Satish dhwan space center
-
సాకారం దిశగా గగనయానం.. ప్రయోగానికి ఇస్రో సిద్ధం
సూళ్లూరుపేట: ఇస్రో గండరగండులు ఇకపై అంతరిక్షంలో విహరించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానవ సహిత ప్రయోగాలే లక్ష్యంగా ఈ ఏడాది చివరికి లేదా 2023 ప్రథమార్థంలో గగన్‌యాన్–1 ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇస్రో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేసేందుకు పలు రకాల భూస్థిర పరీక్షలు చేసి రాకెట్ సామర్థ్యాన్ని పరీక్షిస్తోంది. గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించి భారత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించడంతో ప్రాజెక్టు వేగవంతంగా ముందుకు సాగుతోంది. భవిష్యత్‌లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు కూడా ఇస్రో సన్నద్ధమవుతోంది. గగన్‌యాన్–1కు సంబంధించి తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని స్ప్రాబ్ విభాగంలో ఈ నెల 13న ఎస్–200 (ఘన ఇంధన మోటార్) భూస్థిర పరీక్షను ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయం సాధించారు. భారీ రాకెట్ ప్రయోగానికి ఉపయోగించే ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లు, రెండో దశలో ఉపయోగించే ఎల్–110 సామర్థ్యంతో పాటు సుమారు 3.5 టన్నుల బరువు గల క్రూ మాడ్యూల్ (వ్యోమనాట్స్ గది)ను పంపించి మళ్లీ దాన్ని తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో సొంతంగా తయారు చేసుకుంది. క్రూ మాడ్యూల్‌ను విజయవంతంగా ప్రయోగించి పారాచూట్ల సాయంతో తిరిగి తీసుకొచ్చే విషయంలోనూ విజయం సాధించారు. దిగ్విజయంగా.. ప్యాడ్ అబార్ట్ టెస్ట్.. మానవ సహిత ప్రయోగాల్లో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు 2018 జూలై 4న ‘ప్యాడ్ అబార్ట్ టెస్ట్’ అనే ప్రయోగాత్మక ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగంలో 259 సెకన్ల పాటు రాకెట్‌ను నాలుగు దశల్లో మండించి రెండు కిలోమీటర్ల మేర అంతరిక్షం వైపునకు తీసుకెళ్లి పారాచూట్ల ద్వారా క్రూ మాడ్యూల్‌ను బంగాళాఖాతంలోకి దించారు. అక్కడ రెండు చిన్నపాటి పడవల్లో ఇస్రో శాస్త్రవేత్తలు దానిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 720 సెకన్లపాటు మండించి.. గగన్‌యాన్–1 ప్రయోగానికి సంబంధించి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్లో మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్ దశను తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్లో ఈ ఏడాది జనవరి 12న భూస్థిర పరీక్ష నిర్వహించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. క్రయోజనిక్ మోటార్లో 12 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని నింపి 720 సెకన్ల పాటు మండించి ఇంజన్ పనితీరును పరీక్షించారు. ఈ ఇంజన్‌ను మరోమారు 1,810 సెకన్ల పాటు మండించి పరీక్షించేందుకుగాను మరో నాలుగు పరీక్షలను నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఆర్ఎల్వీ టీడీ ప్రయోగమూ విజయవంతం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 2016 మే 23న రీయూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్స్ట్రేటర్(ఆర్ఎల్వీ–టీడీ)ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ తరహా రాకెట్ 12 టన్నుల బరువుతో పయనమై 56 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాక శిఖర భాగాన అమర్చిన 550 కిలోల బరువుగల హైపర్ సోనిక్ ఫ్లైట్‌ను విడుదల చేసింది. ఆ ఫ్లైట్ 65 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగి వచ్చేందుకు రన్ వే సౌకర్యం లేకపోవడంతో ప్రయోగాత్మకంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి 450 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దిగ్విజయంగా దించారు. దానికి ఇండియన్ కోస్టల్ గార్డ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు సముద్రం మీద విండ్ మెజర్మెంట్, షిప్ బర్న్ టెలీమెట్రీ సౌకర్యాన్ని అందించి ఇస్రోకు సహకరించడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేయగలిగారు. వ్యోమనాట్స్‌ను రోదసిలో వదిలిపెట్టి మళ్లీ క్షేమంగా తెచ్చేందుకు ఉపయోగపడే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ–టీడీ) ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా చేసి నిర్ధారించుకున్నారు. (క్లిక్: తమిళనాడులో సబ్‌వేరియంట్ బీఏ.4 రెండో కేసు) -
నిప్పులు కక్కుతూ నింగిలోకి..
