చందమామపై సల్ఫర్‌ను గుర్తించిన రోవర్
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ ఈ ఏడాది జూలై 14న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 41 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చందమామ దక్షిణ ధ్రువం ఉపరితలంపై నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా అడుగుపెట్టింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి మిషన్‌గా చరిత్ర సృష్టించింది.
దాదాపు 4 గంటల తర్వాత ల్యాండర్ నుంచి ఆరు చక్రాలతో రోవర్ ప్రజ్ఞాన్ విజయవంతంగా బయటకు వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ జాబిల్లి ఉపరితలానికి చేరుకుంది. అటూ ఇటూ తిరుగుతూ చంద్రుడిపై పరిశోధనలు ప్రారంభించింది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తోంది. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్–3 మిషన్ ఏమేం చేసింది? అనే వివరాలను ఇస్రో బహిర్గతం చేసింది.
రోవర్ చాకచక్యం
చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్, ల్యాండర్ నుంచి రోవర్ విజయవంతంగా బయటికి వచ్చి తన కార్యాచరణ ప్రారంభించడం, చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు అనేవి మూడు ప్రధాన లక్ష్యాలు కాగా, ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు నెరవేరాయి. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ భూమిపైకి చేరవేసింది.
అందరూ అనుకుంటున్నట్లు చంద్రుడు చల్లగా ఉండడని, ఉపరితలంపై 70 డిగ్రీల దాకా వేడి ఉంటుందని తేల్చింది. ఆగస్టు 28న తన ప్రయాణానికి 4 మీటర్ల లోతున్న గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్‌ను పాటిస్తూ రోవర్ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ మిషన్‌కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరం. సాంకేతికంగా వాటికి ఇదే చివరి దశ.
- మిగిలిన ఏడు రోజుల్లో చందమామపై ల్యాండర్, రోవర్ మరిన్ని శాస్త్రీయ పరిశోధనలు చేస్తాయి.
- రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై మట్టి స్వభావాన్ని విశ్లేషిస్తుంది.
- చంద్రుడిపై ఉన్న దుమ్ము ధూళీ, రాళ్లలోని రసాయనిక సమ్మేళనాలను రోవర్ గుర్తిస్తుంది. చందమామ ఉపరితల వాతావరణం, ఉపరితలం లోపలి పరిస్థితుల గురించి సమాచారం అందిస్తుంది.
- ల్యాండర్ విక్రమ్‌లో నాలుగు పేలోడ్‌లు ఉన్నాయి. ఇవి చంద్రుడిపై ప్రకంపనలు, ఉపరితలంపై ఉష్ణోగ్రతల స్థితిగతులు, ప్లాస్మాలో మార్పులను అధ్యయనం చేస్తాయి.
- చంద్రుడికి–భూమికి మధ్యనున్న దూరాన్ని కచ్చితంగా లెక్కించడంలో ల్యాండర్‌లోని పేలోడ్‌లు సహకారం అందిస్తాయి.
- చంద్రుడిపై మట్టి స్వభావాన్ని విశ్లేషిం చడం, ఉష్ణోగ్రతలను గుర్తించడం అనేవి అత్యంత కీలకమైనవి.
- చందమామ దక్షిణ ధ్రువంలో చీకటి పడగానే 14 రోజులపాటు ఉష్ణోగ్రత మైనస్ 230 డిగ్రీలకు పడిపోనుంది. ఈ అత్యల్ప ఉష్ణోగ్రతను తట్టుకొని పనిచేసేలా ల్యాండర్‌ను, రోవర్‌ను డిజైన్ చేయలేదు. ఉపరితలంపై సూర్యాస్తమయం కాగానే ఇవి పనిచేయడం ఆగిపోతుంది.
- కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ చంద్రయాన్–3 మిషన్ ఇప్పటిదాకా సాధించింది తక్కువేమీ కాదు. ఎవరూ చూడని జాబిల్లి దక్షిణ ధ్రువం గురించి కీలక సమాచారం అందించింది.
- చంద్రయాన్–3 చివరి దశలోకి ప్రవేశించడంతో ఇక ల్యాండర్, రోవర్ అందించే సమాచారం కోసం ప్రపంచ దేశాలు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాయి.
చంద్రయాన్–3 విజయంపై కేబినెట్ ప్రశంస
చందమామపై చంద్రయాన్–3 ల్యాండర్ విక్రమ్ క్షేమంగా దిగడాన్ని ప్రశంసిస్తూ కేంద్ర కేబినెట్ మంగళవారం తీర్మానం ఆమోదించింది. ఇది కేవలం ‘ఇస్రో’ విజయం మాత్రమే కాదని, దేశ ప్రగతికి, అంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న దేశ గౌరవ ప్రతిష్టలకు నిదర్శనమని కొనియాడింది. ఆగస్టు 23వ తేదీని ‘నేషనల్ స్పేస్ డే’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతించింది. చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోను మంత్రివర్గం అభినందించిందని, సైంటిస్టులకు కృతజ్ఞతలు తెలిపిందని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment