భారత అంతరిక్ష ప్రయోగంలో ఇస్రో మరో మైలు రాయిని అధిగమించనుంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల 38 నిముషాలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్ వీ సీ -25 ద్వారా మార్స్ ఆర్బిటర్ మిషన్ను అంతరిక్షంలోకి పంపనుంది. అంగారక గ్రహంపై పరిశోధనలు జరిపేందుకు ఈ మిషన్ దోహదం చేయనుంది. ప్రస్తుతం సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో రాకెట్ రెండో దశకు ఇంధనం నింపే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రయోగ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ ఇప్పటికే షార్ కేంద్రానికి చేరుకున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ సవ్యంగా సాగుతోందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగ సమయం సమీపిస్తుండటంతో షార్ లో భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేశారు. పులికాట్ సరస్సుతో పాటు బంగాళాఖాతంలో కూడా నావికాదళం భద్రతను పర్యవేక్షిస్తోంది.