బెంగళూరు: ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 ప్రయోగంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) బుధవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది(2021)లో చంద్రయాన్–3 ప్రయోగాన్ని చేపట్టే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ కె.శివన్ ప్రకటించారు. ఇక మరో ప్రతిష్టాత్మక గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందడానికి భారత వాయు సేనకు చెందిన నలుగురు సిబ్బందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. జనవరి మూడో వారంలో వీరికి రష్యాలో శిక్షణ ప్రారంభంకానున్నట్లు చెప్పారు. చంద్రయాన్–3 ప్రాజెక్టుతోపాటు మొట్టమొదటి భారతదేశ మానవ సహిత గగన్‌యాన్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయని బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివన్ వెల్లడించారు.
చంద్రయాన్–3 ప్రయోగాన్ని 2020లోనే చేపడతామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఇస్రో నుంచి ప్రకటన రావడం గమనార్హం. చంద్రయాన్–2లో మాదిరిగానే చంద్రయాన్–3లోనూ ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉంటాయని అన్నారు. చంద్రయాన్–2లో ఆర్బిటర్ మిషన్ జీవితకాలం 7 సంవత్సరాలని, చంద్రయాన్–3లోనూ దీనిని ఉపయోగిస్తామని చెప్పారు. చంద్రయాన్–2 ప్రయోగంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చంద్రయాన్–3పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. చంద్రయాన్–2 కంటే చంద్రయాన్–3 ప్రయోగానికి తక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ ప్రయోగానికి రూ.250 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేశారు. తమ ప్రయోగాలకు 2020–21 సంవత్సర బడ్జెట్‌లో రూ.14 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇస్రో విజ్ఞప్తి చేసింది.
2020లో 25 ప్రయోగాలు
ప్రస్తుత ఏడాదిలో ఇస్రో సుమారు 25 వరకు ప్రయోగాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించిందని శివన్ వివరించారు. 2019లో పూర్తిచేయని ప్రయోగాలను ఈ ఏడాది మార్చి కల్లా చేపడతామని అన్నారు.
వేగంలోనే విఫలం
వేగాన్ని నియంత్రించే వ్యవస్థ విఫలమవడంతో చంద్రయాన్–2లోని విక్రమ్ ల్యాండర్ వైఫల్యానికి కారణమని శివన్ వివరించారు. అంతర్గత కారణాల వల్లే వేగాన్ని నియంత్రించే వ్యవస్థ వైఫల్యం చెందిందని వెల్లడించారు. ఇక విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనుగొనడంలో సాయపడిన చెన్నైకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను శివన్ అభినందించారు. క్రాష్ ల్యాండింగ్ అయిన విక్రమ్ ల్యాండర్ చిత్రాలను బయటకు విడుదల చేయకూడదన్నది సంస్థ పాలసీ అని తెలిపారు. త్వరలోనే ఇస్రో టెలివిజన్ చానెల్‌ను ఆవిష్కరించనున్నట్లు శివన్ తెలిపారు.
వచ్చే ఏడాది చంద్రయాన్–3
Published Thu, Jan 2 2020 2:04 AM | Last Updated on Thu, Jan 2 2020 2:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment