గర్వించదగ్గ విజయం: సోనియా
న్యూఢిల్లీ: మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం తొలి ప్రయత్నంలోనే విజయవంతం కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ మధ్యాహ్నం ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహననౌక విజయవంతంగా లక్ష్యాన్ని చేరుకుంది. షార్ నుంచి బయలుదేరిన 44 నిమిషాల తర్వాత మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్నినిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం అంగారకుడిపై జీవాన్వేషణ, వాతావరణం అధ్యయనం చేయనుంది. ఈ విజయంతో అగ్రరాజ్యాల సరసన భారత్ చేరింది.
మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంలో పాలుచుకున్న శాస్త్రవేత్తలపై అభినందల వర్షం కురుస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు సూర్ఫిదాయక విజయం సాధించారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. ప్రతిభారతీయుడు గర్విందగ్గ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించారని సోనియా గాంధీ ప్రశంసించారు. ఇస్రో చైర్మన్ కె రాధాకృష్ణన్కు ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.