చందమామ రావే.. జాబిల్లి రావే.. కొండెక్కి రావే.. కోటిపూలు తేవే.. అని పాడుతూ.. ఆకాశంలోని చందమామను చూపిస్తూ.. ప్రతి అమ్మా తన బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తుంది.
జాబిలితో చెప్పనా.. అంటూ ఓ ప్రియుడు తన ప్రియురాలిని ఉద్దేశిస్తూ డ్యూయెట్ పాడతాడు..
మామా.. చందమామా.. వినరావా నా కథ.. అంటూ ఒంటరిగా తన గుండెను చందమామ ముందు ఆవిష్కరిస్తూంటాడు ఓ భావుకుడు..
(డెస్క్–రాజమహేంద్రవరం): ఎవరెన్ని విధాలుగా చెప్పినా అందరికీ చందమామ ప్రియమైనదే. జాబిల్లిని చూడగానే గుండె నిండా తెలియని ఆనందం, అనుభూతి కలుగుతాయి. ఆకాశంలో ఉంటూ.. వెన్నెల కురిపిస్తూ.. అందరి మనసుల్లో అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న ఈ చందమామ ఎవరు.. ఏమా కథ.. అక్కడెవరున్నారు.. గ్రహాంతవాసులున్నారా.. అక్కడ కూడా ఆకాశం ఉంటుందా.. గాలి.. నీరు ఉంటాయా.. ఉంటే మనం ఇల్లు కట్టుకోవచ్చా.. ఇలాంటి ఎన్నో సందేహాలు చాలా మందిని వెంటాడుతున్నాయి. సామాన్యులనే కాదు మన ఇస్రో శాస్త్రవేత్తల మదిని కూడా ఇలాంటి ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. అందుకే చందమామ విశేషాల గుట్టును విప్పేందుకు వారందరూ అహరహం శ్రమించారు. దాని ఫలితమే చంద్రయాన్–3. అన్నీ సజావుగా సాగితే బుధవారం సాయంత్రం ఈ వ్యోమనౌక ఓ ఖగోళ అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. అంతరిక్ష రంగంలో మన దేశాన్ని ముందు వరుసలో నిలపనుంది. ఆ క్షణాల కోసం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజానీకం ఒళ్లంతా కళ్లు చేసుకుని కోటి ఆశలతో ఎదురు చూస్తోంది.
చంద్రుడి విశేషాలు
► మన కాలమానం ప్రకారం చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 29.5 రోజులు పడుతుంది. చంద్రుడిపై ఒక్క రోజు భూమిపై దాదాపు ఒక నెలకు సమానం.
► చంద్రుడు భూమిని ఒక్కసారి చుట్టి రావడానికి 27.3 రోజులు పడుతుంది. భూమి – చంద్రుడు – సూర్యుడి మధ్య వ్యవస్థాపక మార్పుల వల్ల చంద్రమాసానికి 29.5 రోజులు పడుతుంది. దీనినే చాంద్రమాసం అంటారు.
► చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి, భూమి చుట్టూ తిరగడానికీ ఒకే సమయం పడుతుంది. దీనివల్ల భూమిపై ఉన్న వారికి చంద్రుడి ఒకే ముఖం కనబడుతుంది. చంద్రుడి ఆవలి వైపు ఎప్పటికీ కనబడదు. దీనిని టైడల్ లాకింగ్ అంటారు.
► చంద్ర మండలంపై వాతావరణం లేదు. అందుకే చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుని పాదముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి.
► చంద్రుడి సాంద్రత భూమి సాంద్రతలో 1/6వ వంతు ఉంటుంది. అందువల్ల భూమిపై 60 కేజీల బరువు ఉండే మనిషి చంద్రునిపై 10 కేజీలు మాత్రమే ఉంటాడు.
► చంద్రుడి గరిష్ట ఉష్ణోగ్రత 127 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత –173 డిగ్రీల సెల్సియస్.
► 1959 సెప్టెంబర్ 14న రష్యా పంపిన లూనా – 2 చంద్రుడి మీదకు మొట్టమొదట దిగింది.
► ఇప్పటి దాకా వ్యోమగాములు 382 కిలోల చంద్ర శిలల్ని భూమి మీదకు తీసుకువచ్చారు.
అందరూ ఆసక్తిగా..
చంద్రుని దక్షిణ ధ్రువంపై పాదం మోపాలనే మన దేశం కలలు నెరవేరే క్షణాలు సమీపిస్తున్నాయి. చంద్రుని విశేషాలను ఆవిష్కరించే అరుదైన ఘట్టం చేరువవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గత నెల 14న శ్రీహరికోటలో చేపట్టిన చంద్రయాన్–3 రాకెట్ ప్రయోగంలో రెండు దశలు ఇప్పటికే విజయవంతమయ్యాయి. మూడో దశలో భాగంగా చంద్రయాన్–3 లోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద సురక్షితంగా ల్యాండ్ అయ్యే ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేందుకు జిల్లా యావత్తూ ఉత్కంఠతో నిరీక్షిస్తోంది.
ఇప్పటికే కొన్ని దేశాలు చంద్రుడిపై రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినా దక్షిణ ధ్రువానికి చేరుకోలేదు. రష్యాకు చెందిన లూనార్–25ను ప్రయోగించినా చివరి దశలో విఫలమైంది. అన్నీ అనుకూలిస్తే నేటి సాయంత్రం 6.04 గంటలకు చందమామపై విక్రమ్ ల్యాండర్ దిగనున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇదే కనుక జరిగితే ప్రపంచంలోనే దక్షిణ ధ్రువానికి చేరిన తొలి దేశంగా భారత్ అంతరిక్ష చరిత్రలో నిలిచిపోనుంది.
Comments
Please login to add a commentAdd a comment