అసలు పరీక్ష మొదలైంది!
భూ కక్ష్య నుంచి మార్స్ కక్ష్య వరకూ సవాళ్లే
గ్రహాంతర అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో విజయవంతంగా తొలి అడుగు వేసింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని భూమికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది. అయితే అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఆర్బిటర్ అంగారక గ్రహం వరకూ సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. దీనిని అంగారక కక్ష్యా మార్గంలోకి ప్రవేశపెట్టడం వరకూ జరిగేది ఒక ఎత్తై ఆ తరువాత అరుణగ్రహం చేరేవరకూ ఉపగ్రహం ఇతర గ్రహాల ప్రభావానికి లోనుకాకుండా చూసుకోవడం, చేరిన తరువాత దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టడం కూడా భారత శాస్త్రవేత్తలకు సవాలు విసిరే అంశాలే.
మంగళవారం విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టిన మార్స్ ఆర్బిటర్ మరో 11 రోజుల తరువాత గానీ అంగారకుడి కక్ష్య మార్గంలోకి చేరదు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నారు.
మొత్తం ఐదు దశల్లో కక్ష్య ఎత్తును పెంచేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల ఏడో తేదీ తెల్లవారుజామున చేపట్టే తొలి దశలో ఉపగ్రహం ప్రయాణించే కక్ష్యను భూమి నుంచి 28,790 కిలోమీటర్ల దూరానికి పెంచుతారు. రెండు మూడు దశలు 8, 9 తేదీల్లో చేపడతారు. ఈ రెండు దశల్లో అపోగీ (భూమి నుంచి దూరంగా ఉండే దశ) 40 వేలు, 71,650 కిలోమీటర్లు చొప్పున ఉంటుంది. చివరి రెండు దశలను ఈ నెల 11, 16వ తేదీల్లో చేపడతారు. దీంతో ఉపగ్రహం అపోగీ ఏకంగా లక్ష నుంచి 1.92 లక్షల కిలోమీటర్లకు చేరుతుంది.
ఆ తరువాత అన్నీ సవ్యంగా సాగితే డిసెంబర్ ఒకటో తేదీ అర్ధరాత్రి 0.42 గంటల సమయంలో ఆర్బిటర్‌ను మార్స్ కక్ష్య మార్గంలోకి ప్రవేశపెడతారు. దీనిని అత్యంత ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఇక్కడి నుంచి ఆర్బిటర్ సుదీర్ఘ ప్రయాణం తర్వాత 2014 సెప్టెంబర్ 24వ తేదీన అంగారక గ్రహపు నిర్దేశిత కక్ష్యలోకి ఖచ్చితంగా చేర్చదలచుకున్న స్థానానికి ఒక 50 కిలోమీ టర్లు అటూ ఇటూగా చేరాలి.
ఆర్బిటర్ అంగారకుడి సమీపంలోకి వెళ్లేందుకు దాదాపు 300 రోజుల సమయంపడుతుంది. ఈ క్రమంలో ఏదైనా తేడా వచ్చి ఉపగ్రహం దారితప్పినా, లేదా అంగారక గ్రహ కక్ష్యను చేరిన తరువాత ఈ రకమైన సమస్య వచ్చినా.. దాని మార్గాన్ని సవరించి మళ్లీ దారిలో పెట్టేందుకు కొంత ఇంధనాన్ని కేటాయించారు.
మార్గ సవరణ కోసం ఇంధనాన్ని ఉపయోగిస్తే దాని ప్రభావం ఆర్బిటర్ ఆయుష్షుపై పడుతుంది. ఏ విధమైన సవరణలు లేకున్నా ఈ ఉపగ్రహం గరిష్టంగా కొన్ని నెలలు మాత్రమే పనిచేస్తుంది. మార్గ సవరణ కోసం ఎంత ఇంధనం ఉపయోగిస్తే అంతమేరకు ఆర్బిటర్ జీవితకాలం తరిగిపోతుంది.
మార్స్ ఆర్బిటర్ అంగారకుడి వైపు వెళుతున్నపుడు.. దానిని నియంత్రించేందుకు, ఇతరత్రా పంపించే సమాచార సంకేతాలు ఆర్బిటర్‌ను చేరటానికి 20 నిమిషాల సమయం పడుతుంది. అలాగే అది తిరిగి పంపించే సంకేతాలు భూమి మీది నియంత్రణ స్టేషన్లను చేరటానికి మరో 20 నిమిషాలు పడుతుంది. అంటే.. దాదాపు 40 నిమిషాల పాటు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఉంటుంది.
ఆర్బిటర్ అంగారకుడిని సమీపిస్తుండగానే దాని వేగాన్ని తగ్గించాలి. అలాగైతేనే అంగారక గ్రహపు కక్ష్యలోకి ఈ ఆర్బిటర్ వెళ్లగలదు. అలాకాకుండా అదే వేగం తో ప్రయాణిస్తే ఆర్బిటర్ అరుణగ్రహాన్ని దాటి దూసుకెళ్లిపోతుంది.
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తిన పక్షంలో మార్స్ ఆర్బిటర్ తనకు తానుగా సేఫ్ మోడ్ (సురక్షితమైన వ్యవస్థ)లోకి వెళ్లేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అమర్చారు. ఈ విధానంలో.. భూమి నుంచి సంకేతాలతో ఆజ్ఞలు అందే వరకూ మార్స్ ఆర్బిటర్ తనకు తానే సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఏంటెనాను భూమి వైపు తిప్పి, సోలార్ ప్యానళ్లను సూర్యుడి వైపు తిప్పి సాధ్యమైనంత ఎక్కువ సౌరశక్తిని సంగ్రహించుకుంటుంది.
- సైన్స్ బ్యూరో, సాక్షి
ప్రయోజనం లేదా?
అంగారక యాత్ర ద్వారా దేశానికి ఇప్పటికిప్పుడు వచ్చే ప్రయోజనమేదీ ఉండదు. అయితే కేవలం రూ. 450 కోట్ల ఖర్చుతో గ్రహాంతరాలకు సైతం తాము ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలమని ఇస్రో ఈ ప్రయోగంతో ప్రపంచానికి చాటింది. కేవలం 15 నెలల వ్యవధిలో ఇంతటి సంక్లిష్టమైన ప్రయోగానికి రూకల్పన చేయడం, రాకెట్, ఉపగ్రహాలను నిర్మించి ప్రయోగించడం ఇస్రో సత్తాకు నిదర్శనమనడంలో ఎటువంటి సందేహమూ లేదు. భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు, అంగారకుడిపైకి ల్యాండర్ లేదా రోవర్ వంటి అత్యాధునిక పరికరాలను పంపించేందుకు ఈ ప్రయో గం పునాదిగా నిలుస్తుంది.