు ప్రపంచదేశాలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఇప్పటిదాకా అంగారకుడిపైకి ఉపగ్రహాలు, రోవర్ల ప్రయోగాలు మొత్తం 51 జరగగా అందులో 21 మాత్రమే విజయవంతమయ్యాయి. రష్యా, అమెరికా, ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) మాత్రమే ఈ ఘనత సాధించాయి.
 
పొరుగుదేశం చైనా కూడా 2011లో అంగారకయాత్ర చేపట్టినా, భూకక్ష్య నుంచి అంగారకుడి మార్గం వైపు వెళ్లాల్సిన తరుణంలో ఉపగ్రహంలోని ఇంజన్లు మొరాయించాయి. దీంతో అది ఎటూగాకుండాపోయి భూకక్ష్యలోనే నిరుపయోగంగా తిరుగుతోంది. ఇక జపాన్ 1998లో పంపిన ఉపగ్రహంలో మార్గమధ్యంలోనే ఇంధనం అయిపోవడంతో అంగారకుడిని చేరలేకపోయింది. అన్నిదేశాల కంటే ముందే 1960లో అంగారకుడిపైకి ప్రయోగాలు మొదలుపెట్టిన రష్యా వరుస వైఫల్యాల తర్వాత ఎట్టకేలకు పదో ప్రయత్నంలో 1971లో మార్స్2 ఆర్బిటర్‌ను పంపగలిగింది. అయితే 1964లో రెండో ప్రయత్నంలోనే విజయాన్ని అందుకుని మార్స్‌కు ఉపగ్రహాన్ని పంపిన తొలి దేశంగా అమెరికా చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా 7 వైఫల్యాలు ఎదుర్కొన్నా, 17 విజయాలను దక్కించుకుని తిరుగులేని సత్తా చాటింది.  
 
మార్స్‌పై ఇప్పుడు పనిచేస్తున్నవి ఇవే...
నాసాకు చెందిన మార్స్ ఒడిస్సీ, ఎంఆర్‌వో, ఈసాకు చెందిన మార్స్ ఎక్స్‌ప్రెస్ ఉపగ్రహాలు ప్రస్తుతం అరుణుడి చుట్టూ తిరుగుతున్నాయి. అంగారకుడి ఉపరితలంపై సంచరిస్తూ క్యూరియాసిటీ, ఆపర్చునిటీ రోవర్లు కూడా భూమికి సమాచారం పంపుతున్నాయి. వీటితోపాటు  మామ్, మావెన్‌లు కూడా అంగారకుడి కక్ష్యకు చేరుకుని నిరంతరం పరిశీలిస్తూ భూమికి సమాచారం పంపనున్నాయి.  
 
తోకచుక్క... లక్కీచాన్స్ వెంటే ప్రమాదం!
అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సైడింగ్ స్ప్రింగ్ అనే ఓ భారీ తోకచుక్క అక్టోబరు 19న అంగారకుడి సమీపం నుంచి దూసుకుపోనుంది. సౌర కుటుంబం చివరలో ఉండే ఊర్ట్ క్లౌడ్ ప్రాంతం నుంచి వస్తున్న ఆ తోకచుక్క మార్స్ ఉపరితలానికి 1.34 లక్షల కి.మీ. సమీపం నుంచే వెళుతుండటంతో దానిని పరిశీలించే అద్భుత అవకాశం మామ్, మావెన్, ఇతర వ్యోమనౌకల ముంగిట ఉంది. అయితే.. ఆ తోకచుక్క కేంద్ర భాగం 2 కిలోమీటర్ల పరిమాణంలోనే ఉన్నా.. దానితోక సుమారు అన్ని వైపులా కలిపి ఏకంగా లక్ష కిలోమీటర్ల పరిమాణంలో ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. సెకనుకు 57 కి.మీ. వేగంతో దూసుకెళ్లే తోకచుక్క నుంచి రాలిపడే అవశేషాలు సైతం మితిమీరిన వేగంతో అంగారకుడి వైపు దూసుకొచ్చే అవకాశం ఉంటుంది. వాటిల్లో ఓ చిన్న ముక్క తగిలినా కూడా ఉపగ్రహాలు తీవ్రంగా ధ్వంసం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. అందుకే.. వీలైనంత వరకూ తోకచుక్కను ఫొటోలు తీయించాలని, అంతగా ప్రమాదం ముంచుకొస్తే.. తోకచుక్క వచ్చే సమయానికి ఉపగ్రహాలను అంగారకుడి వెనక వైపున  దాగిఉండేలా చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
 
మామ్ ప్రత్యేకతలు...
బరువు :  1,336 కిలోలు (ఇంధనం బరువే 860 కిలోలు)
జీవితకాలం : ఆరు నెలలు
తయారీ ఖర్చు : రూ.150 కోట్లు
నియంత్రణ ఖర్చు : రూ.90 కోట్లు
పీఎస్‌ఎల్‌వీ తయారీకి : రూ.110 కోట్లు
మొత్తం మిషన్ ఖర్చు : 450 కోట్లు
శాస్త్రీయ పరికరాలు : ఐదు

 
మామ్ పరికరాలు... చేసే పనులు
లైమన్ ఆల్ఫా ఫొటోమీటర్: అంగారకుడి వాతావరణంలో డ్యుటీరియం, హైడ్రోజన్‌ల శాతాన్ని అంచనా వేస్తుంది. దీనివల్ల అక్కడ నీరు ఎలా నాశనమైందో తెలుస్తుంది. మీథేన్ సెన్సర్: మార్స్ వాతావరణంలో మీథేన్ వాయువుని అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్నా పసిగడుతుంది. దీనివల్ల అది రసాయన ప్రక్రియల వల్ల పుట్టిందా? లేక జీవరాశి జీవక్రియల వల్ల పుట్టిందా? అన్నది తెలుసుకోవచ్చు. మార్స్ ఎక్సోస్ఫెరిక్ న్యూట్రల్ కాంపొజిషన్ అనలైజర్: వాతావరణంలో తటస్థ మూలకాల సమ్మేళనాన్ని గుర్తిస్తుంది. మార్స్ కలర్ కెమెరా: ఇది తీసే ఫొటోలు మార్స్ ఉపరితలాన్ని మరింత బాగా అర్థం చేసుకునేందుకు తోడ్పడతాయి. థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్: పరారుణకాంతి పరిధిలో మార్స్ నుంచి వెలువడే ఉష్ణ ఉద్గారాలను గుర్తిస్తుంది.
 
అరుణుడి సంగతులు...
భూమిపై మనకు 24 గంటలకు ఒక రోజు. 365 రోజులకు ఒక సంవత్సరం.  అంగారకుడిపై మాత్రం 24.37 గంటలకు ఒక రోజు, 687 రోజులకు ఒక ఏడాది అవుతుంది. సూర్యుడికి భూమి కన్నా అంగారకుడు ఎక్కువ దూరంలో ఉండటమే దీనికి కారణం. అంగారకుడి సైజు భూమిలో సగం కంటే కాస్త ఎక్కువ, భూమి గురుత్వాకర్షణలో 38 శాతమే ఉంటుంది. ఆక్సీజన్ మట్టిలో కలిసి, ఆక్సీకరణం జరిగి ఉపరితలంపై ఐరన్ ఆకై ్సడ్ పోగుపడటం వల్ల అది అరుణవర్ణంలో కనిపిస్తుంది. మనకు ఒకటే చందమామ.
 
కానీ అంగారకుడిపై నుంచి చూస్తే రెండు చందమామలు ఫోబోస్, డైమోస్‌లు కనువిందు చేస్తాయి.. అంగారకుడు భూమికి సగటున 22.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో, అతి దగ్గరగా వచ్చినప్పుడు 5 కోట్ల కి.మీ. దూరంలో ఉంటాడు.  సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు స్థానాలు మారుతుంటాయి కాబట్టి దూరం కూడా మారిపోతుంటుంది. మార్స్ కూడా భూమిలాగే 450 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడింది. సగటు ఉష్ణోగ్రత మైనస్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్లు. రాత్రుళ్లు మైనస్ 100 డిగ్రీలూ దాటుతుంది. వాతావరణం చాలా పలుచగా ఉండటం వల్ల రేడియేషన్ తీవ్రంగా ఉంటుంది. భారత్ సహా అనేక దేశాలవారు అంగారకుడికి మంగళవారాన్నే కేటాయించుకున్నారు. రోమన్లు, గ్రీకులు మార్స్‌ను తమ యుద్ధదేవతగా భావించేవారు. ఆమె పేరు మీదే ఈ గ్రహానికి మార్స్ అని పేరు పెట్టుకున్నారు.  
 
మానవాళికి మరో ప్రపంచం!?
రాత్రిపూట ఆకాశంలో ఎర్రటి చుక్కలా కనిపించే అంగారకుడి గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల సంస్కృతుల్లో పురాతన కాలం నుంచీ అనేక విశ్వాసాలు ఉన్నాయి. రాక్షసగ్రహం అనీ, మార్స్‌పై ఎంతో తెలివైన, ఆధునిక మనుషులు ఉంటారనీ, అంగారక వాసులు భూమిపై దండెత్తుతారనీ భావించేవారు. మొత్తానికి.. మిణుకు మిణుకుమనే తారలాంటి అరుణుడిపైకి ఎట్టకేలకు మనిషి వ్యోమనౌకలు పంపగలిగాడు. వచ్చే 2024 నుంచీ అంగారకుడిపైకి శాశ్వత నివాసం కోసం ఏటా ఇద్దరు చొప్పున మనుషులను పంపాలని మార్స్ వన్ అనే కంపెనీ ముమ్మర ప్రయత్నాలు కూడా చేస్తోంది. 2030ల నాటికి మానవసహిత అంగారక యాత్ర చేపట్టాలని నాసా సైతం భావిస్తోంది. ప్రస్తుత అంచనాలను బట్టి చూస్తే.. భవిష్యత్తులో టెక్నాలజీతో పాటు వేగం కూడా పెరిగి కొద్ది రోజుల్లోనే భూమి నుంచి మార్స్‌ను చేరుకునే రోజు త్వరలోనే రావొచ్చు. అంగారకుడిపై మానవ కాలనీలు వెలిసి.. టెర్రాఫార్మింగ్ పద్ధతుల ద్వారా కొన్ని వందల ఏళ్లలో అక్కడి వాతావరణాన్ని సైతం మార్చేసి అరుణగ్రహాన్ని హరితగ్రహంగా మార్చే ప్రయత్నాలూ జరగొచ్చు. ఇదంతా జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. కానీ.. ఏమో.. గుర్రం ఎగరావచ్చు!

 - హన్మిరెడ్డి యెద్దుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement