సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: అంగారక యాత్రకు బయల్దేరిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహం కక్ష్యను భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) విజయవంతంగా పెంచింది. ఇందుకోసం గురువారం వేకువజామున 1.17 గంటలకు చేపట్టిన ఫైరింగ్ విజయవంతమైంది. ఉపగ్రహంలో అమర్చిన 440 న్యూటన్ ద్రవ ఇంజన్‌ను 416 సెకంన్లపాటు మండించి కక్ష్య దూరాన్ని పెంచారు. 1,337 కిలోల బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను ఈ నెల 5న 248.4 కి.మీ. పెరిజీ (భూమికి దగ్గరగా), 23,550 కి.మీ. అపోజీ (భూమికి దూరంగా)లో భూమధ్య రేఖకు 19.2 డిగ్రీల వాలులో భూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా 252 కి.మీ. పెరిజీ, 28,825 కి.మీ. అపోజీకి భూ దీర్ఘ వృత్తాకార కక్ష్యను పెంచినట్టు ఇస్రో ప్రకటించింది.
ఈ ప్రక్రియను బెంగళూరు సమీపంలోని పీన్యా వద్ద వున్న ఇస్ట్రాక్ సెంటర్ (ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం) నుంచి నిర్వహించారు. కక్ష్యలో ఉపగ్రహం క్షేమంగా ఉండటమే గాక సోలార్ ప్యానెళ్లు, మెయిన్ డిష్ ఆకృతిలోని యాంటెనాలు విజయవంతంగా విచ్చుకున్నాయి. ఇదేతరహాలో త్వరలో రెండోసారి కక్ష్య దూరాన్ని మరికొంత పెంచుతారు. ఇలా నవంబర్ 30 లోపు ఉపగ్రహంలోని ఇంధనాన్ని మండించి నాలుగుసార్లు భూ దీర్ఘ వృత్తాకార కక్ష్యను పెంచుతూ 300 కి.మీ. పెరిజీ, 2 లక్షల కి.మీ. అపోజీకి తీసుకెళ్లాక డిసెంబర్ 1 నాటికి అంగారకుడి కక్ష్య వైపు మిషన్ ప్రయాణిస్తుందని ఇస్రో ప్రకటించింది.
మూత్రం పోయడం నుంచి బఠాణీ తినడం దాకా..
అంతరిక్ష శాస్త్రవేత్తల నమ్మకాల జాబితా ఇదీ..
చెన్నై: మూఢ నమ్మకాలు, విశ్వాసాలు.. వీరికి ఎవరూ అతీతులు కారు.. చివరికి అంతరిక్ష శాస్త్రవేత్తలు కూడా! వీరిలో కొందరివి నమ్మకాలైతే.. మరికొందరివి మూఢనమ్మకాలు.. ఎందుకంటే.. రష్యా వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేముందు ప్రయోగకేంద్రానికి తమను తీసుకొచ్చే బస్సు కుడివైపు వెనుక చక్రంపై మూత్రం పోస్తారట!! నాసా శాస్త్రవేత్తలు ప్రయోగ సమయంలో బఠాణీలు తింటారు. ఇక మన విషయానికొస్తే.. వెంకన్నపై మన శాస్త్రవేత్తలకు అపారవిశ్వాసం. అందుకే ప్రతి ప్రయోగ సమయంలోనూ తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం సంప్రదాయమైపోయింది. ఇక వ్యక్తిగత నమ్మకాల విషయానికొస్తే.. ఇస్రోలోని ఓ ప్రాజెక్ట్ డెరైక్టర్ ప్రయోగం రోజున తప్పనిసరిగా కొత్త షర్ట్ ధరించి వస్తారని ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఇస్రోకు సంస్థపరంగా ఇలాంటి విశ్వాసాలు లేవని చెబుతూనే.. పీఎస్‌ఎల్‌వీ శ్రేణిలో 13వ నంబర్ లేకపోవడాన్ని ఆయన ఎత్తి చూపారు. ‘పీఎస్‌ఎల్‌వీ-సీ12 పంపాక.. తర్వాత పంపాల్సింది సీ-13.. కానీ ఇస్రో ఆ సంఖ్యను వాడకుండా తర్వాత పీఎస్‌ఎల్‌వీ-సీ14ను ప్రయోగించింది’ అని ఆయన గుర్తు చేశారు.
తొలి దశ ఫైరింగ్ సఫలం.. మామ్ ఉపగ్రహ కక్ష్య పెంపు
Published Fri, Nov 8 2013 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
Advertisement
Advertisement