ఇస్రో...భారీ వాణిజ్య విజయం! | huge commercial success of ISRO | Sakshi
Sakshi News home page

ఇస్రో...భారీ వాణిజ్య విజయం!

Published Thu, Jul 30 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

huge commercial success of ISRO

 శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 10న ఇస్రో.. పీఎస్‌ఎల్‌వీ-సీ28ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది 30వ పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం. మొదటిసారి తప్ప మరెప్పుడూ ఈ వాహక నౌక విఫలం కాలేదు. ఇది లిఫ్ట్‌ఆఫ్ జరిగిన 19.18 నిమిషాల తర్వాత అయిదు ఉపగ్రహాలను 647 కి.మీ. ఎత్తులోని సూర్యానువర్తన (సన్ సింక్రోనస్) కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ28ను ఎక్స్‌ఎల్ రూపంలో ప్రయోగించింది.అధిక సామర్థ్యం, పరిమాణం ఉన్న స్ట్రాప్‌ఆన్ మోటార్లను పీఎస్‌ఎల్‌వీ మొదటి దశకు జతచేసి, ఎక్స్‌ఎల్ రూపాన్ని తయారుచేస్తారు. ప్రస్తుత ప్రయోగంలో ఒక్కో స్ట్రాప్‌ఆన్ మోటారులో 12 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించారు.
 
 ఎక్స్‌ఎల్ రూపంలో పీఎస్‌ఎల్‌వీను ప్రయోగించడం ఇది తొమ్మిదోసారి. పీఎస్‌ఎల్‌వీ-సీ28 బరువు 320 టన్నులు కాగా, పొడవు 44.4 మీటర్లు. పీఎస్‌ఎల్‌వీ-సీ28 ద్వారా ప్రయోగించిన అయిదు ఉపగ్రహాలు బ్రిటన్‌కు చెందినవి. వీటిలో మూడు ఉపగ్రహాలు ఒకేరకానికి (డీఎంసీ-3) చెందినవి. ఒక్కో దాని బరువు 447 కిలోలు. ఈ ఉపగ్రహాలు భూపరిశీలన ఉపగ్రహాలు. బ్రిటన్‌కు చెందిన సర్రే శాటిలైట్ టెక్నాలజీ సంస్థ నిర్మించిన ఈ ఉపగ్రహాలు అధిక రిజల్యూషన్‌తో ఫొటోలు తీస్తాయి. భూమిపై ఉన్న సహజ వనరుల పరిశీలన-సర్వే-అంచనా, శీతోష్ణస్థితి పరిస్థితుల అధ్యయనం, పట్టణ ప్రణాళికల రూపకల్పన, పట్టణాభివృద్ధి పర్యవేక్షణ, విపత్తుల సమగ్ర నిర్వహణ తదితరాలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని డీఎంసీ3 ఉపగ్రహాలు అందిస్తాయి. వీటికి సంబంధించిన అన్ని హక్కులను చైనాకు చెందిన 21ఏటీ లిమిటెడ్ (ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఏరోస్పేస్ టెక్నాలజీస్) కొనుగోలు చేసింది. పీఎస్‌ఎల్‌వీ-సీ28 ద్వారా డీఎంసీ 3తో పాటు సీబీఎన్‌టీ-1 (91 కిలోలు), డీఆర్బిట్ సెయిల్ (ఏడు కిలోలు) ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టారు. సీబీఎన్‌టీ మైక్రో శాటిలైట్ కాగా, డీఆర్బిట్ పరిశోధన నానో ఉపగ్రహం.
 
 కష్టమైనా సాధించారు...
 ఒక్కోటి మూడు మీటర్ల పొడవున్న డీఎంసీ 3 ఉపగ్రహాలను ఒకే పీఎస్‌ఎల్‌వీలో అమర్చడం కష్టమైన పని అయినప్పటికీ, ఇస్రో శాస్త్రవేత్తలు వాహక నౌకలో పలు మార్పులతో దీన్ని సాధించారు. ప్రయోగం కోసం ఇస్రో.. వృత్తాకారంలోని ఎల్-అడాప్టర్‌ను, త్రికోణంలోని మల్టిపుల్ శాటిలైట్ అడాప్టర్ వెర్షన్-2 (ఎంఎస్‌ఏ-వీ2) అనే రెండు ప్రత్యేకమైన అడాప్టర్లను కొత్తగా రూపొందించింది.ప్రస్తుత విదేశీ ఉపగ్రహాల ప్రయోగం మొదటి భారీ వాణిజ్య ప్రయోగం అయినప్పటికీ, ఇస్రో గతంలో 1858 కిలోలు బరువున్న దేశీయ ఉపగ్రహం రీశాట్-1ను పీఎస్‌ఎల్‌వీ-సీ19 ద్వారా ప్రయోగించింది. పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలన్నింటిలో రీశాట్-1 అత్యంత భారీ ఉపగ్రహం.
 
 పీఎస్‌ఎల్‌వీ
 ప్రపంచ వ్యాప్తంగా భారత అంతరిక్ష కార్యక్రమాలకు గుర్తింపు రావడంలో పీఎస్‌ఎల్‌వీ కీలకపాత్ర పోషించింది. పీఎస్‌ఎల్‌వీ కార్యక్రమం 1982లో ప్రారంభమైంది. అప్పటికే ఇస్రో ఎస్‌ఎల్‌వీ-3, ఏఎస్‌ఎల్‌వీ అనే రెండు పరి శోధన నౌకలను విజయవంతంగా అభివృద్ధి చేసింది. పీఎస్‌ఎల్‌వీ నమూనా పొడవు 44.4 మీటర్లు, బరువు 294 టన్నులు. ధ్రువకక్ష్యలోకి ఉపగ్రహాల్ని ప్రయోగించడానికి తొలుత దీన్ని రూపొందించారు. అయితే ఇది భూస్థిర, భూ అనువర్తిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించగలదు. ఇది నాలుగు దశల నౌక. మొదటి, మూడో దశల్లో ఘన ఇంధనం; రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. పీఎస్‌ఎల్‌వీ-జనరిక్ రూపంలో మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంటాయి. పీఎస్‌ఎల్‌వీ కోర్ అలోన్ (ఇౌట్ఛ అౌ్ఛ  ఇఅ) రూపంలో స్ట్రాప్ ఆన్ మోటర్లు ఉండవు.

దీని బరువు 230 టన్నులు. భారీ ఉపగ్రహాలను ప్రయోగించాల్సిన సమయంలో అధిక పరిమాణం, సామర్థ్యం ఉన్న స్ట్రాప్ ఆన్ మోటార్లను పీఎస్‌ఎల్‌వీకి అమర్చుతారు. ఈ రూపాన్ని పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్‌గా పేర్కొంటారు. దీని బరువు సుమారు 320 టన్నులు.  ఇప్పటి వరకు చేపట్టిన 30 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో మొదటి మూడు అభివృద్ధి ప్రయోగాలు కాగా, తర్వాతి ప్రయోగాలు కార్యాచరణ ప్రయోగాలు. 1993, సెప్టెంబరు 20న నిర్వహించిన మొదటి ప్రయోగం (పీఎస్‌ఎల్‌వీ-డీ1) మాత్రమే విఫలమైంది. మిగిలిన 29 ప్రయోగాలు వరుసగా విజయవంతమయ్యాయి. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన అంతరిక్ష రాకెట్లలో పీఎస్‌ఎల్‌వీ ఒకటిగా చెప్పుకోవచ్చు.  పీఎస్‌ఎల్‌వీ పనితీరుపై నమ్మకం ఉండటం వల్లే అనేక దేశాలు తమ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ముందుకొస్తున్నాయి. మరింత వేగంగా పీఎస్‌ఎల్‌వీ నౌకలను నిర్మించడమే కాకుండా, రీఎన్ట్రీ నౌకల పరిశోధనలను ముమ్మరం చేస్తే, భవిష్యత్తులో మరిన్ని వాణిజ్య విజయాలు సాధ్యపడతాయి.
 
 పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ ప్రయోగాలు
 1. పీఎస్‌ఎల్‌వీ-సీ11    చంద్రయాన్-1
 2. పీఎస్‌ఎల్‌వీ-సీ17    జీశాట్-12
 3. పీఎస్‌ఎల్‌వీ-సీ19    రీశాట్-1
 4. పీఎస్‌ఎల్‌వీ-సీ22    ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ
 5. పీఎస్‌ఎల్‌వీ-సీ25    మంగళ్‌యాన్
 6. పీఎస్‌ఎల్‌వీ-సీ24    ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ
 7. పీఎస్‌ఎల్‌వీ-సీ26    ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సీ
 8. పీఎస్‌ఎల్‌వీ-సీ27    ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీ
 9. పీఎస్‌ఎల్‌వీ-సీ28    డీఎంసీ 3 +
         మరో రెండు ఉపగ్రహాలు
 
 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు
 పీఎస్‌ఎల్‌వీ    {పయోగతేదీ    {పయోగించిన ఉపగ్రహాలు
 పీఎస్‌ఎల్‌వీ-డీ1    సెప్టెంబర్ 20, 1993    {పయోగం విఫలం
 పీఎస్‌ఎల్‌వీ-డీ2    అక్టోబర్ 15, 1994    ఐఆర్‌ఎస్-పీ2
 పీఎస్‌ఎల్‌వీ-డీ3    మార్చి 21, 1996    ఐఆర్‌ఎస్-పీ3
 పీఎస్‌ఎల్‌వీ-సీ1    సెప్టెంబర్ 29, 1997    ఐఆర్‌ఎస్ - 1డీ
 పీఎస్‌ఎల్‌వీ-సీ2    మే 26, 1999    ఐఆర్‌ఎస్ -పీ4 (ఓషన్ శాట్-1)+కిట్‌శాట్-3 (కొరియా)
         డీఎల్‌ఆర్-ట్యూబ్‌శాట్ (జర్మనీ)
 పీఎస్‌ఎల్‌వీ-సీ3    అక్టోబర్ 22, 2001    టెక్నాలజీ ఎక్స్‌పెరిమెంట్ శాటిలైట్, బర్‌‌డ(జర్మనీ),ప్రోబా(బెల్జియం)
 పీఎస్‌ఎల్‌వీ-సీ4    సెప్టెంబర్ 12, 2002    కల్పన-1
 పీఎస్‌ఎల్‌వీ-సీ5    అక్టోబర్ 17, 2003    ఐఆర్‌ఎస్-పీ6 (రిసోర్‌‌సశాట్-1)
 పీఎస్‌ఎల్‌వీ-సీ6    మే 5, 2005    కార్టోశాట్-1, హామ్‌శాట్ (ఏ్చఝట్చ్ట)
 పీఎస్‌ఎల్‌వీ-సీ7    జనవరి 10, 2007    కార్టోశాట్-2, ఎస్‌ఆర్‌ఈ-1, లాపాన్ ట్యూబ్‌శాట్ (ఇండోనేసియా)
         పేహున్‌శాట్ (అర్జెంటీనా)
 పీఎస్‌ఎల్‌వీ-సీ8    ఏప్రిల్ 23, 2007    ఎజైల్ (ఇటలీ), అడ్వాన్‌‌సడ్ ఏవియోనిక్స్ మాడ్యూల్ (ఏఏఎం)
 పీఎస్‌ఎల్‌వీ-సీ10    జనవరి 21, 2008    టెక్సార్ (ఇజ్రాయెల్)
 పీఎస్‌ఎల్‌వీ-సీ9    ఏప్రిల్ 28, 2008    కార్టోశాట్-2ఎ, ఇండియన్ మినీ శాటిలైట్-1 (ఐఎంఎస్-1)+
         ఎనిమిది ఇతర దేశాల ఉపగ్రహాలు
 పీఎస్‌ఎల్‌వీ- సీ11    అక్టోబర్ 22, 2008    చంద్రయాన్-1
 పీఎస్‌ఎల్‌వీ-సీ12     ఏప్రిల్ 20, 2009    రీశాట్-2+అనుశాట్
 పీఎస్‌ఎల్‌వీ-సీ14    సెప్టెంబర్ 23, 2009    ఓషన్ శాట్-2+ ఆరు విదేశీ ఉపగ్రహాలు
 పీఎస్‌ఎల్‌వీ-సీ15    జూలై 12, 2010    కార్టోశాట్-2బి+స్టడ్‌శాట్+అల్‌శాట్ (అల్జీరియా)+
         రెండు విదేశీ నానోశాట్+ఒక పికోశాట్
 పీఎస్‌ఎల్‌వీ-సీ16    ఏపిల్ ్ర20, 2011    రిసోర్స్ శాట్-2+యూత్ శాట్+ఎక్స్‌శాట్ (సింగపూర్)
 పీఎస్‌ఎల్‌వీ-సీ17    జూలై 15, 2011    జీశాట్12
 పీఎస్‌ఎల్‌వీ-సీ18     అక్టోబర్ 12, 2011    మేఘట్రాపిక్స్+ఎస్‌ఆర్‌ఎంశాట్+జుగ్ను+వెస్సెల్‌శాట్ (లక్సెంబర్గ్)
 పీఎస్‌ఎల్‌వీ-సీ19    ఏప్రిల్ 26, 2012    రీశాట్-1
 పీఎస్‌ఎల్‌వీ-సీ20     ఫిబ్రవరి 25, 2013    సరళ్+ఆరు ఇతర విదేశీ ఉపగ్రహాలు
 పీఎస్‌ఎల్‌వీ-సీ21    సెప్టెంబర్ 9, 2012    స్పాట్-6 (ఫ్రాన్స్)+ప్రొయిటెరిస్ (జపాన్)
 పీఎస్‌ఎల్‌వీ-సీ22    జూలై 1, 2013    ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ
 పీఎస్‌ఎల్‌వీ-సీ25    నవంబర్ 5, 2013    మంగళ్‌యాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్-మామ్)
 పీఎస్‌ఎల్‌వీ-సీ24    ఏప్రిల్ 4, 2014    ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి
 పీఎస్‌ఎల్‌వీ-సీ23    జూన్ 30, 2014    స్పాట్-7 (ఫ్రాన్స్)+ ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్-7.2(కెనడా)+
         ఏఐ శాట్ (జర్మనీ)+ వెలాక్స్-1 (సింగపూర్)
 పీఎస్‌ఎల్‌వీ-సీ26    అక్టోబరు 16,2014     ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి
 పీఎస్‌ఎల్‌వీ-సీ27    మార్చి 28, 2015    ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి
 పీఎస్‌ఎల్‌వీ-సీ28    జూలై 10, 2015    5 బ్రిటన్ ఉపగ్రహాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement