
మరింత ఎత్తుకు ‘మామ్’
చెన్నై: అంగారకగ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) అంతరిక్ష నౌకను శుక్రవారం భూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో మరింత ఎత్తుకు పంపించింది. భూమికి దూరంగా (అపోజీ) కక్ష్యలో 28,814 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్బిటర్‌ను 40,186 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చారు. దీనికోసం ఆర్బిటర్‌లోని ఇంజన్‌ను శుక్రవారం తెల్లవారుజామున 2:18 గంటలకు 570.6 సెకన్ల పాటు మండించారు.
మంగళవారం శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి రోదసిలోకి పంపిన మార్స్ ఆర్బిటర్ భూ కక్ష్య ఎత్తును గురువారం తెల్లవారుజామున మొదటిసారి పెంచిన విషయం తెలిసిందే. శుక్రవారం రెండో విడత ఎత్తు పెంపును విజయవంతంగా పూర్తిచేశారు. శనివారం మూడోసారి, 11వ తేదీన నాలుగోసారి, 16వ తేదీన ఐదోసారి ఆర్బిటర్ ఎత్తును పెంచుకుంటూ వెళతారు. ఐదో విడతలో ఆర్బిటర్ కక్ష్య ఎత్తును 1,92,000 కిలోమీటర్లకు పెంచిన తర్వాత.. డిసెంబర్ 1న తెల్లవారుజామున 12:42 గంటలకు అంగారక మార్గంలోకి ప్రవేశపెడతారు.