బెంగళూరు: చంద్రయాన్–3 విజయవంతం కావడంతో జోరుమీదున్న భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. సౌర వాతావరణం అధ్యయనానికి ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని మరో వారం రోజుల్లో పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగం మొదటి ప్రయత్నంలో విజయవంతమయ్యేలా ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. శ్రీహరి కోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 వాహక నౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ‘‘ఆదిత్య–ఎల్1 ప్రయోగం సెప్టెంబర్ 2న జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. రెండు వారాల క్రితమే ఉపగ్రహాన్ని బెంగళూరు నుంచి శ్రీహరి కోటకు తీసుకువచ్చాం’’ అని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు.
ప్రయోగం విశేషాలివే..
► భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజియన్ పాయింట్–1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు
► భూమి నుంచి లాంగ్రేజియన్ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది
► లాంగ్రేజియన్1 పాయింట్‌లో ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం వల్ల గ్రహణాలు వంటివి పరిశోధనలకి అడ్డంకిగా మారవు.
► ఆదిత్య ఎల్–1 ఉపగ్రహం బరువు 1,500 కేజీలు
► సూర్యుడిలో మార్పులు, సౌర వాతావరణం ఎందుకు వేడిగా ఉంటుంది, అంతరిక్ష వాతావరణం, భూవాతావరణంపై దాని ప్రభావం వంటివన్నీ ఆదిత్య–ఎల్1 అధ్యయనం చేస్తుంది. ► సూర్యుడి వెలువల పొరలు, సౌరశక్తి కణాలు, ఫొటోస్ఫియర్ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్ (వర్ణమండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపైన అధ్యయనం జరుగుతుంది.
► మొత్తం ఏడు పే లోడ్లను ఇది మోసుకుపోతుంది. ఈ పేలోడ్లతో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ పేలోడ్ ద్వారా సూర్యగోళం నుంచి ప్రసరించే కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది.
ఈ ఏడాది రికార్డే
► ఇస్రో చరిత్రలో 2023 ఒక రికార్డుగా మిగిలిపోనుంది. సూర్య చంద్రుల లోతుల్ని తెలుసుకోవడానికి రెండు నెలల వ్యవధిలో రెండు ప్రయోగాలు చేయడం చరిత్రే మరి. చంద్రయాన్–3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగడంతో ఇప్పుడు అన్ని దేశాలు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఆదిత్య–ఎల్1 ప్రయోగం కచ్చితంగా విజయవంతమవుతుందనే విశ్వాసం ఏర్పడింది. 2024 చివరికి అంతరిక్షంలోకి మనుషుల్ని పంపి భారతీయుల మరో స్వప్నాన్ని తీర్చాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
ఊహాచిత్రం
2న ఆదిత్య–ఎల్1 ప్రయోగం!
Published Sun, Aug 27 2023 6:00 AM | Last Updated on Sun, Aug 27 2023 8:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment