హెచ్చరించినా... నిర్లక్ష్యం చేశారు
ముందే సమాచారం అందించాం : స్పష్టం చేసిన ఇస్రో డెరైక్టర్ శివన్
చెన్నై: పదిహేను రోజుల ముందే వర్షాలపై ప్రభుత్వాన్ని ఇస్రో హెచ్చరించి ఉంది. అయినా పాలకులు ఖాతరు చేయని దృష్ట్యా, పెను వరదల్ని చవి చూడాల్సి వచ్చింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో నాగర్‌కోయిల్‌లో ఇస్రో డెరైక్టర్ శివన్ వ్యాఖ్యలు చేశారు. వరదలు ప్రజా జీవితాన్ని పిప్పి చేసిన విషయం తెలిసిందే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం తాజాగా వ్యవహరిస్తోంది.
అయితే, ప్రభుత్వానికి పదిహేను రోజుల క్రితమే ఇస్రో సమాచారాన్ని అందించి ఉంది. వర్ష ప్రభావం ఏ మేరకు ఉండబోతోందోనని నివేదిక రూపంలో సమాచారం ఇచ్చినా , పాలకులు ఖాతరు చేయక పోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సోమవారం నాగుర్‌కోయిల్‌లో ఓ మీడియాతో ఇస్రో డెరైక్టర్ శివన్ మాట్లాడుతూ భారీ వర్షాలను ముందే గుర్తించి తమిళనాడు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వివరించారు.
పదిహేను రోజులక్రితం సమాచారం ఇచ్చినా అందుకు తగిన చర్యలు తీసుకోని దృష్ట్యా, పెను విలయం ఏర్పడిందని పేర్కొన్నారు. వాతావరణ సంబంధిత అన్ని వివరాలను తెలుసుకునేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు ఇస్రో వద్ద ఉన్నాయని వివరించారు. ఇస్రో హెచ్చరించినా, పాలకులు ఖాతరు చేయక పోవడంపై ప్రజల్లో అసహనం బయల్దేరుతోంది. తమ జీవితాల మీద ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా అని పెదవి విప్పే వాళ్లు అధికం అయ్యారు.