Mangalyaan
-
మంగళ్యాన్ కథ ముగిసింది
బెంగళూరు: అంగారక (మార్స్) గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చేపట్టిన మంగళ్యాన్ మిషన్ ముగిసింది. మార్స్ ఆర్బిటార్ క్రాఫ్ట్తో గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ఇస్రో సోమవారం ధ్రువీకరించింది. 2013 నవంబర్ 5న ఆర్బిటార్ ప్రయోగం ప్రారంభించారు. ఆర్బిటార్ 300 రోజులపాటు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో అరుణగ్రహం ఉపరితలంపై వాతావరణ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందించింది. మంగళ్యాన్ జీవితకాలం ముగిసిందని, పని చేయడం ఆగిపోయిందని, ఆర్బిటార్‌ను ఇక రికవరీ చేయలేమని ఇస్రో అధికారులు స్పష్టం చేశారు. ఇతర గ్రహాలపై పరిశోధనల విషయంలో మంగళ్యాన్ అద్భుత సాంకేతిక, శాస్త్రీయ ప్రయోగంగా మిగిలిపోతుందని ఒక ప్రకటనలో వెల్లడించారు. -
ఇస్రో ట్వీట్: ఇదేంటో తెలుసా!
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆరేళ్ల క్రితం అంగారక గ్రహంపైకి పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఇప్పటికీ విజయవంతం పనిచేస్తోంది. అంతరిక్షంలో అరుదైన చిత్రాన్ని తాజాగా ‘మామ్’ తన కెమెరాలో బంధించింది. అంగారక గ్రహం రహస్య చంద్రుడిగా వ్యవహరించే ‘ఫోబోస్’ అరుదైన ఫొటోను మార్స్ కలర్ కెమెరా (ఎంసీసీ) సంగ్రహించింది. అంగారక గ్రహం నుంచి 7,200 కి.మీ. ఫోబోస్ నుంచి 4,200 కి.మీ. దూరంలో ఉన్నప్పుడు ఎంసీసీ ఈ ఫొటో తీసిందని ఇస్రో వెల్లడించింది. ‘ఈ ఫోటో ప్రాదేశిక రిజల్యూషన్ 210 ఎం. ఇది 6 ఎంసీసీ ఫ్రేమ్‌ల నుంచి ఉత్పత్తి చేయబడిన మిశ్రమ చిత్రం. రంగు సరిదిద్దబడింద’ని ఇస్రో తెలిపింది. అంగార గ్రహానికి అతి సన్నిహితంగా, పెద్దగా ఉన్న చంద్రుడిగా పిలవబడే ఫోబోస్.. కార్బోనేషియస్ కొండ్రైట్లతో నిండివుంటుందని వెల్లడించింది. 2014 సెప్టెంబర్ 24న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది. మొదటి ప్రయత్నంలోనే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ అప్పట్లో రికార్డు సృష్టించింది. తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో మామ్ సుమారు 650 మిలియన్ల కిలోమీటర్లు ప్రయాణించి అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. (టెక్నాలజీల అభివృద్ధికి ఇస్రో పిలుపు) -
‘అక్షయ్‌కి అసలు ఆడవాళ్ల మధ్య ఏం పని?’
స్త్రీ, పురుషులు ఒకర్నొకరు కో–హ్యూమన్‌గా మాత్రమే గుర్తించి గౌరవించుకునే ‘నాన్–జెండర్’ జీవులుగా పరిణామం చెందుతున్న క్రమంలో కొత్తగా ఇప్పుడు తలెత్తుతున్న కొన్ని అత్యుత్సాహ వాదనలు స్త్రీలను స్త్రీలుగా, పురుషులను పురుషులుగా వేరు చేయడంతో పాటు, స్త్రీలను మళ్లీ వాళ్లలోనే వాళ్లను అనేక వర్గాలుగా విభజించడం ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్కు అసలైన అర్థమేదో చెప్పేందుకు విఫలయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అక్షయ్‌కుమార్ తన ఉద్విగ్న అజ్ఞానంతో భారతీయ మహిళలంతా ఒక్కటే అనేభావనను వ్యక్తీకరిస్తే, సమీరా సూద్ అనే కాలమిస్టు తన ఉద్యమ జ్ఞానంతో భారతీయ మహిళల్ని హిందువులుగా, ముస్లింలుగా వేరు చేసి చూశారు!!-మాధవ్ శింగరాజు ‘స్త్రీలు సాధించారు’ అనకండి. ‘సాధించారు’ అనండి చాలు. సాధనకు స్త్రీ ఏమిటి, పురుషుడేమిటి?.. అనే వాదనలోని గొప్ప ఉద్యమ భావన.. ‘పురుషుడొచ్చి పక్కన నిలబడి చేత్తో చెయ్యెత్తించి.. అండ్ షీ ఈజ్ ద అచీవర్ అంటూ లోకానికి చూపిస్తేనే ఆమె ఘన విజయం సాధించినట్లవుతుందా?’ అని వాదించడంలో కనిపించదు. అదొట్టి వాదనగానో, పాయింట్ ఆఫ్ వ్యూగానో ఉండిపోతుంది. అలా ‘ఉండిపోయే’ ఒక ఆర్గ్యుమెంట్‌ను సమీరా సూద్ అనే కాలమిస్ట్ ‘ది ప్రింట్’ వెబ్సైట్లో ఇటీవల చేసుకొచ్చారు. బాలీవుడ్ చిత్రం ‘మిషన్ మంగళ్’ ప్రోమో వీడియోలో వాయిస్ ఓవర్‌గా అక్షయ్ చెప్పిన భావ కవిత్వం మీద ఆమె ప్రధాన అభ్యంతరం. సినిమా ఈ ఆగస్టు 15న విడుదల అవుతోంది. ఆరేళ్ల క్రితం అంగారక గ్రహం మీదకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన ‘మంగళ్ యాన్’ ప్రాజెక్టు మీద స్టోరీ. ప్రాజెక్టు మీద కాదు, ప్రాజెక్టుకు పని చేసిన మహిళా సైంటిస్టుల ఘనత మీద. ‘‘డిటర్మైండ్గా, ఫియర్‌లెస్‌గా, ఇన్స్పైరింగ్గా మంగళ్యాన్కు పని చేసిన మహిళా సైంటిస్టులను కీర్తించడమే ఈ సినిమా’’ అని ప్రోమో వీడియోలో చాలా పొయెటిక్‌గా వెనుక ఉండి చెబుతుంటారు అక్షయ్. స్క్రీన్ మీద మహిళా సైంటిస్టులు విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పన్నూ, నిత్యా మీనన్, కీర్తికులకర్ణి కనిపిస్తుంటారు. ‘ఆమె గాజులు విశ్వాంతరాళాల్లో «ధ్వనించాయి. ఆమె నుదుటి సిందూరం నింగిని స్పృశించింది. ఆమె కాటుక చరిత్రను లిఖించింది. ఆమె మెడలో మంగళసూత్రం.. ఆమె మదిలో మంగళయానం’.. ఇలా సాగుతుంది అక్షయ్ పొయెట్రీ. ‘‘మాటల్తో భలే అల్లాడు మన జాతీయవాద స్త్రీజన రక్షకుడు.. ప్రాథమిక పాఠశాల పిల్లల కవితల పోటీకి సరిపోతుంది’ అని సమీర తన వ్యాసంలో సెటైర్లు వేశారు అక్షయ్ మీద. ‘‘ఈ హీరో మహిళా సైంటిస్టుల గొప్పతనం గురించి చెబుతున్నారా లేక భారతీయ హైందవ వనితల మహోన్నతమైన కట్టూబొట్ల సంస్కృతిని శ్లాఘిస్తున్నారా?!’’ అని కూడా ఆమె ప్రశ్నించారు. ‘‘ఒకవేళ వీళ్లంతా బురఖా వేసుకున్న మహిళా సైంటిస్టులు అయివుంటే అక్షయ్ ఇదే రకమైన కవిత్వాన్ని చెప్పి ఉండేవారా.. బొట్టు, కాటుక, గాజులు, మంగళసూత్రం అంటూ..’’ అని అడిగారు. ‘‘అయినా నాకు ఈ సందేహాలన్నీ ఏమిటి? స్వాతంత్య్ర దినోత్సవం రోజు నా అభిమాన థియేటర్లో ఛాతీ ఉప్పొంగుతుండగా విజయగర్వంతో ఈ సినిమాను చూస్తూ కూర్చోక! సేఫ్ సైడ్‌గా భారత్ మాతాకి జై అని కూడా అంటున్నా.. అని ఆర్టికల్‌ని ముగించారు. అక్షయ్ ఏం చెయ్యాలని సమీర ఉద్దేశం? అది కూడా చెప్పారు. కుంకుమ, కాటుక, తాళిబొట్టు అని కాకుండా రాకెట్ లాంచర్స్, ఆర్బిటర్, రోవర్, పేలోడ్స్ (పైకి తీసుకెళ్లే బరువులు) అనే పదాలతో మహిళల శక్తిసామర్థ్యాలను కవిత్వీకరించి ఉండాల్సిందట! సినిమా కేవలం ఇస్రో మార్స్ మిషన్ మీదనైతే అలాగే చేసి ఉండాల్సింది. మహిళా మిషన్ అన్నది మెయిన్ థీమ్ కాబట్టి, ఆడవాళ్లు కెరియర్లో ఎదగడంలో అడ్డంకులు, అవాంతరాలు ఉంటాయి కాబట్టి ‘కో–హ్యూమన్’ అనే స్త్రీ, పురుష సమస్థాయిని దాటి ఎలా వాళ్ల ‘అబౌనెస్’ని సెలబ్రేట్ చెయ్యడం? మహిళను మహిళ అనడం కన్నా అబౌనెస్ ఏముంటుందని అనుకున్నట్లున్నారు అక్షయ్. ఆ ఉద్విగ్న అజ్ఞానంతో భారతీయ మహిళలంతా ఒక్కటే అనే భావనలో ఉండి ఆయన కవిత్వం రాస్తే, సమీర వచ్చి తన ఉద్యమ జ్ఞానంతో భారతీయ మహిళల్ని హిందువులుగా, ముస్లింలుగా వేరు చేసి చూశారు! ‘ది ప్రింట్’ సైట్లోనే కావేరీ బాంజాయ్ అనే సీనియర్ జర్నలిస్టు.. ‘అక్షయ్‌కి అసలు ఆడవాళ్ల మధ్య ఏం పని?’ అని చికాకు పడటం కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. ‘‘అక్షయ్ కుమార్ వచ్చి చెప్పకపోతే స్త్రీల గొప్పతనం దేశానికి తెలియదని బాలీవుడ్ అనుకుంటోందా! ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ’లో అక్షయ్, ‘ప్యాడ్ మ్యాన్’లో అక్షయ్, ‘నామ్ షబానా’లో అక్షయ్, ఇప్పుడు ‘మిషన్ మంగళ్’లో అక్షయ్. ఈ స్త్రీల కథలన్నిటిలోనూ అక్షయ్ ఎందుకు ఉమెన్ ఎంపవర్మెంట్కు బ్రాండ్ అంబాసిడర్లా!’’ అని కావేరి అసహనం. ‘మిషన్ మంగళ్’ పోస్టర్ రిలీజ్ ఫంక్షన్లో కావేరిలాంటి జర్నలిస్టులు కొందరు సినిమాలోని ఉమెన్ టీమ్‌ని ఇదే మాట అడిగారు.. ‘ఆయనేంటి పోస్టర్లో మిమ్మల్నందర్నీ మింగేస్తున్నారు’ అని. ‘‘మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ కదా. అందుకు..’’ అని విద్యాబాలన్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. సమీరా సూద్, కావేరీ బాంజాయ్ ఐదొందల పదాల్లో చేసిన ఆర్గ్యుమెంట్లనే బాలన్ నాలుగైదు పదాల్లో తేల్చేశారు. మానవుల యంత్రాలు మార్స్‌లోకి వెళ్తున్నట్లే యంత్రాల్లాంటి మగవాళ్లు (ఇన్సెన్సిటివ్ అనే అర్థంలో) మార్స్ దిగి వస్తున్నారు. అలవాటు లేని ‘వీనస్’ గ్రహంలోకి వచ్చినప్పుడు ఆడవాళ్ల మధ్యలోకి వచ్చారేమిటని వాళ్లను ఉక్కిరిబిక్కిరి చెయ్యకూడదు. ఆడవాళ్లంటే దేశ సంస్కృతీ సంప్రదాయాలేనా అని అయోమయంలోకి నెట్టేయకూడదు. ∙ -
'నెహ్రూ లేకుంటే ఆ ప్రయోగాలు సాధ్యపడేవి కావు'
న్యూఢిల్లీ: పండిట్ జవహర్ లాల్ నెహ్రూ లేకుంటే చంద్రయాన్, మంగళ్ యాన్ లాంటి ప్రయోగాలు సాధ్యపడేవి కాదు అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. దేశరాజధానిలోని తల్కొటోరా స్టేడియంలో ప్రారంభమైన భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతి ఉత్సవాల్లో సోనియా మాట్లాడుతూ.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాం. అంతేకాకుండా మన నేతల నుంచి సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకున్నాం అని అన్నారు. సిద్దాంతాలకు, సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నామని సోనియా తెలిపారు. జాతి పునర్ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర గర్వించదగినదని ఆమె అన్నారు. భారత దేశ ఐక్యతకు నెహ్రూ విజన్ ఉపయోగపడిందని సోనియా అభిప్రాయపడ్డారు. దేశ పురోగతిని, స్వేచ్చను హరించాలని చూస్తున్న దుష్ట శక్తులతో పోరాటం చేస్తామని సోనియా తెలిపారు. -
‘మామ్’ విజయంలో మన ఈసీఐఎల్
యాంటెనా తయారీలో పాలుపంచుకున్న ఈసీఐఎల్ సంబరాలు చేసుకున్న సంస్థ సిబ్బంది హైదరాబాద్: అగ్ర దేశాలు ఆశ్చర్యపడేలా చేసిన మార్స్ ఆర్బిటరీ మిషన్ (మామ్) విజయయాత్రలో హైదరాబాద్‌లోని ఈసీఐ ఎల్ (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా లిమిటెడ్) పాత్ర కూడా ఎంతో ఉంది. ‘మామ్’ పర్యటించిన దూరాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాడిన యాంటెనాను రూపొందించడంలో ఈసీఐఎల్ కీలకపాత్ర పోషించింది. అందుకే గురువారం మంగళ్యాన్ యాత్ర విజయవంతం కావడంతో ఇక్కడ సిబ్బంది కూడా సంబరాలు జరుపుకున్నారు. ‘మంగళ్యాన్’ యాత్రలో తమ సంస్థ కృషి ఉందని ఈసీఐఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మంగళ్యాన్లో సేవలందించిన ఈసీఐఎల్ తయారీ యాంటెనా వివరాలు.... యాంటెనా పేరు : ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ (ఐడీఎస్ఎన్) యాంటెనా ఏర్పాటు చేసిన ప్రాంతం : బెంగళూరు సమీపంలోని బైలాలు వద్ద బరువు : 300 టన్నులు వ్యాసం : 32 మీటర్లు ఎలివేషన్ : 0 నుంచి 90 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. తయారీ ఖర్చు : రూ.65 కోట్లు తయారీలో పాల్గొన్న సంస్థలు : ఈసీఐఎల్, బార్క్, ఇస్రో తయారీ సమయం : దాదాపు 14 నెలలు నియంత్రించే దూరం : భూమి నుంచి 65 కోట్ల కి.మీ.లు యాంటెనా పని ప్రారంభించిన తేదీ : 2013, నవంబర్ 5 మొదటి సిగ్నల్ పంపిన సమయం : ఉదయం 8.00 గంటలకు, 24 సెప్టెంబర్ 2014 (అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించిన 20 నిమిషాల్లో...) మొదటి సిగ్నల్ అందుకున్న సమయం : ఉదయం 11.45 గంటలకు, 24 సెప్టెంబర్ 2014న 2008లో ‘చంద్రయాన్’మిషన్‌లో కూడా ఈ యాంటెనా సేవలందించింది. -
'మంగళ్ యాన్' తొలి ఫోటో మోడీకి బహుకరణ!
-
'మంగళ్ యాన్' తొలి ఫోటో మోడీకి బహుకరణ!
న్యూఢిల్లీ: అంగారక గ్రహం ఉపరితలంపై మంగళ్ యాన్ చిత్రీకరించిన తొలి చిత్రాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు గురువారం ప్రధాని నరేంద్రమోడీకి బహుకరించారు. తొలి ప్రయత్నంలో అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంగారక గ్రహ కక్ష్యలోకి మామ్ ప్రవేశ కార్యక్రమాన్ని బుధవారం బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో మోడీ స్వయంగా చూశారు. మామ్ చరిత్ర సృష్టించిన సందర్భంగా మంగళ్ యాన్ చిత్రీకరించిన ఫోటోను ప్రధాని బహుకరించామని ఇస్రో అధికారులు వెల్లడించారు. తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో మామ్ సుమారు 650 మిలియన్ల కిలో మీటర్లు ప్రయాణించి అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. -
మహాలయ అమావాస్య అని భయపడ్డారా?
అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగానే కాకుండా, తొలి ప్రయత్నంలోనే ఆ ఘనతను సాధించిన దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించింది. అంగారక కక్ష్యలోకి మార్స్ అర్బిటర్ మిషన్ ప్రవేశించడానికి ముందు అందర్నిలోనూ అనేక సందేహాలు, అనుమానాలు వెంటాడాయి. ఎందుకంటే ఈ ప్రక్రియ మంగళవారం రోజున ప్రారంభమైనదే కాకుండా.. ఈ రోజు మహాలయ అమావాస్య కావడం కూడా కొందర్నిలో అనేక సందేహాలు తలెత్తాయి. అయితే అందరి భయాలను, అంచనాలను, సందేహాలను తలక్రిందులు చేస్తూ పాడ్యమి అమావ్యాస సంధికాలంలో అంగారకుడిని మామ్ విజయవంతమవ్వడంతో ప్రత్యక్షంగా దర్శించుకున్నామని వేద పండితులు భావిస్తున్నారు. ఈ ప్రయోగం అంగారకుడికి దుష్పలితాలు తగ్గించే విధంగా జరిగాయని పండితులు అభిప్రాయపడుతున్నారు. అంగారకుడు దుర్గాదేవి సోదరుడని, మంగళవారం అంగారకుడి అనుగ్రహం పొందడం వలన ప్రజలకు దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందన్నారు. అంగారకుడి 9 సంఖ్య అని, ఎక్కువ మంది తొమ్మిదో సంఖ్యకు ప్రాధాన్యమిస్తారని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నమ్మకాలకు తావుందో లేదో కాని.. భారత శాస్త్రవేత్తలు పడిన కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు మామ్ విజయవంత కావడం ద్వారా లభించింది. -
మామ్ ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనలో చారిత్రకఘట్టం ఘట్టం చోటు చేసుకుంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతంగా అరుణగ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో బెంగళూరులోని ఇస్ట్రాక్ ప్రాంగణంలో శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. మామ్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల మోడీ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఇస్రో శాస్త్రవేత్తలకు మోడీ అభినందనలు తెలిపారు. మొదటి ప్రయత్నంలోనే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన తొలి ఆసియా దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన దేశాల జాబితాలో భారత్ నాలుగో దేశంగా నిలిచింది. -
మామ్ ప్రయోగం ఒక చారిత్రాత్మక ఘట్టం: మోడీ
బెంగళూరు: అసాధ్యమనుకున్న ప్రయోగాన్ని సుసాధ్యం చేసి చూపించారని భారత ప్రధాని నరేంద్రమోడీ శాస్త్రజ్క్షులపై ప్రశంసల వర్షం కురిపించారు. అంగారక గ్రహంలోకి మామ్ విజయవంతంగా ప్రవేశించిన తర్వాత ప్రసంగిస్తూ 'ప్రపంచ సాంకేతిక రంగంలో భారత్ చరిత్ర సృష్టించింది' మోడీ అన్నారు. ఇతరులు అసాధ్యమని, ఊహించడానికి కూడా ధైర్యం చేయలేకపోయిన కార్యాన్ని మనం సుసాధ్యం చేసి చూపించామని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. మామ్ ఎప్పుడూ నిరాశపరచదనే గట్టి నమ్మకం అని అన్నారు. ఇస్రోను చూసి దేశ ప్రజలు గర్విస్తున్నారని ప్రధాని అన్నారు. మొదటి ప్రయత్నంలోనే విజయం భారత శాస్త్రవేత్తలకే దక్కడం గర్వంగా ఉందన్నారు. ఈ ప్రయోగం ఒక చారిత్రత్మక ఘటం అని ఉద్వేగభరిత ప్రసంగంలో మోడీ వెల్లడించారు. -
తొలిప్రయత్నంలోనే అంగారకుడిని చేరిన ఇస్రో
-
అమెరికా, రష్యా, యూరప్...ఇప్పుడు భారత్
తిరుపతి : మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) కు నేడు కీలక పరీక్ష చేపట్టనున్నట్లు షార్ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ మధ్యాహ్నం 2.30 గంటలకు ట్రయిల్ ఆపరేషన్‌లో భాగంగా ప్రధాన ఇంజన్‌కు ఫైర్ చేస్తామన్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం మన దేశానికి ఎంతో కీలకమైందని ఆయన అన్నారు. గత ఏడాది నవంబర్ 5న శ్రీహరి కోట నుంచి ప్రయోగించామన్నారు. అంగారకుడిపై ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగమని ఎంవైఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటివరకు అనుకున్నట్లుగానే ప్రయోగం విజయవంతంగా సాగుతోందని, పది నెలలుగా రోదసిలో నిరంతరం మార్స్ వైపు ప్రయాణిస్తున్న మామ్ ఈ నెల 24న.. బుధవారం తెల్లవారుజామున అరుణుడిని చేరుకోన్నట్లు తెలిపారు. తమకు ఈ ప్రయోగంలో మొత్తం 5 దశలు ఉన్నాయని, ఇప్పటికే మూడు దశలు విజయవంతం అయినట్లు ఎంవైఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రయోగం కీలక దశలో ఉందని, ఇప్పటివరకు ప్రపంచంలో ఆంగారకుడిపై అమెరికా, రష్య, యూరప్ దేశాలు మాత్రమే ప్రయోగాలు చేశాయన్నారు. ఈ ప్రయోగం ఫలిస్తే ప్రపంచంలో భారత్ నాలుగో దేశంగా గుర్తింపు పొందుతుందన్నారు. మామ్ ప్రయోగం భారతదేశ భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. భారత్ గ్రహాంతర యానం చేపట్టడం ఇదే తొలిసారి. గతేడాది నవంబరు 5న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ-25 రాకెట్ ద్వారా మామ్‌ను నింగికి పంపి అంగారక యాత్రను ఇస్రో ప్రారంభించడం తెలిసిందే. రోదసిలో 300 రోజుల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసిన మామ్ మరో 48 గంటల్లోనే మార్స్‌ను చేరుకోనుంది. ఇస్రో అంగారక యాత్రలో ఈ తుది ఘట్టం కూడా విజయవంతం అయితే గనక.. మార్స్‌కు ఉపగ్రహాన్ని పంపిన ఏకైక ఆసియా దేశం, తొలిప్రయత్నంలోనే మార్స్‌కు వ్యోమనౌకను పంపిన ఒకే ఒక్క దేశం, అమెరికా, రష్యా, ఐరోపాల తర్వాత అంగారక యాత్రను విజయవంతంగా చేపట్టిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. -
విజయవంతంగా మంగళ్ యాన్ ప్రయోగం: రాధాకృష్ణ
చెన్నై: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంగళ్యాన్ ప్రయోగం విజయవంతంగా సాగుతోందని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ మీడియాకు వెల్లడించారు. సెప్టెంబర్ 24 కల్లా అంగారక కక్ష్యలోకి మంగళయాన్ ప్రవేశిస్తుందని రాధాకృష్ణన్ తెలిపారు. మంగళయాన్ ప్రయోగంలో ఇంకా 14% యాత్ర మాత్రమే మిగిలి ఉందని ఆయన తెలిపారు. గత ఏడాది నవంబర్ 5న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్ వీ బోర్డుపై నుంచి మార్స్ అర్బిటర్ ప్రయోగం ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే. మార్స్ ఆర్బిటర్ ప్రయోగంపై మంగళవారం చెన్నైలో సమీక్ష నిర్వహించారు. -
'హెలెన్'ను మార్స్ అర్బిటర్ చిత్రీకరించింది'
ఆంధ్ర ప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతున్న హెలెన్ తుఫాన్ కు సంబంధించిన చిత్రాలను భారత మార్స్ ఆర్బిటర్ పంపింది. మన దేశానికి సంబంధించిన చిత్రాలను మార్స్ అర్బిటెర్ మొదటి సారిగా చిత్రీకరించి పంపిందని ఇస్రో అధికారులు వెల్లడించారు. మొదటి విడుతగా భూమండలానికి సంబంధించిన చిత్రాలను ముఖ్యంగా భారత ఉపఖండం, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల చిత్రాను 'మంగళయాన్' పంపించిందని ఇస్రో ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్ర తీర ప్రాంతాన్ని కుదిపేస్తున్న హెలెన్ తుఫాన్ కు సంబంధించిన ఫోటోలను మంగళవారం చిత్రీకరించిందని అధికారులు తెలిపారు. స్పేస్ క్రాఫ్ట్ లో ఉన్న పరికరాలను పరిశీలిస్తున్నాం అని అన్నారు. మార్స్ అర్బిటర్ లో అమర్చిన మార్స్ కలర్ కెమెరా ద్వారా మంగళవారం మధ్యాహ్నం 1.50 నిమిషాలకు 67975 కిలోమీటర్ల దూరంలో 3.53 కి.మి రిజల్యూషన్ తో చిత్రీకరించింది అని ఇస్రో తెలిపింది. అధికారికంగా ఒకే ఒక ఫోటోను ఇస్రో వెబ్ సైట్లో పెట్టారు. Photo courtesy: http://www.isro.org/pslv-c25/Imagegallery/mom-images.aspx -
గర్వించదగ్గ విజయం: సోనియా
న్యూఢిల్లీ: మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం తొలి ప్రయత్నంలోనే విజయవంతం కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ మధ్యాహ్నం ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహ వాహననౌక విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. షార్ నుంచి బయలుదేరిన 44 నిమిషాల తర్వాత మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్నినిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం అంగారకుడిపై జీవాన్వేషణ, వాతావరణం అధ్యయనం చేయనుంది. ఈ విజయంతో అగ్రరాజ్యాల సరసన భారత్ చేరింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంలో పాలుచుకున్న శాస్త్రవేత్తలపై అభినందల వర్షం కురుస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు సూర్ఫిదాయక విజయం సాధించారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. ప్రతిభారతీయుడు గర్విందగ్గ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించారని సోనియా గాంధీ ప్రశంసించారు. ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్‌కు ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. -
ఆల్ ది బెస్ట్.. బఠానీలు తినడం మర్చిపోకండి!
బెంగళూరు: అంగారకగ్రహంపై పరిశోధన కోసం మంగళవారం మార్స్ ఆర్బిటర్ మిషన్(ఎంవోఎం) ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్న నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శుభాకాంక్షలు తెలిపింది. ఇస్రో ఎంవోఎం ఫేస్బుక్ పేజీలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ (జేపీఎల్) ఈ మేరకు గురువారం ఓ సందేశం పోస్టు చేసింది. ‘మీరు మార్స్ యాత్ర ప్రారంభిస్తున్నారు. అయితే ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. ప్రయోగం సమయంలో తప్పనిసరిగా బఠానీలు పంచుకుని తినండి’ అంటూ ‘లక్కీ పీనట్స్(బఠానీలు)’ పేరుతో సందేశం ఉంచింది. ‘1960 క్రితం వరకూ మేం ఆరుసార్లు చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యాం. ఎట్టకేలకు 1964లో ఏడోసారి విజయం సాధించాం. ఆ ప్రయోగం సందర్భంగా మా సిబ్బందిలో ఒకరు బఠానీలు తింటూ ఇతరులకూ పంచారు. దాంతో ఆ విజయం తాలూకు క్రెడిట్ మేం బఠానీలకు కట్టబెట్టేశాం. ఆ తర్వాత ప్రతిసారీ బఠానీలు పంచుకుంటున్నాం. అందుకే మీరూ విజయం సాధించాలని ఈ రహస్యాన్ని చెబుతున్నాం. గో ఎంవోఎం!!! గుడ్ లక్ ఎంవోఎం! డేర్ మైటీ థింగ్స్’ అంటూ నాసా శుభాకాంక్షలు తెలిపింది.