సాక్షి,అమరావతి/శ్రీహరికోట(సూళ్లూరుపేట ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ–50 ఉపగ్రహ వాహక నౌకను గురువారం సాయంత్రం 3.41 గంటలకు విజయవంతంగా ప్రయోగించి ఈ ఏడాది రెండో విజయాన్ని అందుకుంది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 20.11 నిమిషాల వ్యవధిలో 1,410 కిలోలు బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 265 కి.మీ, భూమికి దూరంగా 35,975 కి.మీ ఎత్తులోని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో దీర్ఘ వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహంలో కక్ష్యలోకి చేరిన వెంటనే బెంగళూరు సమీపంలోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం వారు అదుపులోకి తీసుకున్నారు. ఉపగ్రహానికి ఉన్న సోలార్ ప్యానెల్స్ కూడా వెంటనే విచ్చుకున్నట్టు వారు చెప్పారు. 320 టన్నుల బరువుతో ప్రయాణం 44.4 మీటర్ల పొడవు గల పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైంది. కౌంట్‌డౌన్ ముగిసే సమయం దగ్గర పడడంతో మిషన్ కంట్రోల్ రూమ్‌లో శాస్త్రవేత్తలు టెన్ నుంచి వన్ దాకా అంకెలు చెబుతూ జీరో రాగానే మంచు తెరలతో కూడిన మబ్బులను చీల్చుకుంటూ పీఎస్ఎల్వీ సీ–50 ఉపగ్రహ వాహకనౌక విజయవంతంగా నింగి వైపునకు దూసుకెళ్లింది. అది ఒక్కో దశను విజయవంతంగా దాటి వెళుతుంటే శాస్త్రవేత్తల వదనాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రయోగం విజయవంతం కావడంతో మిషన్ కంట్రోల్ రూంలోని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ సంతోషంగా లేచి సహచర శాస్త్రవేత్తలతో కరచాలనం చేశారు. విజయ పరంపర: ఇస్రోకు బ్రహ్మాస్త్రం లాంటి పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ 52వ సారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయబావుటా ఎగురవేసింది. షార్ నుంచి 77వ ప్రయోగం, పీఎస్ఎల్వీ సిరీస్‌లో 52 ప్రయోగాలు జరగ్గా.. 50 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. గగన్‌యాన్–01 ప్రయోగానికి ప్రణాళికలు సిద్ధం 2021 ప్రారంభంలో పీఎస్ఎల్వీ సీ–51 ప్రయోగాన్ని ఫిక్సల్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆనంద్ అనే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం, యూనిటిశాట్ అనే ఉపగ్రహాన్ని పంపనున్నట్టు చెప్పారు. స్పేస్ కిడ్స్ ప్రోగ్రాం కింద దేశంలోని యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసే ఉపగ్రహాలను పంపిస్తామని చెప్పారు. చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు చంద్రయాన్–3, సూర్యుడిపైనా పరిశోధనలు చేసేందుకు ఆదిత్య ఎల్–01 గ్రహాంతర ప్రయోగాలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ తర్వాత గగన్‌యాన్–01 పేరుతో మానవ సహిత ప్రయోగానికీ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) పేరుతో సరికొత్త ప్రయోగాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి ప్రయోగాలు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు చెప్పారు. అనంతరం ప్రయోగాన్ని విజయంతం చేసేందుకు కృషిచేసిన మిషన్ టీం, శాటిలైట్ టీంలను అభినందించారు. పీఎస్ఎల్వీ సీ–50 ద్వారా ప్రయోగించిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) ఉపగ్రహం సేవలు ఎంతో మెరుగ్గా ఉంటాయన్నారు. 11 ఏళ్ల కిందట ప్రయోగించిన జీశాట్–12 స్థానంలో ఈ ఉపగ్రహం సేవలందిస్తుందని తెలిపారు. సీఎంఎస్–01 ఉపగ్రహాన్ని విజయవంతంగా సబ్ జీటీవో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టామని, శుక్రవారం నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని నాలుగు సార్లు మండించి సబ్ జీటీవో ఆర్బిట్ నుంచి జియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతామన్నారు. ఈ ప్రక్రియ నాలుగు రోజుల పాటు నిర్వహించి 21వ తేదీన భూమికి 36 వేల కి.మీ ఎత్తులోని జియో ఆర్బిట్‌కు పంపిస్తామని శివన్ వివరించారు. ప్రయోగంలో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, పలు సెంటర్ల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల అభినందనలు.. పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినదందనలు తెలిపారు. భారీ ప్రయోగాలే లక్ష్యం : ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ఈ ఏడాది కోవిడ్–19 పరిస్థితుల దృష్ట్యా 8 నెలల పాటు ప్రయోగాలన్నింటికీ బ్రేక్ పడ్డాయని, ప్రస్తుతం ఆ పరిస్థితులను అధిగమించి రెండు ప్రయోగాలను విజయ వంతం చేయగలిగామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ చెప్పారు. 2021 సంవత్సరం స్పేస్ రీఫామ్ ఇయర్‌గా ఉంటుం దని తెలిపారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 3.41 గంటలకు ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ–50 ప్రయోగం విజయవంతం కావడంతో ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రసంగించారు. -
త్వరలో అందుబాటులోకి మల్టీ అబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్
నెల్లూరు (సూళ్లూరుపేట) : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లో మల్టీ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్ రాడార్ వ్యవస్థ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. రూ.250 కోట్లతో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో రాడార్ వ్యవస్థ ఏర్పాటుకు 2014లో శ్రీకారం చుట్టారు. ఈ తరహా కేంద్రం ప్రపంచంలో అగ్రరాజ్యాలతో పాటు ఇజ్రాయెల్‌కు మాత్రమే ఉంది. సరికొత్త రాడార్ ను 50 మంది ఇంజినీర్లు డిజైన్ చేయగా వందమంది ఇంజనీర్లు ఏర్పాటు పన్నుల్లో బిజీగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని పరికరాలు ఇటీవలే షార్కు చేరుకున్నాయి. ప్రస్తుతం శ్రీహరికోటలోని రాడార్లు రాకెట్ గమనాన్ని మాత్రమే ట్రాకింగ్ చేయగలవు. కొత్త కేంద్రం అందుబాటులోకొస్తే రాకెట్ శకలాలు ఎక్కడ పడేది, ఉపగ్రహాలు ఢీ కొట్టుకునే పరిస్థితి వస్తే వాటిని సరిచేసే టెక్నాలజీ అందుబాటులోకిరానుంది. కక్ష్యలో ఉపగ్రహాన్ని విడిచిపెట్టే ప్రక్రియను స్పష్టంగా చూడొచ్చు. అంతరిక్షంలో ఉపగ్రహాల శకలాలను తొలగించొచ్చు.