తమిళనాడులో కేంద్రం ‘కొత్త’ ఆట మొదలు పెట్టిందా..? నూతన గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని డీఎంకే ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాలనుకుంటోందా..? రాజ్‌భవన్ కేంద్రంగా రసవత్తర రాజకీయానికి తెరతీసిందా..? అంటే ప్రస్తుతం అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఢిల్లీలో తొలిసారి కేంద్ర పెద్దలను కలిసి వచ్చిన గవర్నర్.. మంగళవారం విస్తుగొలిపే ఆదేశాలు జారీ చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
సాక్షి, చెన్నై: తమిళనాడులో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై తనకు వివర ణ ఇవ్వాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరయన్బును ఆదేశించారు. ప్రభుత్వ పాలనలో రాజ్‌భవన్ జోక్యంతో రాష్ట్రంలో రాజకీయ వివాదం రాజుకుంది. శాఖల వారీగా పథకాల సమీక్షకు సిద్దంకావాలని గవర్నర్ ఆర్‌ఎన్ రవి జారీచేసిన ఆకస్మిక ఆదేశాలు తీవ్ర కలకలం రేపాయి.
ఢిల్లీ పర్యటన అనంతరం..
రిటైర్డు ఐపీఎస్ అధికారైన ఆర్‌ఎన్ రవి ఈనెల 18వ తేదీన రాష్ట్ర గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. రెండురోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ, సీనియర్ మంత్రులను కలిసి వచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తనకు వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ఆకస్మిక ఉత్తర్వులు జారీచేయడం, ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బుకు ఉత్తరం రాయడం చర్చనీయాంశమైంది. గవర్నర్ తరపున ఆయన కార్యదర్శి అన్ని ప్రభుత్వశాఖల అధికారులకు మంగళవారం ఉత్తరాలు పంపారు. ( చదవండి: అన్నాడీఎంకేలో మళ్లీ కోల్డ్ వార్.. ‘పళని’ ఎత్తు.. ‘పన్నీరు’ పైఎత్తు)
అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వశాఖల పనితీరు, ఆయా శాఖల పరిధిలోని పథకాల అమల్లో ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలని గవర్నర్ ఆశిస్తున్నారు. గవర్నర్ కోరుతున్న వివరాలను తెలియజేసేందుకు సిద్ధంగా ఉండండి. కంప్యూటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దృశ్యరూపాలను తయారు చేసుకోండి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ముందు ఆయా పథకాల తీరుపై చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉండాలి. ఇందుకు సంబంధించి తేదీ, సమయాన్ని మరలా తెలియజేస్తాం’’ ఆ ఉత్తరంలో పేర్కొన్నారు.
దురుద్దేశ పోకడ: టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి
రాష్ట్ర ప్రభుత్వ పథకాల తీరుపై వివరణ కోరడం వెనుక గవర్నర్ దురుద్దేశపోకడ దాగి ఉందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గవర్నర్ చర్య ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమీక్షించే అధికారం గవర్నర్‌కు లేదన్నారు. రాష్ట్రపతి ఆదేశాలను అనుసరించి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేరు గానీ.. ఆయన ప్రజల చేత ఎన్నుక కాలేదని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత సీఎంకు, మంత్రివర్గానికి మాత్రమే ఉంటుందని చెప్పారు. గవర్నర్ ఆదేశాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని దుయ్యబట్టారు.
ఆర్‌ఎన్ రవి నియామకం రోజున తలెత్తిన సందేహాలు ప్రస్తుతం నిజమవుతున్నాయని అన్నారు.‘‘రాష్ట్ర ప్రభుత్వ సుపరిపాలనలో అడ్డంకులు సృష్టించేందుకు, కేంద్రప్రభుత్వ ప్రయోజనాలను కాపాడేందుకు, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కోసం గవర్నర్ ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏజెంటుగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. పథకాల సమీక్ష నిర్ణయాన్ని గవర్నర్ వెనక్కుతీసుకోకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది’’ అని కేఎస్ అళగిరి హెచ్చరించారు. గవర్నర్ తీరు వల్ల రాష్ట్రంలో రెండు పాలనా కేంద్రాలు, గందరగోళ పరిస్థితి ఉత్పన్నం కాగలవని తమిళనాడు మైనార్టీ కమిషన్ చైర్మన్ పీటర్ ఆల్‌బెన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనలో గవర్నర్ జోక్యం చేసుకోరాదన్నారు.
స్టాలిన్ ఏం చేస్తారో..?
అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన సమయాల్లో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు పథకాలపై వివరణ ఇస్తారనే ఆశిస్తున్నారు. అయితే ఇందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అనుమతిస్తారా..? అనే అనుమానాలు కూడా తలెత్తాయి. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ స్వచ్ఛభారత్ పథకం కింద జిల్లాల్లో పర్యటించి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఇందుకు డీఎంకే శ్రేణులు గవర్నర్ చర్యను నిరసిస్తూ నల్లజెండాల ప్రదర్శన చేపట్టారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా గవర్నర్ తనదైన శైలిలో సమీక్షలు కొనసాగించారు. భన్వారీలాల్ పురోహిత్ బదిలీకాగానే ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఆర్‌ఎన్ రవి సైతం అదే పోకడలను అనుసరించడం రాజకీయ కలకలానికి దారితీసింది. అయితే గవర్నర్ ఆదేశాలపై ప్రభుత్వం నుంచి సీఎం స్టాలిన్ సహా ఎవ్వరూ స్పందించ లేదు.
Comments
Please login to add a commentAdd a comment