
బెంగళూరు: చంద్రయాన్–3 మిషన్ ఘన విజయంతో భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమయింది. సౌర వాతావరణంపై అధ్యయనానికి ఉద్దేశించిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని శ్రీహరి కోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 వాహక నౌక ద్వారా సెప్టెంబర్ రెండో తేదీన ఉదయం 11.50 గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో పూర్తి దేశీయంగా అభివృద్ధి పరిచిన ఈ శాటిలైట్‌ను రెండు వారాల క్రితమే శ్రీహరి కోటకు తరలించారు. సూర్యుడి వెలుపల పొరలు, ఫొటోస్ఫియర్ (కాంతి మండలం) క్రోమోస్ఫియర్ (వర్ణ మండలం), కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపై ఆదిత్య–ఎల్1 అధ్యయనం జరుపుతుంది. సౌర వాతావరణంతోపాటు అంతరిక్ష వాతావరణం, భూ వాతావరణంపై దాని ప్రభావాన్ని ఇది అధ్యయనం చేస్తుందని ఇస్రో సోమవారం వెల్లడించింది.
నిరాటంకంగా పరిశోధనలు
భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో వున్న సూర్య వలయం లాంగ్రేజ్ పాయింట్–1 (ఎల్1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. భూమి నుంచి లాంగ్రేజ్ పాయింట్‌కి చేరుకోవడానికి ఆదిత్య ఉపగ్రహానికి 175 రోజులు పడుతుంది. లాంగ్రేజ్ పాయింట్ల వద్ద ఉపగ్రహాలు తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుని నిర్దేశిత కక్ష్యలో ఎక్కువ కాలం కొనసాగడంతోపాటు నిర్దేశిత లక్ష్యాలను అందుకునే అవకాశముంటుందని అంచనా. ఈ కక్ష్యలో ఉండే ఆదిత్య–ఎల్1కు గ్రహణాలు, ఇతర గ్రహాలు అడ్డురావు. పరిశోధనలను నిరాటంకంగా జరిపేందుకు వీలుగా ఉంటుందని ఇస్రో తెలిపింది.
స్వదేశీ పరిజ్ఞానంతో..
సుమారు 1,500 కేజీల బరువైన ఈ శాటిలైట్‌లో ఏడు పేలోడ్లు ఉన్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్(ఐఐఏ) ఆధ్వర్యంలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్‌సీ) పేలోడ్‌ను తయారు చేసింది. పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ అస్ట్రో ఫిజిక్స్ శాస్త్రవేత్తలు సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్(ఎస్‌యూఐటీ)ని తయారు చేశారు. సూర్యుడి ఉపరితలంపై 6వేల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మాత్రమే కాగా, కొరోనా వద్ద 10 లక్షల డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండటానికి కారణాలపై వీఈఎస్‌సీ వివరాలు సేకరించనుందని ఇస్రో వివరించింది.
యూవీ పేలోడ్‌ను, ఎక్స్‌రే పేలోడ్స్‌ను వినియోగించుకుంటూ కొరోనాతోపాటు సోలార్ క్రోమోస్ఫియర్‌లపై ఆదిత్య–ఎల్1 పరిశీలనలు జరపనుంది. స్పెషల్ వాంటేజ్ పాయింట్ ఎల్1ను ఉపయోగించుకుని నాలుగు పేలోడ్లు సూర్యుడిపై ప్రత్యక్ష పరిశీలన జరుపుతాయి. మిగతా మూడు పేలోడ్లలో అమర్చిన పరికరాలు సూర్య కణాలపై పరిశోధనలు సాగిస్తాయి. కొరోనాలో ఉండే మితిమీరిన ఉష్ణోగ్రతలు, కొరోనల్ మాస్ ఇంజెక్షన్(సీఎంఈ), అంతరిక్ష వాతావరణం వంటి వాటిపైనా ఎస్‌యూఐటీ అత్యంత కీలకమైన సమాచారం పంపుతుందని ఆశిస్తున్నట్లు ఇస్రో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment