చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది? | Chandrayaan 2 Launch On July 14th 2109 | Sakshi
Sakshi News home page

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

Published Sun, Jul 14 2019 11:50 AM | Last Updated on Sun, Jul 14 2019 12:02 PM

Chandrayaan 2 Launch On July 14th 2109 - Sakshi

చందమామ చుట్టూ ఎన్నో కథలు, కల్పనలు... చందమామ చుట్టూ ఎన్నెన్నో పాటలు, ఆటలు... చంద్రుని మీద కనిపించే మచ్చ కుందేలులా కనిపిస్తుంది. నిజానికి అక్కడ కుందేలేమైనా ఉందా? అక్కడ లేకుంటే భూమ్మీద నుంచి కుందేలును పంపితే– ఆ కుందేలు అక్కడ సంతోషంగా ఉంటుందా? చంద్రుని గురించి మనకు కొంత తెలుసు. చాలా తెలీదు. చంద్రుడి మీద మానవుడు అడుగుమోపి ఐదు దశాబ్దాలు గడిచాయి. అయినా, చంద్రుడి గురించి తెలుసుకోవలసిన సంగతులు కొండంత.

నేడు చంద్రయాన్‌–2 ప్రయోగం సందర్భంగా...
అందిన చందమామను మరోసారి అందుకోవడానికి సిద్ధపడుతున్నారు మన శాస్త్రవేత్తలు. చందమామ మీద అందీ అందని రహస్యాలను అందిపుచ్చుకోవడానికి నేడు ‘చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని తలపెడుతున్నారు. ‘చంద్రయాన్‌–1’ ప్రయోగాన్ని మైలస్వామి అన్నాదురై నేతృత్వంలో ఇదివరకు విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలోనే ‘చంద్రయాన్‌–2’ ప్రయోగం జరుగుతోంది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో ఈ ప్రయోగం మరో మైలురాయిగా నిలిచిపోతుంది.

రష్యా అంతరిక్ష సంస్థ (రష్యన్‌ ఫెడరల్‌ స్పేస్‌ ఏజెన్సీ–రాస్‌కాస్మోస్‌) సహకారంలో ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు మరోసారి చంద్రుడి మీద పరిశోధనలకు రంగం సిద్ధం చేసుకున్నారు. ‘చంద్రయాన్‌–2’ మిషన్‌లో భాగంగా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి జియోసెంట్రిక్‌ లాంచ్‌ వెహికల్‌–మార్క్‌3  (జీఎస్‌ఎల్వీ–మార్క్‌3 ) వాహనం ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లను నేడు చంద్రుని దిశగా అంతరిక్షంలోనికి పంపనున్నారు. ఇందులో మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు తయారు చేసిన లూనార్‌ ఆర్బిటర్, రోవర్‌లతో పాటు రష్యా అంతరిక్ష సంస్థ తయారు చేసిన ల్యాండర్‌ను ప్రయోగించనున్నారు.

ఇందులో చక్రాలు కలిగిన రోవర్‌ యంత్రం సౌరశక్తితో పనిచేస్తూ, చంద్రుని ఉపరితలంపై సంచరించి,  అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి, వాటి రసాయనిక విశ్లేషణ జరిపి, ఆ సమాచారాన్ని ‘చంద్రయాన్‌–2’ ఆర్బిటర్‌ ద్వారా భూమిపైనున్న ‘ఇస్రో’ పరిశోధన కేంద్రానికి చేరవేస్తుంది. ‘చంద్రయాన్‌–2’ ప్రయోగం కోసం దాదాపు పుష్కరకాలం నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ప్రయోగంలో కలసి పాల్గొనాలని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు, రష్యా అంతరిక్ష సంస్థ (రాస్‌కాస్మోస్‌) 2007 నవంబరు 12న ఒప్పందం చేసుకున్నారు.

ఈ ఒప్పందానికి 2008 సెప్టెంబర్‌ 18న నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని కేబినెట్‌ బృందం ఆమోదం తెలిపింది. ‘ఇస్రో’, రాస్‌కాస్మోస్‌ల ఒప్పందం ప్రకారం రోవర్, ఆర్బిటర్‌ల తయారీ బాధ్యతను ‘ఇస్రో’ తీసుకోగా, ‘రాస్‌కాస్మోస్‌’ ల్యాండర్‌ తయారీ బాధ్యతలను చేపట్టింది. ‘ఇస్రో’ రూపొందించిన ఆర్బిటర్‌ చంద్రునికి 200 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ‘రాస్‌కాస్మోస్‌’ తయారు చేసిన ల్యాండర్‌.. ‘ఇస్రో’ తయారు చేసిన రోవర్‌ను చంద్రుని ఉపరితలంపైకి దిగవిడుస్తుంది. వీటిని అంతరిక్షంలోకి చేరవేసే జీఎస్‌ఎల్‌వీ–మార్క్‌3 వాహనం ఆకృతిని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2009 ఆగస్టులోనే సిద్ధం చేశారు. దీని బరువు 2650 కిలోలు. ల్యాండర్, రోవర్‌ల బరువు దాదాపు 1250 కిలోలు. ‘ఇస్రో’ రూపొందించిన ఆర్బిటర్‌లో ఐదు ఉపగ్రహాలు ఉంటాయి. వీటిలో మూడు కొత్తగా రూపొందించినవైతే, మిగిలిన రెండూ చంద్రయాన్‌–1లో ప్రయోగించిన పాత ఉపగ్రహాలే. అయితే, మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు వీటిని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేశారు.

అన్నీ స్వదేశీ పరికరాలే...


చంద్రయాన్‌–2 ప్రయోగంలో భాగంగా జీఎస్‌ఎల్‌వీ–మార్క్‌3 వాహనాన్ని భారతీయ కాలమానం ప్రకారం జూలై 14న వేకువ జామున 2.51 గంటలకు శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇందులోని ల్యాండర్‌ ద్వారా రోవర్‌ యంత్రం చంద్రుని ఉపరితలం మీదకు సెప్టెంబర్‌ 6న చేరుకోగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆర్బిటర్‌ ద్వారా ఐదు, ల్యాండర్‌ ద్వారా నాలుగు, రోవర్‌ ద్వారా రెండు సాంకేతిక పరికరాలను ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపుతున్నారు. చంద్రయాన్‌–2లో భాగంగా, అమెరికన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, యూరోపియన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఈఎస్‌ఏ) కూడా కొన్ని సాంకేతిక పరికరాలను పంపాలని భావించినా, బరువు పరిమితుల కారణంగా విదేశీ పరికరాలనేవీ ఈ ప్రయోగంలో పంపరాదని ‘ఇస్రో’ బృందం నిర్ణయించింది.

చంద్రయాన్‌–1 తరహాలోనే చంద్రుని ఉపరితలంపై విశేషాలను మరింత లోతుగా తెలుసుకునే ఉద్దేశంతో ‘ఇస్రో’ ‘చంద్రయాన్‌–2’ ప్రయోగాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా అంతరిక్షంలోకి పంపుతున్న సాంకేతిక పరికరాల ద్వారా చంద్రుని ఉపరితలాన్ని రోవర్‌ ద్వారా జల్లెడపట్టి, ఉపరితలంపై మట్టిలోని రసాయనాల విశేషాలను, ఒకవేళ చంద్రునిపై నీటి అణువుల జాడ ఏమైనా ఉందేమో తెలుసుకోవాలని భావిస్తోంది. రోవర్‌కు అమర్చిన టెర్రయిన్‌ మ్యాపింగ్‌ కెమెరా–2 (టీఎంసీ–2), మినియేచర్‌ సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ (మినీ–సార్‌) పరికరాలు చంద్రయాన్‌–1లో ఉపయోగించిన పరికరాల కంటే మరింత మెరుగైనవి. వీటిలో టీఎంసీ–2 చంద్రుని ఉపరితలానికి చెందిన త్రీడీ మ్యాప్‌లను ఆర్బిటర్‌లోని పరికరాల ద్వారా భూమిపైకి పంపుతుంది. అలాగే, మినీ–సార్‌ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోని పేరుకుపోయి ఉన్న మంచులోని నీటి కణాలను, అక్కడి మట్టిని, మట్టి మందాన్ని విశ్లేషించి, ఆ సమాచారాన్ని భూమిపైకి పంపుతుంది.

చంద్రుని చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణంలోని అత్యంత ఎగువ పొర అయిన ‘అయానోస్ఫియర్‌’లోని ఎలక్ట్రాన్‌ల సాంద్రతను ‘డ్యూయల్‌ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్‌’ (డీఎఫ్‌ఆర్‌ఎస్‌) పరికరం విశ్లేషిస్తుంది. ఐఆర్‌ స్పెక్ట్రోమీటర్‌ పరికరం చంద్రునిపై నీటి అణువుల జాడను, ఖనిజాలను గుర్తించి, ఆ సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తుంది. ఆర్బిటర్‌కు అమర్చిన హైరిజల్యూషన్‌ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) ల్యాండర్‌ చంద్రుని ఉపరితలంపైన నిర్దేశిత ప్రదేశానికి సురక్షితంగా చేరుకోగానే త్రీడీ ఫొటోలు తీసి, వాటిని భూమిపైకి పంపిస్తుంది. చంద్రయాన్‌–2లోని ‘సోలార్‌ ఎక్స్‌రే మానిటర్‌’ చంద్రుని వాతావరణానికి ఎగువన ఆవరించి ఉన్న ‘కరోనా’ ప్రాంతంలో సూర్యకిరణాల తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదీ కొలవడానికి ఉపయోగపడుతుంది. చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంలో సంచరించనున్న రోవర్‌ తెలుసుకునే సమాచారాన్ని ఆర్బిటర్‌ ఎప్పటికప్పుడు భూమిపైకి చేరవేస్తూ ఉంటుంది. ఇది చంద్రుని కక్ష్యలో ఏడాది పాటు పరిభ్రమిస్తుంది.

చందమామ అందిన రోజు


చంద్రుని చుట్టూ ఎన్నో పురాణాలు ఉన్నాయి. అభూత కల్పనలు ఉన్నాయి. అందరాని చందమామను అందుకోవాలనే తపన మానవుల్లో చాలా ఏళ్లుగానే ఉండేది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ ఈ తపన మరింత ఎక్కువైంది. మానవుడికి సంకల్పబలం ఉండాలే గాని, అసాధ్యమైనదేదీ లేదని నిరూపిస్తూ అమెరికన్‌ వ్యోమగామి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ 1969 జూలై 16న భూమిపై నుంచి చంద్రునిపైకి ప్రయాణించాడు. చందమామ మానవుడి చేతికందిన అద్భుతమైన రోజు అది. అపోలో–11 వ్యోమనౌకలో బయలుదేరిన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుని ఉపరితలంపై అడుగు మోపిన తొట్టతొలి మానవుడిగా చరిత్ర సృష్టించాడు. చంద్రుడి ధూళిని సేకరించి భూమిపైకి విజయవంతంగా తిరిగివచ్చాడు. అయితే, అంతకు పదేళ్ల ముందే, 1959లో రష్యా చంద్రునిపైకి లూనా–2 వ్యోమనౌకను విజయవంతంగా పంపింది.

చంద్రుడిపైకి మానవులు పంపిన వస్తువు ఒకటి  చేరుకోవడం చరిత్రలో అదే మొదటిసారి. చంద్రునిపైకి వ్యోమనౌకలను పంపడానికి రష్యా అంతకు ముందు మూడుసార్లు చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. రష్యన్‌ శాస్త్రవేత్తలు 1958 సెప్టెంబర్‌ 23, అక్టోబర్‌ 12, డిసెంబర్‌ 4లలో పంపిన వ్యోమనౌకలేవీ చంద్రునిపైకి  చేరుకోలేకపోయాయి. వరుస వైఫల్యాల తర్వాత ‘లూనా’ ప్రయోగాలకు రష్యా నడుం బిగించింది. ఇందులో భాగంగా 1959 జనవరి 2న ప్రయోగించిన ‘లూనా–1’ చంద్రునికి 5,965 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని తప్పింది. తిరిగి లోపాలను దిద్దుకుని అదే ఏడాది సెప్టెంబర్‌ 13న పంపిన ‘లూనా–2’ విజయవంతంగా చంద్రునిపైకి చేరుకోగలిగింది. అయితే, చంద్రునిపైకి మనిషిని తొలిసారిగా పంపిన ఘనత మాత్రం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) దక్కించుకోగలిగింది.

‘నాసా’ ఆధ్వర్యంలో జరిపిన ప్రయోగంలో నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ 1969 జూలై 20న చంద్రునిపై తొలి అడుగు మోపి, అక్కడి నుంచి ‘చంద్రుని మీద మనిషి మోపిన తొలి అడుగు మానవాళికే ముందడుగు’ అంటూ సందేశం పంపాడు. చంద్రునిపై నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మోపిన తొలి అడుగు ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ స్ఫూర్తితోనే చాలా దేశాలు చంద్రుడిని చేరుకోవడానికి, చంద్రుడి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. నాటి నుంచి నేటి వరకు వివిధ దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు చంద్రుడి వద్దకు ఉపగ్రహాలు, వ్యోమనౌకలు పంపుతూ కీలకమైన సమాచారాన్ని సేకరిస్తూ వస్తున్నాయి.

భూమికి సహజ ఉపగ్రహమైన చందమామ ఏనాటికైనా మానవులకు ఆవాసం కాకపోతుందా అనే ఆశతో చేస్తున్న ప్రయోగాల్లో ఇప్పటికే అనేక విజయాలు సాధించాయి. చంద్రునిపై పంటలు పండించడం ఎంతవరకు సాధ్యమవుతుందో తెలుసుకోవడానికి చైనా ఇటీవల ఒక ప్రయత్నం చేసింది. చంద్రునిపై పత్తి విత్తనాలను మొలకెత్తించింది. చంద్రుని ఉపరితలంపై రాత్రివేళ అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా మొలకెత్తిన విత్తనం జీవాన్ని పుంజుకోకుండానే అంతరించిపోయింది.

‘చంద్రయాన్‌–1’ సాధించిందేమిటంటే..?
చంద్రునిపై పరిశోధనల కోసం ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ఇదివరకు చేపట్టిన చంద్రయాన్‌–1 గణనీయమైన ఫలితాలనే సాధించింది. ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2008 అక్టోబర్‌ 22న ‘చంద్రయాన్‌–1’ ప్రయోగాన్ని చేపట్టారు. అందులో భాగంగా పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ–సీ 11) ద్వారా  పంపిన ఉపగ్రహం చంద్రుని చుట్టూ 3,400 సార్లు పరిభ్రమించి, కీలకమైన సమాచారాన్ని చేరవేసింది. దీని నుంచి 2009 ఆగస్టు 29న కమ్యూనికేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. చంద్రుని ఉపరితలంపై హైడ్రాక్సిల్‌ (ఓహెచ్‌), నీరు (హెచ్‌2ఓ) అణువుల ఉనికిని తొలిసారిగా గుర్తించగలగడం  ‘చంద్రయాన్‌–1’ సాధించిన ఘనవిజయంగా చెప్పుకోవచ్చు.

‘చంద్రయాన్‌–1’ చంద్రుని ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, క్యాల్షియం వంటి మూలకాల ఉనికిని కూడా గుర్తించింది. ‘చంద్రయాన్‌–1’లో భాగంగా చంద్రునిపైకి చేరుకున్న టెర్రయిన్‌ మ్యాపింగ్‌ కెమెరా (టీఎంసీ) ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత స్పష్టతతో కూడిన త్రీడీ చిత్రాలను భూమిపైకి చేరవేయగలిగింది. దీని ద్వారా చంద్రుని ఉపరితలంపై లావా ట్యూబుల ఉనికిని గుర్తించడం సాధ్యమైంది. ఇలాంటి లావా ట్యూబులు భవిష్యత్తులో చంద్రుడు మానవుల ఆవాసంగా ఉపయోపడే అవకాశాలపై గల ఆశలకు ఊపిరిపోస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం.

చంద్రునిపై ఆసక్తి ఏనాటిదంటే?


గ్రీకు తత్వవేత్త ఆనాక్సగోరాస్‌, ఇటాలియన్‌ శాస్త్రవేత్త గెలీలియో 

చంద్రునిపై మనుషుల్లో ఆసక్తి ఆధునిక పరిశోధనలు మొదలు కావడానికి వేల సంవత్సరాల ముందు నుంచే ఉండేది. నాగరికతలు మొదలు కాక ముందు నుంచే భూమ్మీద నివసించే మనుషులు సూర్యచంద్రులను గమనిస్తూనే ఉన్నారు. నాగరికతలు మొదలైన తొలినాళ్లలో సూర్యచంద్రులను దేవతలుగా ఆరాధించడం మొదలైంది. శాస్త్రీయంగా సూర్యచంద్రుల స్వరూప స్వభావాలను తెలుసుకోవాలనే ఆసక్తి క్రీస్తుపూర్వమే మొదలైంది. సూర్యచంద్రులు రెండూ అంతరిక్షంలోని భారీ రాతిగోళాలని క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందిన గ్రీకు తత్వవేత్త ఆనాక్సగోరాస్‌ తొలిసారిగా ప్రకటించాడు. శాస్త్రీయమైన దృష్టితో తన పరిశీలనకు తోచిన సంగతి చెప్పిన పాపానికి నాటి గ్రీకు పాలకులు మత విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడనే ఆరోపణతో ఆయనను ఖైదులో పెట్టారు.

నిండు పున్నమినాడు భూమ్మీద మనుషులకు చంద్రుడు పూర్ణ కాంతులతో దర్శనమిస్తాడు. ఎంత పూర్ణకాంతులతో ధగధగలాడుతున్నా చంద్రుడిపై అక్కడక్కడా మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలను సైతం నాటి మనుషులు నిశితంగా పరిశీలించారు. చంద్రుడిపై కుందేలు ఆకారంలోని నీడను చూసి అనేక అభూత కల్పనలను ఊహించుకున్నారు. చంద్రుడిపై భారీస్థాయి ఎత్తు పల్లాలు ఉన్నందు వల్లనే చంద్రుడి ఉపరితలంలోని కొన్ని ప్రదేశాలకు సూర్యకాంతి చేరుకోలేకపోతోందని, అందుకే మనకు అక్కడక్కడా మచ్చల్లా కనిపిస్తున్నాయని మొట్టమొదటిసారిగా క్రీస్తుశకం రెండో శతాబ్దికి చెందిన గ్రీకు శాస్త్రవేత్త ప్లూటార్క్‌ తన ‘ఆన్‌ ది ఫేస్‌ ఇన్‌ ది మూన్స్‌ ఆర్బ్‌’ గ్రంథం ద్వారా తెలిపాడు. చంద్రుడిపై పడి పరావర్తనం చెందిన సూర్యకాంతి కారణంగానే చంద్రుడు మనకు వెన్నెల వెలుగులతో కనిపిస్తున్నాడని క్రీస్తుశకం ఐదో శతాబ్దికి చెందిన మన భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట తొలిసారిగా ప్రకటించాడు.

కొంతకాలానికి మనుషులు ఖగోళ విశేషాలను మరింత నిశితంగా తెలుసుకోవడానికి దుర్భిణుల వంటి సాధనాలను రూపొందించుకున్నారు. గ్రహాలు, నక్షత్రాల తీరుతెన్నులను తెలుసుకునే ఉద్దేశంతో వేధశాలలను ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో బాగ్దాద్‌లో ఏర్పాటు చేసిన వేధశాల నుంచి పర్షియన్‌ ఖగోళ శాస్త్రవేత్త హబాష్‌ అల్‌ హసీబ్‌ అల్‌ మర్వాజీ చంద్రుని వ్యాసం 3,037 కిలోమీటర్లు ఉంటుందని, భూమికి చంద్రునికి మధ్యనున్న దూరం 3,46,345 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేశాడు. ఆయన అంచనాలు అధునాతన పరిశోధనల్లో నిగ్గుతేలిన అంచనాలకు దాదాపు దగ్గరగా ఉండటం విశేషం. పదహారో శతాబ్దికి చెందిన ఇటాలియన్‌ శాస్త్రవేత్త గెలీలియో శక్తిమంతమైన టెలిస్కోప్‌ను రూపొందించి, దాని ద్వారా చంద్రుడు, నక్షత్రాలు, గ్రహచలనాలను ఏళ్ల తరబడి పరిశీలించి, అనేక విషయాలను వెల్లడించాడు.

