జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10 రాకెట్ నమూనా
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 12న తెల్లవారుజామున 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ శాస్త్రవేత్తలతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి ప్రయోగానికి సన్నద్ధం చేస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా కరోనా కారణంగా షార్‌లో ప్రయోగాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం తరువాత షార్ కేంద్రంలో కరోనా విజృంభించడంతో ప్రయోగాలకు బ్రేక్ పడింది. 2020లో నాలుగు సార్లు వాయిదా పడిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10 ప్రయోగం ఐదో ప్రయత్నంలో విజయవంతం చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని చేయనున్నారు.
– సూళ్లూరుపేట
కొత్త అధ్యాయానికి నాంది..
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10 (జీఎస్‌ఎల్‌వీ మార్క్2) రాకెట్ ద్వారా 2,268 కిలోల బరువు కలిగిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్–03) అనే ఈ నూతన ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూస్థిర కక్ష్య)లోకి ప్రవేశపెట్టనున్నారు. భూమిని పరిశోధించేందుకు ఇప్పటి దాకా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు) భూమికి 506 నుంచి 830 కిలో మీటర్లు ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ ఆర్బిట్ (సూర్యానువర్థన ధృవ కక్ష్య)లోకి మాత్రమే పంపించేవారు. ఈసారి ఈవోఎస్–03 అనే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను మొట్టమొదటిసారిగా భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టేవిధంగా ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
ప్రత్యేకతలు..
► శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇది 79వ ప్రయోగం.
► జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాల సిరీస్‌లో 14వ ప్రయోగం.
► సొంత క్రయోజనిక్ టెక్నాలజీలో ఇది 8వ ప్రయోగం.
► దేశ భద్రత అవసరాలు, రక్షణ వ్యవస్థకు అనుసంధానం, దేశంలో ఉపద్రవాలు/విపత్తులు సంభవించినపుడు ముందస్తు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈవోఎస్–03 రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.
► ఈ ఉపగ్రహంలో మల్టీ–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్‌ఫ్రారెడ్ (6 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ విజబుల్ అండ్ నియర్–ఇన్‌ఫ్రారెడ్ (158 బాండ్స్), హైపర్–స్పెక్ట్రల్ షార్ట్ వేవ్–ఇన్‌ఫ్రారెడ్ (256 బాండ్స్) పేలోడ్స్‌గా అమర్చారు.
► ఈ ఉపగ్రహం భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తు నుంచి అత్యంత పవర్‌ఫుల్ కెమెరాలతో 50 మీటర్ల నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో భూమిపై జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలను తీసి పంపిస్తుంది. సుమారు 10 సంవత్సరాలు ఈ ఉపగ్రహం తన సేవలను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment