ప్రయోగానికి సిద్ధంగా జీఎస్‌ఎల్‌వీ-డీ5
రేపే కౌంట్‌డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 19వ తేదీన జీఎస్‌ఎల్‌వీ-డీ5 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. 29 గంటలు కౌంట్‌డౌన్ కొనసాగిన అనంతరం 19న సాయంత్రం 4.50 గంటలకు జీశాట్-14 ఉపగ్రహంతో రాకెట్ నింగి వైపునకు దూసుకెళ్లనుంది.
ప్రయోగానికి సంబంధించి శుక్రవారం మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు లాంచ్ రిహార్సల్ నిర్వహించింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై నిర్ణీత సమయానికి కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు, ప్రయోగం నిర్వహించేందుకు అనుమతిచ్చింది. కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యే సమయానికి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ షార్‌కు చేరుకోనున్నారు.
ఇస్రో చైర్మన్ పదవీకాలం పొడిగింపు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. స్పేస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆయన పదవీ కాలాన్ని 2014 ఆగస్టు 31 వరకు పొడిగించారు.