చెన్నై: భూమి చుట్టూ నిర్ణీత పరిభ్రమణాలను పూర్తిచేసుకుని, అంగారకుడి వైపు దూసుకెళ్తున్న ‘మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్- మంగళ్‌యాన్)’.. చంద్రుడి కక్ష్య పరిధిని దాటింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు ‘మామ్’ ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి, అంగారకుడి దిశగా పంపిన విషయం తెలిసిందే. రోజుకు పది లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ‘మంగళ్‌యాన్’.. దాదాపు 300 రోజుల అనంతరం అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో ఇప్పటివరకూ చంద్రయాన్ ఉపగ్రహం మాత్రమే అత్యంత దూరం వెళ్లింది. తాజాగా.. ‘మంగళ్‌యాన్’ భూమి పరిధిని దాటి ఎక్కువ దూరం ప్రయాణించిన తొలి ఉపగ్రహంగా నిలుస్తోంది.