అంతరిక్షంలో భారతీయుడు


సోవియట్‌ రష్యా 1984 ఏప్రిల్‌ 2న ప్రయోగించిన సోయజ్‌ టీ–11 రాకెట్‌ ద్వారా భారత పైలట్‌ రాకేశ్‌ శర్మ చంద్రమండలానికి చేరువగా అంతరిక్ష కక్ష్యలోకి వెళ్లాడు. అంతరిక్షంలో అడుగు మోపిన తొలి భారతీయుడిగా ఘనత సాధించిన రాకేశ్‌ శర్మ అంతరిక్షంలో దాదాపు ఎనిమిది రోజులు గడిపాడు. తిరిగి భూమిపైకి చేరుకున్న తర్వాత రష్యన్‌ బృందంతో కలసి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడినప్పుడు, ఇందిరాగాంధీ ఆయనను ‘అంతరిక్షం నుంచి చూస్తే భారత్‌ ఎలా కనిపించింది?’ అని అడిగారు. ఆమె ప్రశ్నకు రాకేశ్‌ శర్మ ‘సారే జహా సే అచ్ఛా’ (ప్రపంచంలోనే అత్యుత్తమంగా) కనిపించిందని బదులిచ్చాడు. 

ప్రచ్ఛన్న యుద్ధంతో అందిన చందమామ
అమెరికా, సోవియట్‌ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఒకరకంగా చంద్రునిపై ఆధునిక పరిశోధనల పురోగతికి దోహదపడింది. ఇరవయ్యో శతాబ్దిలో నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రెండు దేశాలూ అంతరిక్షంపై ఆధిపత్యం కోసం పోటీ పడ్డాయి. చంద్రునిపై ప్రత్యేకించి దృష్టి సారించాయి. ఎలాగైనా చంద్రునిపైకి చేరుకోవాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలను రంగంలోకి దించి, భారీ స్థాయి పరిశోధనలకు నడుం బిగించాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న హోరాహోరీ పోటీలో కొన్ని విఫలయత్నాల తర్వాత 1959లో లూనా–2 ప్రయోగం ద్వారా రష్యా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

ఆ తర్వాత లూనా–3 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా చేసింది. చంద్రుని ఉపరితలం ఫొటోలను తీసి ప్రపంచానికి చూపింది. రష్యాను మించిన స్థాయిలో ఏకంగా మనిషినే చంద్రునిపైకి పంపాలని నాటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడీ తలచాడు. జాతీయ సత్వర అవసరాల సభలో ఆయన ఈ అంశాన్ని ముందుకు తెచ్చాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు భారీగా నిధులు మంజూరు చేశాడు. ఫలితంగా రష్యా చేపట్టిన లూనా–2 ప్రయోగానికి పదేళ్ల తర్వాత 1969లో అమెరికన్‌ వ్యోమగామి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రునిపై అడుగుమోపగలిగాడు.

వేగం పుంచుకున్న ‘ఇస్రో’
చంద్రునిపై పరిశోధనల్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, రష్యన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్‌కాస్మోస్‌లతో పోల్చుకుంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కాస్త వెనుకబడిందనే చెప్పుకోవాలి. ఇస్రో ఆధ్వర్యంలో చంద్రునిపై చేపట్టిన తొలి ప్రయోగం 2008 నాటి ‘చంద్రయాన్‌–1’. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ‘చంద్రయాన్‌–2’ కోసం అప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. చంద్రునిపై ‘ఇస్రో’ ప్రయోగాలు ‘చంద్రయాన్‌–1’ నుంచి వేగం పుంజుకున్నాయి. ‘చంద్రయాన్‌–2’ పూర్తయిన తర్వాత 2024లో ‘చంద్రయాన్‌–3’ ప్రయోగం చేపట్టడానికి ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement