స్ట్రాటో ఆవరణకు చేరుకున్న తొలి భారతీయుడు | ISRO scientist becomes first Indian to fly to the stratosphere | Sakshi
Sakshi News home page

స్ట్రాటో ఆవరణకు చేరుకున్న తొలి భారతీయుడు

Published Wed, Dec 31 2014 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM

స్ట్రాటో ఆవరణకు చేరుకున్న తొలి భారతీయుడు

స్ట్రాటో ఆవరణకు చేరుకున్న తొలి భారతీయుడు

-    ఇస్రో జనవరి 5న శ్రీహరికోట నుంచి నిర్వహించిన జీఎస్‌ఎల్‌వీ-డీ5 ప్రయోగం విజయవంతమైంది.
 
-    అణ్వాయుధాలను మోసుకుపోయే సామర్థ్యం గల అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ జనవరి 20న విజయవంతంగా ప్రయోగించింది.
 
-    ఆస్టరాయిడ్ బెల్ట్‌లోని సిరీస్ అనే మరుగుజ్జు గ్రహం నుంచి నీటి ఆవిరి విడుదలవుతుందని ఐరోపా అంతరిక్ష సంస్థ శాస్త్రవేత్తలు జనవరి 23న ప్రకటించారు.
 
-    రాజస్థాన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్ కేంద్ర ఏర్పాటుకు భెల్, పవర్‌గ్రిడ్ కార్పోరేషన్ సహా ఆరు ప్రభుత్వ రంగసంస్థలు సంకల్పించాయి.
 
 -    జమ్మూలో 101వ సైన్‌‌స కాంగ్రెస్‌ను ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు ‘ఇన్నోవేషన్‌‌స ఇన్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ ఫర్ ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్’ ఇతివృత్తంతో నిర్వహించారు.
 
-    అత్యంత ప్రాధాన్యతనివ్వవలసిన పర్యావరణ అంశాల పనితీరు ఆధారంగా రూపొందించిన ప్రపంచ పర్యావరణ జాబితాలో భారత్‌కు 155వ స్థానం దక్కింది.
 
-    అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 715 కొత్త గ్రహాలను కనుగొన్నట్లు ఫిబ్రవరి 26న తెలిపింది. ఈ కొత్త గ్రహాలతో కలిపి సౌర కుటుంబం వెలుపల కచ్చితంగా గుర్తించిన గ్రహాల సంఖ్య దాదాపు 1700కు చేరింది.
 
-    మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు ఫిబ్రవరి 5 నాటికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. 1944, ఫిబ్రవరి 5న ఈ ‘కోలోసస్’ కంప్యూటర్ వినియోగంలోకి వచ్చింది.
 
-    వరల్డ్ వైడ్ వెబ్(www) మార్చి 12న పాతికేళ్ల ప్రస్థానంలోకి అడుగుపెట్టింది. 1989లో బ్రిటిష్ శాస్త్రవేత్త టీమ్ బెర్నర్స్ లీ ప్రతిపాదనతో వరల్డ్ వైడ్ వెబ్ ప్రాచుర్యంలోకి వచ్చింది.
 
-    ప్రపంచంలో ప్రకృతి విపత్తుల బారినపడే 616 నగరాల పరిస్థితులపై స్విస్ రే అనే సంస్థ మార్చి 26న విడుదల చేసిన జాబితాలో కోల్‌కతా ఏడో స్థానంలో నిలిచింది. టోక్యో(జపాన్) మొదటి స్థానం, మనీలా (ఫిలిప్పీన్స్) రెండో స్థానంలో ఉన్నాయి.
 
-    కమ్యూనికేషన్ ఉపగ్రహం ఇన్సాట్-3ఇ జీవిత కాలం ముగియడంతో పని చేయడం ఆగిపోయిందని ఏప్రిల్ 2న ఇస్రో ప్రకటించింది.
 
-    జీవం ఉనికి ఉండే భూమి పరిమాణంలోని మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘గోల్డ్‌లాక్స్ జోన్’లో ఉన్న ఈ గ్రహంలో ద్రవ రూపంలో నీరు, జీవం ఉనికికి కావాల్సిన వాతావరణం ఉండొచ్చని భావిస్తున్నారు.
 
-    స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణిని
 డీఆర్‌డీవో మే 4న విజయవంతంగా పరీక్షించింది. దృష్టి క్షేత్రానికి ఆవల (బియాండ్ విజువల్ రేంజ్) గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని నౌకాదళ స్థావరం నుంచి సుఖోయ్-30 యుద్ధ విమానం ద్వారా వాయుసేన ప్రయోగించింది.
 
-    అమెరికా తన విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను 30 శాతం తగ్గించాలని జూన్ 2న ప్రతిపాదించింది.
 
-    ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఫ్రాన్‌‌సకు చెందిన ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్ సంయుక్తంగా జూన్ 2 నుంచి 13 వరకు ‘ఈఎక్స్ గరుడ 5 ((Ex Garuda V)’ అనే పేరుతో విన్యాసాలు నిర్వహించాయి.
 
-    తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం (కేఎన్‌పీపీ)లోని ఒకటో యూనిట్‌లో జూన్ 7న నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. దేశంలో ఒక అణువిద్యుత్ కేంద్రం ఇంత సామర్థ్యంతో పనిచేయడం ఇదే తొలిసారి
 
-    దేశంలో అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 14న గోవాలో జాతికి అంకితం చేశారు.
 
-    గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల అస్త్ర క్షిపణిని సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భారత వాయుసేన జూన్ 20న విజయవంతంగా పరీక్షించింది.
 
-    ప్రపంచ పర్యావరణ నేరాల విలువ 213 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని ఐక్యరాజ్యసమితి, ఇంటర్‌పోల్ జూన్ 24న విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.
 
-    భారత్ తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో ఐ.ఎన్.ఎస్ కమోర్తా అనే అత్యాధునిక యుద్ధ నౌకను తయారు చేసింది.
 
- ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలిస్కోప్‌ను ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) రూపొందించింది. దీనికి మ్యాజిక్ అట్మాస్ఫిరిక్ చెరింకోవ్ ఎక్స్‌పెరిమెంట్ (మేస్) అని పేరుపెట్టింది. ప్రపంచంలో అతిపెద్ద టెలిస్కోప్ హెస్ నమీబియాలో ఉంది.
 
-    ఇస్రో జూన్ 30న శ్రీహరికోట నుంచి చేపట్టిన పీఎస్ ఎల్‌వీ-సీ23 అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది.
 
-    దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలును ఢిల్లీ-
 ఆగ్రాల మధ్య విజయవంతంగా పరీక్షించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో 200 కిలోమీటర్ల దూరాన్ని 90 నిమిషాల్లో పూర్తిచేసే ఈ రైలుని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జూలై 3న ప్రారంభించారు.
 
-    అంటార్కిటికా ఖండంలోని మెక్ డొనాల్డ్ హైట్స్ దక్షిణ భాగంలో 930 మీటర్ల ఎత్తున్న ఓ పర్వతానికి భారత-అమెరికన్ శాస్త్రవేత్త అఖౌరి సిన్హా పేరు పెట్టారు.
 
-    వాతావరణంలో ఉండే కార్బన్‌డై ఆక్సైడ్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు నాసా ప్రత్యేక ఉపగ్రహాన్ని జూలై 2న విజయవంతంగా ప్రయోగించింది.
 
- గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ (ఎన్‌ఓఎఫ్‌ఎన్.) ప్రాజెక్ట్ కింద చేపట్టిన సర్వే పూర్తయింది.
 
-    2011 నుంచి అటవీ విస్తీర్ణం 5,871 చదరపు కిలోమీట ర్లు పెరిగినట్లు భారత అటవీ నివేదిక 2013 తెలిపింది.
 
-    పరిపాలనలో ప్రజలను మరింత భాగస్వామ్యుల్ని చేసేందుకు ఝడజౌఠి.జీఛి.జీ అనే పేరుతో ఓ వెబ్‌సైట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 26న ప్రారంభించారు.
 
-    విపత్తులు, ప్రమాదాల సమయంలో సమాచార వ్యవస్థలు పనిచేయని ప్రదేశాల్లో అండగా నిలిచే అత్యాధునిక సమాచార వ్యవస్థను భారత్-జపాన్ శాస్త్రవేత్తలు జూలై 24న ప్రదర్శించారు. దీనికి దిశానెట్ అని పేరు పెట్టారు.
 
-    హ్యాండ్ గెడైడ్ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా చండీగఢ్‌లోని నేషనల్ డెయిరీ పరిశోధన సంస్థ (ఎన్‌డీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఒక కోడెదూడను సృష్టించారు. జూలై 23న జన్మించిన దీనికి రజత్ అని పేరు పెట్టారు.
 
-    స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోల్‌కతా భారత నావికాదళంలోకి ఆగస్టు 16న చేరింది.
 
-    నేడు ప్రపంచమంతా విస్తృతంగా వాడకంలో ఉన్న ఎలక్ట్రానిక్ మెయిల్ (ఈ-మెయిల్)కు ఆగస్టు 30తో 32 ఏళ్లు నిండాయి.
 
-    విద్యుత్ ఉత్పత్తిలో రాజస్థాన్‌లోని రావత్‌భటా అణువిద్యుత్ కేంద్రంలోని యూనిట్-5 నిరంతరాయంగా ఆగస్టు 11 నాటికి 739 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసింది. దీంతో ప్రపంచంలో సుదీర్ఘకాలం నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేసిన రెండో కేంద్రంగా రావత్‌భటా నిలిచింది.
 
-    దేవనాగరి లిపిలో కొత్త డొమైన్ డాట్ భారత్‌ను కేంద్రం న్యూఢిల్లీలో ఆగస్టు 27న ప్రారంభించింది. ఈ డొమైన్ హిందీ, బోడో, డోగ్రీ, కొంకణ్, మైథిలీ, మరాఠీ, నేపాలీ, సింధీ వంటి ఎనిమిది భాషల్లో ఉంటుంది.
 
-    తూర్పు తీర భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో రూపొందిన అతిపెద్ద తీరగస్తీ నౌక ఐఎన్‌ఎస్ సుమిత్రను భారత నౌకాదళ ఛీఫ్ అడ్మిరల్ ఆర్‌కే ధోవన్ సెప్టెంబర్ 4న చెన్నైలో జాతికి అంకితం చేశారు.
 
-    భారత్-నేపాల్ దేశాలు సంయుక్తంగా పితోరాఘర్‌లో సూర్యకిరణ్-7 పేరిట నిర్వహించిన సైనిక విన్యాసాలు ఆగస్టు 31తో ముగిశాయి.
 
-    ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త టి.ఎన్.సురేశ్‌కుమార్ భూ వాతావరణంలో రెండో పొర స్ట్రాటో ఆవరణ వరకు ప్రయాణించారు. దీంతో స్ట్రాటో ఆవరణ చేరిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు.
 
-    భారత ఉపగ్రహం మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్) సెప్టెంబర్ 24న అంగారకగ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది.
 
-    అమెరికాకు చెందిన మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ (మావెన్) ఉపగ్రహం దిగ్విజయంగా అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది.
 
-    దక్షిణ కొరియాలోని యాంగ్ చాంగ్ నగరంలో జీవ వైవిధ్య సదస్సు (కాప్ 12)ను అక్టోబర్ 12 నుంచి 14 తేదీ వరకు నిర్వహించారు.
 
-    మిత్రశక్తి పేరిట భారత్-శ్రీలంక దేశాలు నవంబర్ 3 నుంచి 23 వరకు కొలంబో (శ్రీలంక) సమీపంలోని ఓ దీవిలో సైనిక విన్యాసాలు నిర్వహించాయి.
 
-    ఖగోళ చరిత్రలో తొలిసారి తోకచుక్కపై ల్యాండర్ చేరింది. 67పి/చుర్యుమోన్-గెరాసి మెంకో అనే తోకచుక్క వెంట పదేళ్లుగా ప్రయాణించిన ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన రొసెట్టా వ్యోమ నౌక ఫీలే నవంబర్12న కాలుమోపింది.
 
-    {పమాదకర స్థాయికి తక్కువగా భూతాపం ఉండాలంటే ప్రపంచ దేశాలు 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
 
-    గ్రీన్ క్లైమెట్ ఫండ్‌కు 9.3 బిలియన్ డాలర్లు సమకూరుస్తామని బెర్లిన్‌లో సమావేశమైన 30 దేశాలు నవంబర్ 20న హామీనిచ్చాయి. గ్రీన్ క్లైమెట్ ఫండ్ ప్రధాన కేంద్రం దక్షిణ కొరియా.
 
-    విశ్వం ప్రాథమిక నిర్మాణం గురించి పరిశోధన జరుపుతున్న ఐరోపా అణు పరిశోధన సంస్థ (సెర్న్) ప్రాజెక్టులో ఐఐటీ మద్రాస్ చేరింది.
 
-    సమాచార ఉపగ్రహం జీశాట్-16ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి డిసెంబర్ 7న ఏరియన్-5 ద్వారా జీశాట్-16ను ప్రయోగించారు.
 
-    జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్‌ప్లోరర్ హయబుస-2ను డిసెంబర్ 3న విజయవంతంగా ప్రయోగించింది.
 
-    అంగారక యాత్రకు మానవులను పంపే ప్రయత్నంలో అమెరికా డిసెంబర్ 5న చేపట్టిన వ్యోమనౌక పరీక్ష విజయవంతమైంది. ఒరియన్ అనే వ్యోమనౌకను కేప్ కెనవరాల్‌లోని వైమానిక స్థావరం నుంచి డెల్టా-4 రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది.
 
-    శిలాజ ఇంధనాలను మండించడం, పారిశ్రామిక కార్యకలాపాల కారణంగా 2013లో ప్రపంచంలో అత్యధికంగా 35.3 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు విడుదలయ్యాయి. ఇది 2012 కంటే 0.7 బిలియన్ టన్నులు అధికం.
 
-    ఇస్రో డిసెంబర్ 18న చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 (ఎల్‌వీఎం 3) రాకెట్ ఎత్తు 43.43 మీటర్లు, బరువు 630.58 టన్నులు.
 
-    అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ సూపర్ ఎర్త్‌ను గుర్తించినట్లు డిసెంబర్ 19న శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది భూమికి దాదాపు 180 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
 
-    భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన వెయ్యి కిలోల గ్లైడ్ బాంబును డిసెంబర్ 19న పరీక్షించింది.
 
 భారత్ చేపట్టిన మంగళ్‌యాన్‌ను 2014 అత్యుత్తమ ఆవిష్కరణగా టైమ్ పత్రిక అభివర్ణించింది. తొలి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి చేరుకోవడం సాంకేతిక అద్భుతమని, అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు సాధించని ఘనతను భారత్ సెప్టెంబరు 24న సొంతం చేసుకుందని ప్రశంసించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement