మార్స్ ఆర్బిటర్కు తొలి ఆటంకం
సూళ్లూరుపేట : ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మార్స్‌మిషన్‌కు ఈరోజు చిన్నపాటి ఆటంకం ఎదురయింది. 450 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన మంగళయాన్.. వేర్వేరు దశల్లో వేర్వేరు కక్ష్యలు మారుతూ లక్ష్యం దిశగా సాగాలి. కాగా ఈ ఉదయం అంగారక యాత్రలో ఆర్బిటర్ తొలి ఆటంకం ఎదుర్కొంది. కక్ష్య పెంపులో ఇబ్బందులు ఎదుర్కొన్న మార్స్ ఆర్బిటర్.. లక్ష కిలోమీటర్ల కక్ష్యను అందుకోలేకపోయింది.
నిర్దేశిత దూరంకన్నా 10వేల కిలోమీటర్ల దిగువలో ఉంది. దీనిపై స్పందించిన ఇస్రో ఛైర్మన్ రాధా కృష్ణన్, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నవంబర్ 5న ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ ఈ నెల 7 అర్థరాత్రి ఒంటి గంట పదినిమిషాలకు భూమికి 23550 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యను అందుకుంది. ఆ తర్వాత క్రమక్రమంగా కక్ష్య దూరాన్ని పెంచుతూ పోయారు. ప్రస్తుతం 78వేల కిలోమీటర్ల దూరంలో మార్స్ ఆర్బిటర్ ఉంది.