'మంగళ్ యాన్' తొలి ఫోటో మోడీకి బహుకరణ!
న్యూఢిల్లీ: అంగారక గ్రహం ఉపరితలంపై మంగళ్ యాన్ చిత్రీకరించిన తొలి చిత్రాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు గురువారం ప్రధాని నరేంద్రమోడీకి బహుకరించారు. తొలి ప్రయత్నంలో అంగారక కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్)ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
అంగారక గ్రహ కక్ష్యలోకి మామ్ ప్రవేశ కార్యక్రమాన్ని బుధవారం బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో మోడీ స్వయంగా చూశారు. మామ్ చరిత్ర సృష్టించిన సందర్భంగా మంగళ్ యాన్ చిత్రీకరించిన ఫోటోను ప్రధాని బహుకరించామని ఇస్రో అధికారులు వెల్లడించారు.
తొమ్మిది నెలలపాటు అంతరిక్షంలో మామ్ సుమారు 650 మిలియన్ల కిలో మీటర్లు ప్రయాణించి అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది.