
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో మాజీ ఇస్రో చీఫ్ కె.శివన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-2 తరహాలో కాకుండా ఇందులోని విక్రమ్ ల్యాండర్ పూర్తిగా ఆటోమేటెడ్ టెక్నాలజీతో తయారుచేసిందని.. ఎటువంటి గ్రౌండ్ సహాయం లేకుండానే ఇది దానంతటదే ల్యాండ్ అవుతుందన్నారు.
మాజీ ఇస్రో చీఫ్ కైలాసవడివూ శివన్ మాట్లాడుతూ చంద్రయాన్-3 ప్రయోగంలో ప్రపల్షన్ మాడ్యూల్ నుండి విక్రమ్ ల్యాండర్ విడిపోవడంతోనే ప్రయోగం కీలక దశకు చేరుకుందని అన్నారు. ఇక్కడి నుండి ఎటువంటి సహకారం అవసరం లేకుండానే ల్యాండర్ దానంతటదే ఆటోమేటిగ్గా ల్యాండ్ అవుతుంది. అంతర్గతంగా ఏర్పాటు చేసిన మేధస్సు ఆధారంగానే అది పనిచేస్తుందని.. దాని వేగాన్ని నియంత్రించుకుని ల్యాండర్ నిర్ణీత సమయానికి నిలువుగా చంద్రుడిపై అడుగుపెడుతుంది. ల్యాండర్ స్థిరపడిన తర్వాత రెండు గంటలకు ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది.
చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైన తర్వాత అందులో జరిగిన తప్పిదాలను ఒక్కొక్కటిగా సవరించి ఈసారి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అందులోని ప్రపల్షన్ వ్యవస్థ, మార్గదర్శక వ్యవస్థ, నియంత్రణ వ్యవస్థ అంతా అప్ గ్రేడ్ చేయబడింది. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు సరిచేసుకునేందుకు వీలుగా అందులోని సెన్సార్ వ్యవస్థ సహాయపడుతుందని ఈసారి ల్యాండర్ ఎంత వేగంతో వెళ్లినా ప్రయోగం మాత్రం విజయవంతం కావడం ఖాయమని అన్నారు.
ఇంతవరకు ఎవ్వరూ చంద్రుడి దక్షిణ భాగాన్ని చేరుకోని నేపథ్యంలో అక్కడ ఆడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించనుంది. చంద్రయాన్-3 అందించే సమాచారం ఆధారంగా ప్రపంచ దేశాల్లో ఎవ్వరైనా చంద్రుడి దక్షిణ ధృవంపై ప్రయోగాలు చేసుకోవచ్చని తెలిపారు మాజీ ఇస్రో చీఫ్.
ఇది కూడా చదవండి: 'ఆయుష్మాన్ భారత్' అద్భుతం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్