నిప్పులు కక్కుతూ నింగిలోకి.. | pslv c50 successfully From Sriharikota | Sakshi
Sakshi News home page

నిప్పులు కక్కుతూ నింగిలోకి..

Published Fri, Dec 18 2020 2:39 AM | Last Updated on Fri, Dec 18 2020 9:47 AM

pslv c50 successfully From Sriharikota - Sakshi

సాక్షి,అమరావతి/శ్రీహరికోట(సూళ్లూరుపేట ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీస్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ–50 ఉపగ్రహ వాహక నౌకను గురువారం సాయంత్రం 3.41 గంటలకు విజయవంతంగా ప్రయోగించి ఈ ఏడాది రెండో విజయాన్ని అందుకుంది. 25 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 20.11 నిమిషాల వ్యవధిలో 1,410 కిలోలు బరువు కలిగిన సీఎంఎస్‌–01 (జీశాట్‌–12ఆర్‌) అనే కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 265 కి.మీ, భూమికి దూరంగా 35,975 కి.మీ ఎత్తులోని జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లో దీర్ఘ వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహంలో కక్ష్యలోకి చేరిన వెంటనే బెంగళూరు సమీపంలోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం వారు అదుపులోకి తీసుకున్నారు. ఉపగ్రహానికి ఉన్న సోలార్‌ ప్యానెల్స్‌ కూడా వెంటనే విచ్చుకున్నట్టు వారు చెప్పారు.

320 టన్నుల బరువుతో ప్రయాణం 
44.4 మీటర్ల పొడవు గల పీఎస్‌ఎల్‌వీ సీ–50 రాకెట్‌ ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైంది. కౌంట్‌డౌన్‌ ముగిసే సమయం దగ్గర పడడంతో మిషన్‌ కంట్రోల్‌ రూమ్‌లో శాస్త్రవేత్తలు టెన్‌ నుంచి వన్‌ దాకా అంకెలు చెబుతూ జీరో రాగానే మంచు తెరలతో కూడిన మబ్బులను చీల్చుకుంటూ పీఎస్‌ఎల్‌వీ సీ–50 ఉపగ్రహ వాహకనౌక విజయవంతంగా నింగి వైపునకు దూసుకెళ్లింది. అది ఒక్కో దశను విజయవంతంగా దాటి వెళుతుంటే శాస్త్రవేత్తల వదనాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రయోగం విజయవంతం కావడంతో మిషన్‌ కంట్రోల్‌ రూంలోని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ సంతోషంగా లేచి సహచర శాస్త్రవేత్తలతో కరచాలనం చేశారు.

విజయ పరంపర: ఇస్రోకు బ్రహ్మాస్త్రం లాంటి పీఎస్‌ఎల్‌వీ సీ–50 రాకెట్‌ 52వ సారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయబావుటా ఎగురవేసింది. షార్‌ నుంచి 77వ ప్రయోగం, పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 52 ప్రయోగాలు జరగ్గా.. 50 ప్రయోగాలు విజయవంతమయ్యాయి.

గగన్‌యాన్‌–01 ప్రయోగానికి ప్రణాళికలు సిద్ధం 
2021 ప్రారంభంలో పీఎస్‌ఎల్‌వీ సీ–51 ప్రయోగాన్ని ఫిక్సల్‌ ఇండియా పేరుతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆనంద్‌ అనే రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం, యూనిటిశాట్‌ అనే ఉపగ్రహాన్ని పంపనున్నట్టు చెప్పారు. స్పేస్‌ కిడ్స్‌ ప్రోగ్రాం కింద దేశంలోని యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసే ఉపగ్రహాలను పంపిస్తామని చెప్పారు. చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు చంద్రయాన్‌–3, సూర్యుడిపైనా పరిశోధనలు చేసేందుకు ఆదిత్య ఎల్‌–01 గ్రహాంతర ప్రయోగాలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ తర్వాత గగన్‌యాన్‌–01 పేరుతో మానవ సహిత ప్రయోగానికీ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) పేరుతో సరికొత్త ప్రయోగాలు చేపడుతున్నట్టు వెల్లడించారు.

జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌–3 వంటి ప్రయోగాలు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు చెప్పారు. అనంతరం ప్రయోగాన్ని విజయంతం చేసేందుకు కృషిచేసిన మిషన్‌ టీం, శాటిలైట్‌ టీంలను అభినందించారు. పీఎస్‌ఎల్‌వీ సీ–50 ద్వారా ప్రయోగించిన సీఎంఎస్‌–01 (జీశాట్‌–12ఆర్‌) ఉపగ్రహం సేవలు ఎంతో మెరుగ్గా ఉంటాయన్నారు. 11 ఏళ్ల కిందట ప్రయోగించిన జీశాట్‌–12 స్థానంలో ఈ ఉపగ్రహం సేవలందిస్తుందని తెలిపారు. సీఎంఎస్‌–01 ఉపగ్రహాన్ని విజయవంతంగా సబ్‌ జీటీవో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టామని, శుక్రవారం నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని నాలుగు సార్లు మండించి సబ్‌ జీటీవో ఆర్బిట్‌ నుంచి జియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతామన్నారు. ఈ ప్రక్రియ నాలుగు రోజుల పాటు నిర్వహించి 21వ తేదీన భూమికి 36 వేల కి.మీ ఎత్తులోని జియో ఆర్బిట్‌కు పంపిస్తామని శివన్‌ వివరించారు. ప్రయోగంలో షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్, పలు సెంటర్ల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల సీఎంల అభినందనలు..
పీఎస్‌ఎల్‌వీ సీ–50 రాకెట్‌ ప్రయోగం విజయవంతంపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినదందనలు తెలిపారు. 

భారీ ప్రయోగాలే లక్ష్యం : ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ శివన్‌
ఈ ఏడాది కోవిడ్‌–19 పరిస్థితుల దృష్ట్యా 8 నెలల పాటు ప్రయోగాలన్నింటికీ బ్రేక్‌ పడ్డాయని, ప్రస్తుతం ఆ పరిస్థితులను అధిగమించి రెండు ప్రయోగాలను విజయ వంతం చేయగలిగామని ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ చెప్పారు. 2021 సంవత్సరం స్పేస్‌ రీఫామ్‌ ఇయర్‌గా ఉంటుం దని తెలిపారు. సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 3.41 గంటలకు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ–50 ప్రయోగం విజయవంతం కావడంతో ఆయన మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ప్రసంగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement