నింగికెగిసిన రెండో ‘దిక్సూచి
పీఎస్‌ఎల్‌వీ సీ24 ప్రయోగం విజయవంతం
కక్ష్యలోకి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ ఉపగ్రహం
సొంత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు దిశగా భారత్
శ్రీహరికోట, అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకం మరోమారు విజయగర్వంతో రెపరెపలాడింది. భారత్‌కు సొంత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండో ఉపగ్రహమైన ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ’ని ఇస్రో శుక్రవారం పీఎస్‌ఎల్‌వీ సీ24 ద్వారా విజయవంతంగా ప్రయోగించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో బుధవారం ఉదయం 6.44 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.శుక్రవారం సాయంత్రం 5:14 గంటలకు ఎరుపు, నారింజ రంగు మంటలను చిమ్ముతూ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ ఉపగ్రహాన్ని మోసుకుని పీఎస్‌ఎల్‌వీ సీ24 నింగికి దూసుకెళ్లింది. షార్‌లోని శాస్త్రవేత్తలు, వీక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
ఒక్కో దశను దాటుతూ ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం- ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్, షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్‌లు ఇతర శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. కక్ష్యలోకి చేరిన ఉపగ్రహాన్ని బెంగళూరు సమీపంలోని హసన్‌లో గల ఇస్రో ఉపగ్ర హ నియంత్రణ కేంద్రం శాస్త్రవేత్తలు నియంత్రిస్తారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం ఇది 26వ సారి కాగా.. షార్ నుంచి 42వ రాకెట్ ప్రయోగం.
సొంత ఉపగ్రహ దిక్సూచీ వ్యవస్థ కోసం..
ఉపగ్రహాల ద్వారా నౌకలు, విమానాల గమనాలను, వాటి భౌగోళిక స్థానాలను కచ్చితంగా తెలుసుకునేందుకు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడేలా సొంత ఉపగ్రహ దిక్సూచీ వ్యవస్థ ఏర్పాటుకు ఇస్రో కృషి చేస్తోంది. దీనికి ఏడు ఉపగ్రహాలు అవసరం కాగా.. ఇంతకుముందు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ ఉపగ్రహాన్ని, తాజాగా రెండోదాన్నీ విజయవంతంగా ప్రయోగించింది. భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ అందుబాటులోకి వస్తే గనక.. జీపీఎస్ పరిజ్ఞానం కోసం అమెరికాపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది.
2015లో రోదసీలోకి మన ‘హబుల్’!
నక్షత్రాలు, ఖగోళ వస్తువులపై అధ్యయనం కోసం హబుల్ అంతరిక్ష టెలిస్కోపు మాదిరిగా పనిచేసే ‘ఆస్ట్రోశాట్’ మినీ టెలిస్కోపును రోదసికి పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. హబుల్ 2.4 మీటర్లుండగా.. ఆస్ట్రోశాట్ 300 మి.మీ. మాత్రమే ఉంటుంది. అయినా హబుల్‌లో సైతం లేని విధంగా.. మూడురకాలైన కాంతికిరణాలు(అతినీలలోహిత, దృగ్గోచర, ఎక్స్ కిరణాలు)లను గుర్తించగలగడం దీని ప్రత్యేకత. వచ్చే ఏడాది దీనిని ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. - కిరణ్‌కుమార్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ డెరైక్టర్
కీలక మైలురాయి: రాష్ట్రపతి
పీఎస్‌ఎల్‌వీ సీ24 ప్రయోగం విజయవంతం కావడం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయి అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.
ఇస్రోకు గవర్నర్ అభినందనలు..: పీఎస్‌ఎల్‌వీ సీ24 రాకెట్ ప్రయోగాన్ని దిగ్విజయంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభినందనలు తెలిపారు.
రూ. 3,425 కోట్లతో దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ... : రాధాకృష్ణన్
శాస్త్రవేత్తల సమష్టి కృషి వల్లే ప్రయోగం విజయవంతమైంది. మన దేశానికి నావిగేషన్ సిస్టం, గ్లోబల్ పొజిషన్ సిస్టంను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తెచ్చేందుకు చేసిన రెండో ప్రయోగమిది. ఈ ఏడాది ఆఖరులోపు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సీ, 1డీ ఉపగ్రహాలనూ ప్రయోగిస్తాం. 2015 ఆఖరు నాటికి మరో మూడు ఉపగ్రహాలను ప్రయోగించి దిక్సూచి వ్యవస్థ సేవలను అందుబాటులోకి తెస్తాం. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థను రూ. 3,425 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నాం. ఇందులో ఉపగ్రహాలకు రూ.1,000 కోట్లు, 9 రాకె ట్లకు రూ.1,125 కోట్లు ఖర్చు చేస్తున్నాం. బెంగళూరు సమీపంలోని బైలాలు వద్ద రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్ నిర్మిస్తున్నాం. అలాగే రాబోయే ఐదేళ్లలో మొత్తం 60 ప్రయోగాలకు ప్రణాళికలు వేస్తున్నాం.