చంద్రయాన్‌–3లో దేవగుప్తం శాస్త్రవేత్త సురేశ్‌ బాబు | Meet Devaguptam Scientist Balabhadra Suresh Babu Who Played Key Role In Chandrayaan 3 Project - Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌–3లో దేవగుప్తం శాస్త్రవేత్త సురేశ్‌ బాబు

Published Mon, Aug 28 2023 4:38 AM | Last Updated on Mon, Aug 28 2023 2:49 PM

Devagupta scientist Suresh Babu in Chandrayaan-3 - Sakshi

సురేశ్‌ బాబు తల్లిదండ్రులు సత్యభారతి, కామేశ్వరరావులను సన్మానిస్తున్న సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు  

అల్లవరం: చంద్రుడి దక్షిణ ధృవంపైన ల్యాండర్‌ను దించిన తొలి దేశంగా భారత్‌ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్‌–3ని ప్రయోగించగా ఈ క్రతువులో ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాలుపంచుకున్నారు. వీరిలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన శాస్త్రవేత్త బలభద్ర సురేష్‌బాబు ఒకరు.

చంద్రయాన్‌–3 ప్రాజెక్టు లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌ (ఎల్‌పీఎస్‌సీ) క్రయోజెనిక్‌ విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఒక మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టినా సురేశ్‌ బాబు కుంగిపోలేదు. గ్రామంలోనే పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయనలా తాను ప్రముఖ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు.

అమలాపురంలోని ఎస్‌కేబీఆర్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ చదివిన సురేశ్‌ బాబు తణుకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. ఆ తర్వాత ట్రిఫుల్‌ ఐటీ బెంగళూరులో విద్యనభ్యసించి త్రివేండ్రంలోని ఇస్రో కేంద్రంలో తొలి పోస్టింగ్‌ పొందారు. చంద్రయాన్‌–3లో కీలక పాత్ర పోషించడం ద్వారా ఎట్టకేలకు తన ఆకాంక్షను నెరవేర్చుకున్నారు.

ఈ నేపథ్యంలో దేవగుప్తం సచివాలయంలో శాస్త్రవేత్త సురేశ్‌ బాబు తల్లిదండ్రులు సత్యభారతి, కామేశ్వరరావులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు సాధనాల వెంకటరావు మాట్లాడుతూ.. చంద్రయాన్‌ విజయంలో గ్రామానికి చెందిన సురేశ్‌ బాబు కీలక పాత్ర పోషించడం దేశానికే గర్వకారణమని అభివర్ణించారు.

నిరుపేద కుటుంబంలో పుట్టినా ఉన్నత స్థాయికి ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన మరిన్ని విజయాలు సాధించి గ్రామానికే కాకుండా, దేశానికి కూడా కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సురేశ్‌ బాబు తండ్రి కామేశ్వరరావు మాట్లాడుతూ.. తన కుమారుడికి చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు తిక్కిరెడ్డి శ్రీను, సుందరనీడి సాయి, ఎంపీటీసీ ముత్తాబత్తుల రాంబాబు, హెచ్‌ఎం వేణుగోపాల్, ఏఎంసీ డైరెక్టర్‌ ఈతకోట సతీష్‌, జగనన్న గృహ సారథుల కన్వీనర్‌ కుడుపూడి సూర్యప్రకాశరావు, వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement