తిరుపతి : మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) కు నేడు కీలక పరీక్ష చేపట్టనున్నట్లు షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ మధ్యాహ్నం 2.30 గంటలకు ట్రయిల్ ఆపరేషన్లో భాగంగా ప్రధాన ఇంజన్కు ఫైర్ చేస్తామన్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం మన దేశానికి ఎంతో కీలకమైందని ఆయన అన్నారు. గత ఏడాది నవంబర్ 5న శ్రీహరి కోట నుంచి ప్రయోగించామన్నారు. అంగారకుడిపై ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగమని ఎంవైఎస్ ప్రసాద్ పేర్కొన్నారు.
ఇప్పటివరకు అనుకున్నట్లుగానే ప్రయోగం విజయవంతంగా సాగుతోందని, పది నెలలుగా రోదసిలో నిరంతరం మార్స్ వైపు ప్రయాణిస్తున్న మామ్ ఈ నెల 24న.. బుధవారం తెల్లవారుజామున అరుణుడిని చేరుకోన్నట్లు తెలిపారు. తమకు ఈ ప్రయోగంలో మొత్తం 5 దశలు ఉన్నాయని, ఇప్పటికే మూడు దశలు విజయవంతం అయినట్లు ఎంవైఎస్ ప్రసాద్ పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రయోగం కీలక దశలో ఉందని, ఇప్పటివరకు ప్రపంచంలో ఆంగారకుడిపై అమెరికా, రష్య, యూరప్ దేశాలు మాత్రమే ప్రయోగాలు చేశాయన్నారు. ఈ ప్రయోగం ఫలిస్తే ప్రపంచంలో భారత్ నాలుగో దేశంగా గుర్తింపు పొందుతుందన్నారు. మామ్ ప్రయోగం భారతదేశ భవిష్యత్కు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. భారత్ గ్రహాంతర యానం చేపట్టడం ఇదే తొలిసారి. గతేడాది నవంబరు 5న శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-25 రాకెట్ ద్వారా మామ్‌ను నింగికి పంపి అంగారక యాత్రను ఇస్రో ప్రారంభించడం తెలిసిందే.
రోదసిలో 300 రోజుల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసిన మామ్ మరో 48 గంటల్లోనే మార్స్‌ను చేరుకోనుంది. ఇస్రో అంగారక యాత్రలో ఈ తుది ఘట్టం కూడా విజయవంతం అయితే గనక.. మార్స్‌కు ఉపగ్రహాన్ని పంపిన ఏకైక ఆసియా దేశం, తొలిప్రయత్నంలోనే మార్స్‌కు వ్యోమనౌకను పంపిన ఒకే ఒక్క దేశం, అమెరికా, రష్యా, ఐరోపాల తర్వాత అంగారక యాత్రను విజయవంతంగా చేపట్టిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది.
అమెరికా, రష్యా, యూరప్...ఇప్పుడు భారత్
Published Mon, Sep 22 2014 9:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM
Advertisement