
చంద్రయాన్–3ను వీక్షిస్తూ చైన్నెలో కేరింతలు కొడుతున్న ప్రజలు
సాక్షి, చైన్నె : చూసిన కనులదే భాగ్యం.. అన్నట్లు సంబరం అంబరాన్నంటిది.. నెలరాజైన చంద్రుడిని విక్రమ్ ల్యాండర్ ముద్దాడిన క్షణం రాష్ట్రంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. యువత జయహో భారత్ అంటూ నినదిస్తూ ర్యాలీలు నిర్వహించింది. పలుచోట్ల బాణసంచా పేల్చారు. ఇక కళాశాలలు, పాఠశాలలలో విద్యార్థులు చంద్రయాన్ దృశ్యాలను వీక్షించేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇక, చైన్నెలోని అన్నావర్సిటీతో పాటు పలు విద్యా సంస్థల పరిశోధన కేంద్రాల్లో, బిర్లా టెక్నో సెంటర్, ప్లానిటోరియంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో జనం కిక్కిరిశారు.
నిర్ణీత సమయంలో జాబిల్లి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగిన అద్భుత దృశ్యాలను వీక్షించి ఆనంద తాండవం చేశారు. జయహో భారత్ అంటూ నినాదిస్తూ జాతీయ జెండాలతో కేరింతలు కొట్టారు. ర్యాలీలు నిర్వహించారు. చైన్నె, సేలం, కోయంబత్తూరులో ర్యాలీలు హోరెత్తాయి. ఇస్రో నేతృత్వంలో సాగిన ఈ ప్రయోగంలో తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్తలు అధికంగా ఉండటంతో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నినాదాలు మిన్నంటాయి. ముందుగా ఉత్కంఠగా టీవీలకు అతుక్కు పోవడమే కాదు, ప్రయోగం విజయవంతం కావాలని కాంక్షిస్తూ ఆలయాలలో పూజ లు, ప్రార్థనా మందిరాలలో, పాఠశాలలో ప్రార్థనలు జరిగాయి. తిరువళ్లురులోని వెన్‌మనంపుదుర్ పాఠశాలలో విద్యార్థులు ప్రార్థనలు చేశారు.
శుభాకాంక్షల వెల్లువ
చంద్రయాన్ –3 విజయవంతంతో రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి, పుదుచ్చేరి లెప్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఇస్త్రో శాస్తవేత్తల బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం స్టాలిన్ అయితే, చంద్రుడిపై భారత్ అన్న ట్యాగ్ తో ట్వీట్ చేశారు. ఇస్రోకు అభినందనలు తెలియజేశారు. చంద్రుని ఉపరితలంపై భారత్ పాద ముద్రలు చారిత్రాత్మకం అని వ్యాఖ్యానించారు. ఈ విజయం కోసం అహర్నిషలు శ్రమించిన, కృషి చేసిన వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. భారత అంతరిక్ష పరిశోధనల్లో ఈరోజు అతి పెద్ద పండుగ రోజు అని అభివర్ణించారు. అలాగే, అన్నాడీఎంకే ప్రధాన కార్య దర్శి పళణి స్వామితో పాటు పలు పార్టీలకు చెందిన నా యకులు ఇస్రోకు శుభాకాంక్షలు చెప్పారు.


చంద్రాయన్ –3 నమూనాతో బాలుడు

జాతీయ జెండాతో ఆనందోత్సాహాలు
Comments
Please login to add a commentAdd a comment