ప్రపంచానికి మన దేశ సత్తా చాటేందుకు సమయం ఖరారైంది. ఒకేసారి 104 ఉప గ్రహాలను రోదసీలోకి పంపే పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్ ప్రయోగ సమయాన్ని భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు ప్రకటించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. స్వదేశానికి చెందిన మూడు, విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించనుండటంతో ప్రపంచమంతా మనదేశం వైపే చూస్తోంది. రాకెట్ శిఖరభాగంలో 104 ఉపగ్రహాలను పొందికగా అమర్చి శని వారం సాయంత్రం హీట్‌షీల్డ్ క్లోజ్ చేశారు. ఆదివారం లెవెల్–1 లెవెల్–2, లెవెల్–3 పరీక్షలు నిర్వహించారు.