గగన్‌యాన్–1 ప్రయోగంలో భాగంగా అంతరిక్షంలోకి పంపనున్న క్రూ మాడ్యూల్ (వ్యోమగాముల గది) ఊహా చిత్రం.
సూళ్లూరుపేట: ఇస్రో గండరగండులు ఇకపై అంతరిక్షంలో విహరించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానవ సహిత ప్రయోగాలే లక్ష్యంగా ఈ ఏడాది చివరికి లేదా 2023 ప్రథమార్థంలో గగన్‌యాన్–1 ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇస్రో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేసేందుకు పలు రకాల భూస్థిర పరీక్షలు చేసి రాకెట్ సామర్థ్యాన్ని పరీక్షిస్తోంది. గగన్‌యాన్ ప్రయోగానికి సంబంధించి భారత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు కేటాయించడంతో ప్రాజెక్టు వేగవంతంగా ముందుకు సాగుతోంది. భవిష్యత్‌లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు కూడా ఇస్రో సన్నద్ధమవుతోంది.
గగన్‌యాన్–1కు సంబంధించి తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని స్ప్రాబ్ విభాగంలో ఈ నెల 13న ఎస్–200 (ఘన ఇంధన మోటార్) భూస్థిర పరీక్షను ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయం సాధించారు. భారీ రాకెట్ ప్రయోగానికి ఉపయోగించే ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్లు, రెండో దశలో ఉపయోగించే ఎల్–110 సామర్థ్యంతో పాటు సుమారు 3.5 టన్నుల బరువు గల క్రూ మాడ్యూల్ (వ్యోమనాట్స్ గది)ను పంపించి మళ్లీ దాన్ని తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో సొంతంగా తయారు చేసుకుంది. క్రూ మాడ్యూల్‌ను విజయవంతంగా ప్రయోగించి పారాచూట్‌ల సాయంతో తిరిగి తీసుకొచ్చే విషయంలోనూ విజయం సాధించారు.
దిగ్విజయంగా.. ప్యాడ్ అబార్ట్ టెస్ట్..
మానవ సహిత ప్రయోగాల్లో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు 2018 జూలై 4న ‘ప్యాడ్ అబార్ట్ టెస్ట్’ అనే ప్రయోగాత్మక ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగంలో 259 సెకన్ల పాటు రాకెట్‌ను నాలుగు దశల్లో మండించి రెండు కిలోమీటర్ల మేర అంతరిక్షం వైపునకు తీసుకెళ్లి పారాచూట్‌ల ద్వారా క్రూ మాడ్యూల్‌ను బంగాళాఖాతంలోకి దించారు. అక్కడ రెండు చిన్నపాటి పడవల్లో ఇస్రో శాస్త్రవేత్తలు దానిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
720 సెకన్లపాటు మండించి..
గగన్‌యాన్–1 ప్రయోగానికి సంబంధించి జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 రాకెట్‌లో మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్ దశను తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్‌లో ఈ ఏడాది జనవరి 12న భూస్థిర పరీక్ష నిర్వహించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించుకున్నారు. క్రయోజనిక్ మోటార్‌లో 12 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని నింపి 720 సెకన్ల పాటు మండించి ఇంజన్ పనితీరును పరీక్షించారు. ఈ ఇంజన్‌ను మరోమారు 1,810 సెకన్ల పాటు మండించి పరీక్షించేందుకుగాను మరో నాలుగు పరీక్షలను నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.
ఆర్‌ఎల్‌వీ టీడీ ప్రయోగమూ విజయవంతం
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి 2016 మే 23న రీయూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్‌స్ట్రేటర్(ఆర్‌ఎల్‌వీ–టీడీ)ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ తరహా రాకెట్ 12 టన్నుల బరువుతో పయనమై 56 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాక శిఖర భాగాన అమర్చిన 550 కిలోల బరువుగల హైపర్ సోనిక్ ఫ్‌లైట్‌ను విడుదల చేసింది. ఆ ఫ్‌లైట్ 65 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగి వచ్చేందుకు రన్ వే సౌకర్యం లేకపోవడంతో ప్రయోగాత్మకంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి 450 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దిగ్విజయంగా దించారు.
దానికి ఇండియన్ కోస్టల్ గార్డ్స్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు సముద్రం మీద విండ్ మెజర్‌మెంట్, షిప్ బర్న్ టెలీమెట్రీ సౌకర్యాన్ని అందించి ఇస్రోకు సహకరించడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేయగలిగారు. వ్యోమనాట్స్‌ను రోదసిలో వదిలిపెట్టి మళ్లీ క్షేమంగా తెచ్చేందుకు ఉపయోగపడే రీయూజబుల్ లాంచింగ్ వెహికల్–టెక్నికల్ డిమాన్‌స్ట్రేటర్ (ఆర్‌ఎల్‌వీ–టీడీ) ప్రయోగాన్ని ప్రయోగాత్మకంగా చేసి నిర్ధారించుకున్నారు.
(క్లిక్: తమిళనాడులో సబ్‌వేరియంట్ బీఏ.4 రెండో కేసు)
Comments
Please login to add a commentAdd a comment